రాజుపాళెంలో కాలిపోతున్న గడ్డివామి, కొట్టం
వేసవి కాలం వచ్చేసింది... అగ్నిప్రమాదాలు అధికమయ్యాయి... జిల్లాలో రోజూ ఏదో ఒక ప్రాంతంలో జరుగుతూనే ఉన్నాయి.. ముఖ్యంగా విద్యుదాఘాతాలు సంభవిస్తున్నాయి... కొన్ని చోట్ల ఎండిన గడ్డికి ఆకతాయిలు నిప్పు పెట్టడంతో మంటలు పంట పొలాలకు వ్యాపిస్తున్నాయి... శుక్రవారం ఒక్క రోజే మూడు ప్రాంతాల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించి అగ్నిప్రమాదాలు జరిగాయి... దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు.
కాశినాయన : మండలంలోని సావిశెట్టిపల్లెకు చెందిన కె.రామసుబ్బమ్మ, కె.చైతన్య, కె.కుళ్లాయమ్మ, చెన్నకేశవరెడ్డికి చెందిన 8 ఎకరాల్లోని అరటి పంట దగ్ధమైంది. గ్రామస్తులు, ఆర్‌ఐ మోహన్‌రాజు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం రాత్రి విద్యుదాఘాతం సంభవించడంతో అరటి పంటతోపాటు డ్రిప్ వైర్లు కాలిపోయాయి. రూ.8 లక్షల మేర నష్టం వాటిల్లింది. అప్పు చేసి పంటను సాగు చేశామని, తీరా కోతకు వచ్చే సమయంలో కాలిపోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ, ఉద్యానవన శాఖల అధికారులు నష్టపరిహారం అందజేయాలని వారు కోరారు.
గడ్డంవారిపల్లెలో నిమ్మ చెట్లు...
చక్రాయపేట : ఎర్రబొమ్మనపల్లె గ్రామ పంచాయతీలోని గడ్డంవారిపల్లెలో శుక్రవారం విద్యుదాఘాతంతో నిమ్మ చెట్లు కాలిపోయాయి. వివరాలలోకి వెళితే.. గడ్డంవారిపల్లెకు చెందిన చిట్టెం రాజారెడ్డి పొలంలో 30 నిమ్మ చెట్లపై విద్యుత్ వైర్లు తెగి పడి కాలిపోయాయి. సుమారు రూ.3 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఏడేళ్లుగా నిమ్మ చెట్లను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని కోరారు.
రాజుపాళెం : రాజుపాళెంలోని ఎస్సీ కాలనీలో విద్యుదాఘాతం సంభవించడంతో శుక్రవారం బోదకొట్టం, గడ్డివామి దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన పెద్దకాటిగాళ్ల నరసింహుడు పది ట్రిప్పులు చొప్ప తోలుకొని పశువులకు వామి వేసుకుం టున్నాడు. పక్కనే గోవాకు నరసింహుడు చిన్న బోద కొట్టంలో నివసిస్తున్నాడు. ఆయన అతుకులు వేసిన విద్యుత్ వైరును కొట్టానికి వేసుకున్నాడు. ఆ అతుకుల వద్ద షార్ట్ సర్క్యూట్ సంభవించి మంటలు వచ్చాయి. ఆ సమయంలో 12 మంది కూలీలు వామి వేస్తున్నారు. వారందరూ కిందికి దూకారు. మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా అదుపులోకి రాలే దు. సమాచారం అందుకున్న ప్రొద్దుటూరు అగ్నిమాపక అధికారి రామన్న, సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి వచ్చి మంటలను ఆర్పివేశారు. అప్పటికే వామి, కొట్టం కాలిపోయాయి. ఈ ఘటనలో పెద్దకాటిగాళ్ల నరసింహుడుకు రూ.50 వేలు, గోవాకు నరసింహుడుకు రూ.60 వేల ఆస్తి నష్టం, బాలయ్యకు చెందిన దూడ చనిపోవడంతో రూ.6 వేల నష్టం వాటిల్లింది. తహసీల్దార్ కేవీ ప్రభాకరరెడ్డి, ఎస్‌ఐ శ్రీనివాస్, వీఆర్‌ఓలు సుబ్బారెడ్డి, రామయ్య, లక్ష్మీనారాయణరెడ్డి పరిశీలించారు. నష్ట పరిహారం కోసం ప్రభుత్వానికి నివేదిస్తామని తహసీల్దార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment