మచ్చతెగులుతో జాగ్రత్త
– ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ మాధవి
- అరటి రైతులకు శిక్షణ
అనంతపురం అగ్రికల్చర్ : ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితుల్లో అరటి తోటల్లో మచ్చతెగులు ఆశించే అవకాశం ఉన్నందున రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) శాస్త్రవేత్త డాక్టర్ త్రికలా మాధవి తెలిపారు. మంగళవారం స్థానిక ప్రాంతీయ ఉద్యాన శిక్షణ కేంద్రంలో ప్రిన్సిపల్ ఎస్.చంద్రశేఖరగుప్తా ఆధ్వర్యంలో అరటిసాగుపై రైతులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో సాగు పద్ధతుల గురించి డాక్టర్ మాధవి, సేంద్రియ పద్ధతుల అంశంపై రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ విజయశంకరబాబు హాజరై అవగాహన కల్పించారు.
గ్రాండ్–9 రకం బెస్ట్
ఇపుడున్న పరిస్థితుల్లో టిష్యూ కల్చర్ అరటిలో గ్రాండ్–9 రకం సాగు చేయడం శ్రేయస్కరం. కొన్ని రకాల తెగుళ్లు, చీడపీడలను అధిగమించే సత్తా ఈ రకానికి ఉంది. ప్రస్తుత వాతావరణంలో అరటిలో సిగటోకమచ్చ తెగులు ఆశించే అవకాశం ఎక్కువ. నివారణకు 1 గ్రాము కార్బండిజమ్ లీటర్ నీటికి కలిపి గెల బాగా తడిచేలా పిచికారి చేసుకోవాలి. అలాగే అరటి హస్తాలు బాగా అభివృద్ధి చెందడానికి 10 గ్రాములు 13–0–45 + 5 గ్రాముల యూరియా లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. గెల వేయగానే ఆరోగ్యంగా ఎదగడానికి పాలిథీన్‌కవర్లతో కప్పిపెట్టాలి.
పాలిథీన్ కవర్లు వేసే ముందు 5 గ్రాములు 13–0–45 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకుంటే మేలు. గెల వేయగానే కిందనున్న మగపువ్వును కోసివేస్తే గెల మొత్తం హస్తాలు బాగా వృద్ధి చెందుతాయి. మొక్కలు నాటే సమయంలో మాత్రమే సూపర్‌పాస్ఫేట్ వేయాలి. గెల సమయంలో అసలు వాడకూడదు. గెల వేసిన తర్వాత పొటాష్, నత్రజని ఎరువులతో పాటు ఐరన్, జింక్ సల్ఫేట్ వాడితే దిగుబడులు పెరుగుతాయి. రసాయన ఎరువులతో పాటు ఆవుపేడ, వర్మీ కంపోస్టు లాంటి సేంద్రియ ఎరువులు వాడటం వల్ల అరటి ఉత్పత్తులు నాణ్యంగానూ, అధిక దిగుబడులు వస్తాయి. ఈ రకం అరటికి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంటుంది.