సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌కు గురై ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందటం కలకలం రేపింది. పెళ్లి పనులకోసం అరటి గెలలు కోస్తుండగా పెళ్లి కొడుకు తల్లిదండ్రులతో పాటు మరో ఇద్దరు కుటుంబసభ్యులు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన లావేరు మండలం కొత్తరౌతు పేట గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... కొత్తరౌతు పేట గ్రామానికి చెందిన కొమ్ము వెంకన్న సోమవారం కొడుకు పెళ్లి ఉన్నందున పెళ్లి పనుల నిమిత్తం అరటి గెలలు కోయటానికి అరటి తోటకు వెళ్లాడు. అరటి తోట మధ్యలో హైటెన్షన్ వైర్లు కిందకు వేలాడి వెళుతున్న విషయాన్ని గమనించకుండా వెంకన్న వాటిని తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అరటి గెలలకోసం వెళ్లిన వెంకన్న గంటలు గడుస్తున్నా ఇంటికి రాకపోవటంతో వెంకన్న భార్య పుణ్యవతి, బంధువు ఆబోతుల రాముడు తోటలోకి వెళ్లారు.
అక్కడ వెంకన్న వైర్లను పట్టుకొని ఉండటం గమనించి.. అతన్ని కదిలించడానికి ముట్టుకున్నారు. దీంతో ఇద్దరూ షాక్ గురై మృతి చెందారు. కొద్దిసేపటి తర్వాత రౌతు బంగారమ్మ తోటలోకి వెళ్లి వీరిని తాకడంతో షాక్ తగిలి ఆమె కూడా మృతిచెందింది. పెళ్లి వేడుకతో కళకళ్లాడాల్సిన ఇంట్లో మృత్యువు తాండవించడంతో ఆ ఊర్లో విషాదం నెలకొంది. అప్పటివరకు పెళ్లి పనులతో బిజీబిజీగా గడిపిన వారు విగతజీవులుగా మారడంతో అక్కడివారు కన్నీటి పర్యంతమవుతున్నారు. విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హైటెన్షన్ వైర్లు అలా కిందకు వేలాడేలా ఉంచిన అధికారుల తీరుపై గ్రామస్తులు భగ్గుమంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment