న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021 ఏప్రిల్–2022 మార్చి) రెండు కరోనా వేవ్‌లను తట్టుకుని పటిష్ట రికవరీ బాటన పయనించిందనడానికి సంకేతంగా పటిష్ట పన్ను వసూళ్ల గణాంకాలు వెలువడ్డాయి. అధికారిక గణాంకాల ప్రకారం మార్చి 15వ తేదీ వరకూ ప్రత్యక్ష పన్ను వసూళ్లు 48 శాతంపైగా పెరిగితే, అడ్వాన్స్ పన్ను చెల్లింపులు 41 శాతం ఎగశాయి. ఈ స్థాయి వసూళ్లు భారత్ చరిత్రలో ఇదే తొలిసారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 2020–21 ఆర్థిక సంవత్సరం కోవిడ్–19 సవాళ్ల నుంచి బయటపడుతున్న సమయంలోనే 2021 ఏప్రిల్, మేలలో రెండవవేవ్ దేశాన్ని కుదిపివేసింది. 2021 ప్రారంభంలో వచ్చిన థర్డ్ వేవ్ తీవ్ర ప్రాణనష్టాన్ని కలిగించకపోయినా, స్థానిక ఆంక్షల వల్ల బిజినెస్ సెంటిమెంట్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. అయినప్పటికీ పన్ను వసూళ్లు చరిత్ర సృష్టించిన పన్ను
వసూళ్ల గణాంకాలను పరిశీలిస్తే...
►2022 మార్చి 16 వరకూ నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు (వ్యక్తులు, కార్పొరేట్ల నుంచి) గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చిచూస్తే 48 శాతం పెరిగి రూ.9,18,431 కోట్ల నుంచి 13,63,038 కోట్లకు ఎగశాయి. దేశంలోకి కరోనా సమస్య ప్రవేశించకముందు పరిస్థితితో పోల్చినా (2019–20లో రూ.9.56 లక్షల కోట్లు) తాజాగా వసూళ్లు 42 శాతం పెరిగాయి.
► రిఫండ్స్ రూ.1.87 లక్షల కోట్లు మినహాయించగా, నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లలో కార్పొరేట్ ఆదాయపు పన్ను పరిమాణం రూ.7,19,035 కోట్లుకాగా, ఎస్‌టీటీసహా వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు రూ.6,40,588 కోట్లు. రిఫండ్స్‌ను కూడా కలుపుకుంటే, మొత్తం వసూళ్లు రూ.11,20,639 కోట్ల నుంచి రూ.15,50,364 కోట్లకు చేరింది.
► ఇక మార్చి 15వ తేదీతో ముగిసిన నాల్గవ విడత ముందస్తు (అడ్వాన్స్) ట్యాక్స్ చెల్లింపుల గడువును పరిశీలిస్తే, సమీక్షా కాలంలో ఈ పరిమాణం 40.75 శాతం పెరిగి రూ.6.62 లక్షల కోట్లకు ఎగసింది. 2020–21 ఇదే కాలంలో ఈ వసూళ్లు రూ.4,70,984.4 కోట్లు. మొత్తం అడ్వాన్స్ పన్నులు రూ.6,62,896.3 కోట్లలో రూ.4,84,451.8 కోట్లు కార్పొరేట్ల నుంచి రాగా, వ్యక్తిగత పన్నుల పరిమాణం రూ.1,78,441.1 కోట్లుగా ఉంది. అయితే ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా ఈ విలువ మరింత పెరిగే అవకాశం ఉంది.
► మొత్తం వసూళ్లలో అడ్వాన్స్ ట్యాక్స్ రూ.6,62,896.3 కోట్లుకాగా, 6,86,798.7 కోట్లు మూలం వద్ద పన్ను మినహాయింపునకు సంబంధించినది. రూ. 1,34,391.1 కోట్ల స్వీయ–అసెస్‌మెంట్ పన్ను, సాధారణ మదింపు పన్ను రూ. 55,249.5 కోట్లు, డివిడెండ్ పంపిణీ పన్ను రూ. 7,486.6 కోట్లు. ఇతర మైనర్ హెడ్‌ల కింద వసూళ్లు రూ. 3,542.1 కోట్లు.
► మొత్తం ప్రత్యక్ష పన్ను వసూళ్లలో దాదాపు 53 శాతం కార్పొరేట్ పన్ను నుండి వచ్చింది. 47 శాతం షేర్లపై సెక్యూరిటీల లావాదేవీల పన్ను (ఎస్‌టీటీ) సహా వ్యక్తిగత ఆదాయ పన్ను నుండి లభించింది.
► 2021–22లో ప్రత్యక్ష పన్ను వసూళ్ల బడ్జెట్ అంచనా రూ.11.08 లక్షల కోట్లు. ఈ ఏడాది ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో దీనిని రూ.12.50 లక్షల కోట్లకు సవరించారు. ఈ అంచనాలకన్నా అధికంగా నికర పన్ను వసూళ్లు అధికంగా ఉండడం గమనార్హం.
6.63 కోట్ల ఐటీఆర్‌లు
గడిచిన ఆర్థిక సంవత్సరానికి (2020–21) సంబంధించి ఈ నెల 15 నాటికి 6.63 కోట్ల ఐటీఆర్‌లు ఈ ఫైలింగ్ పోర్టల్‌పై దాఖలయ్యాయి. గతేడాదితో పోలిస్తే 16.7 లక్షల రిటర్నులు అధికంగా దాఖలైనట్టు ఆదాయపన్ను శాఖ (ఐటీ) ప్రకటించింది. కార్పొరేట్లు, ఆడిట్ రిపోర్ట్‌లు దాఖలు చేయాల్సిన ఇతర పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్‌లు దాఖలు చేసేందుకు గడువు మార్చి 15తో ముగిసింది. ఒక్క చివరి తేదీనే 5.43 లక్షల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. ఈ మేరకు రిటర్నుల గణాంకాలను ఐటీ శాఖ బుధవారం విడుదల చేసింది. ఐటీఆర్–1 (3.03 కోట్లు), ఐటీఆర్–2 (57.6లక్షలు), ఐటీఆర్–3 (1.02 కోట్లు), ఐటీఆర్–4 (1.75 కోట్లు), ఐటీఆర్–5 (15.1లక్షలు), ఐటీఆర్–6 (9.3లక్షలు), ఐటీఆర్–7 (2.18లక్షల) చొప్పున ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment