విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి మృతి | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి మృతి

Published Mon, Feb 5 2024 12:12 AM

- - Sakshi

ఓబులవారిపల్లె : మండలంలోని కొర్లకుంట చెరువు సమీపంలో విద్యుత్‌ షాక్‌తో తుపాకుల సుబ్రమణ్యం (35) అనే వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు రైల్వేకోడూరు మండలం, బొజ్జవారిపల్లి పంచాయతీ, బంగ్లామిట్ట గ్రామానికి చెందిన సుబ్రమణ్యం శుక్రవారం రాత్రి తన బావమరిది ఎం.శివతో కలిసి కొర్లకుంట చెరువు వద్దకు చేపల వేటకు వెళ్లాడు.

దారిలో గుర్తు తెలియని వ్యక్తులు విద్యుత్‌ తీగలు తీయడంతో తీగలు తగిలి విద్యుత్‌ షాక్‌కు గురయ్యాడు. గాయపడిన సుబ్రమణ్యంను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. మృతునికి భార్య ఉంది. రైల్వేకోడూరు పరిసర ప్రాంతాలలో సుబ్రమణ్యం ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేసేవాడు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చిన్నపెద్దయ్య తెలిపారు.

కన్న తల్లిని హతమార్చిన కూతురు
వాల్మీకిపురం :
కుటుంబ కలహాల నేపథ్యంలో కన్న తల్లిని హతమార్చిన సంఘటన వాల్మీకిపురం పట్టణం కొత్త ఇందిరమ్మ కాలనీలో చోటు చేసుకొంది. ఎస్‌ఐ నాగేశ్వరరావు కథనం మేరకు.. అనంతపురం జిల్లా కనేకల్లు మండలం హనకనహళ్‌ నివాసి యర్రక్క (43) స్థానికంగా నివాసం ఉంటూ కూలిపనులు చేసుకునేది.

కుటుంబ కలహాలతో ఆదివారం కూతురు నందిని, అల్లుడు శివరాంలు ఐరన్‌ రాడ్‌, కట్టెలతో కొట్టి యర్రక్కను హత్య చేశారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్‌ఐ నాగేశ్వర రావు సంఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రుణం చెల్లించలేదని ఆత్మహత్యాయత్నం
మదనపల్లె :
తాను ఇప్పించిన రుణం చెల్లించకపోవడంతో పాటు, తనపై దాడి చేయడంతో మనస్థాపం చెంది, వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఆదివారం మదనపల్లె లో జరిగింది. పట్టణంలోని ఎగువ కురవంకకు చెందిన తిరుపాల్‌ నాయక్‌ భార్య తిరుపాలమ్మ (42), స్వయం సహాయక సంఘంలో సభ్యురాలుగా ఉంటోంది. అదే ప్రాంతంలో నివాసం ఉన్న స్వరూపారాణి పట్టణంలో హోటల్‌ నిర్వహిస్తోంది.

దీంతో వ్యాపార అవసరాల కోసం తిరుపాలమ్మను నగదు రుణంగా కావాలని కోరింది. ఆమె సుమారు పది లక్షల రూపాయల వరకు స్వరూప రాణికి స్వయం సహాయక సంఘాల నుంచి రుణం తీసుకుని అప్పుగా ఇచ్చింది. అయితే స్వరూపారాణి తీసుకున్న అప్పు సక్రమంగా చెల్లించకపోవడంతో, తిరుపాలమ్మ ఆమెను అప్పు చెల్లించాల్సిందిగా నిలదీసింది. స్వరూప రాణి అప్పు చెల్లించకపోగా దాడికి పాల్పడింది.

దీంతో మనస్థాపం చెందిన తిరుపాలమ్మ ఇంటి వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. వన్‌ టౌన్‌ పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.

ముఖ్య గమని​క:
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com

Advertisement
 
Advertisement
 
Advertisement