
సాక్షి, సీతంపేట: ఉదయాన్నే స్కూల్‌కి వెళ్లింది..సాయంత్రం స్కూల్ విడిచిపెట్టిన తర్వాత ఇంటికి వచ్చింది. ఇంటిలో కొంత సమయం ఉండి తోటి స్నేహితులతో ఆడుకునేందుకు బయటకు వెళ్లింది. అంతలోనే విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందింది. ఇక ఆ ఇంటిలో చిన్నారి ముద్దులొలికే మాటలు, పట్టీల చప్పుడు ఉండదని తెలియడంతో తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి. మండలంలోని దేవనాపురం గ్రామానికి చెందిన కుండంగి శరణ్య (8) గిరిజన బాలిక విద్యుదాఘాతానికి బలైంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి ఇంటి బయట తోటి చిన్నారులతో ఆడుకుంటూ గ్రామంలో కొండగొర్రి చొక్కారావు ఇంటిపైకి మెట్లు ఎక్కుతుండగా దగ్గర్లో ఉన్న విద్యుత్ వైరు తగిలి కొంతదూరం తుళ్లి పోయింది.
అపస్మారక స్థితిలో ఉన్న బాలికను సీతంపేట సీహెచ్‌సీకి తరలించినప్పటకీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ మృతి చెందింది. రెప్పపాటులో జరిగిన ఈ సంఘటనను చూసి తల్లిదండ్రులు నాగభూషణరావు, కృష్ణవేణిలు గుండెలవిసేలా రోదించారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతుంది. చిన్నారి శరణ్యకు సోదరుడు, సోదరి ఉన్నారు. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. బాలిక మృతిపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ బి.హైమావతి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment