శాశ్వత సౌందర్యం
ఆత్మీయం
పూర్వం ఒక ధనికుడు నూతన భవనం నిర్మించాలని అనుకున్నాడు. భవన నిర్మాణం కోసం.. ‘గరుకుతనం లేకుండా, నున్నగా ఉన్న కొన్ని కొయ్య స్తంభాలు తీసుకురమ్మ’ ని తన సేవకులను ఆదేశించాడు. యజమాని ఆజ్ఞ ప్రకారం సేవకులు ఊరూరా గాలించారు. ఎక్కడ చూసినా.. కొయ్యలు కాస్త గరుగ్గానే ఉండటంతో.. అవి పనికిరావని భావించారు. ఈ క్రమంలో టేకు కొయ్యలను కూడా వద్దనుకున్నారు. ఇలా వెళ్తుండగా.. ఒక ఊరి చివరన ఉన్న అరటితోటపై సేవకుల దృష్టి పడింది. అక్కడ అరటి బోదెలను చూసి ఎంత నునుపుగా ఉన్నాయో అని ముచ్చటపడి, భారీ ధర చెల్లించి వందలాది అరటి బోదెలను కొన్నారు.
వాటన్నింటినీ బళ్లలో వేసుకుని ఇంటికి చేరుకున్నారు. ‘మీరు ఎన్నడూ చూడని నునుపైన, అందమైన కొయ్యలను తెచ్చాం. చూడండి’ అని యజమానితో అన్నారు గొప్పగా. అరటి బోదెలను చూసిన యజమాని కోపంతో ‘ఎంత పని చేశార్రా! పైపై సౌందర్యం చూసి మోసపోయారు. ఇవి అరటి బోదెలు. పైకి అందంగా కనిపించినా.. వీటిలో సత్తువ ఉండదు. ఇవి ఇల్లు కట్టుకోవడానికి పనికి రావు. అనవసరంగా డబ్బు తగలేశారు’ అని చీవాట్లు పెట్టి, తానే స్వయంగా వెళ్లి మంచి టేకు కొయ్యలను కొనుగోలు చేశాడు. ప్రాపంచిక విషయాలు కూడా ఇలా అందంగా కనిపిస్తాయి. కానీ, అవి తాత్కాలికమైనవి. శాశ్వతమైనదే సుందరమైనది. అంటే భగవంతుడొక్కడే అందమైన వాడు. శాశ్వతమైనవాడు. అలాగే పైకి అందంగా కనిపించిన వారందరూ మంచివాళ్లు కాకపోవచ్చు. అలాగే అందవికారంగా కనిపించిన వారందరూ చెడ్డవాళ్లు కారు, కాబోరు.