బడ్జెట్ ద్రవ్యోల్బణాన్ని పెంచేది కాదు
ద్రవ్యలోటు తగ్గించే చర్యలకు చోటు
ఆర్థిక శాఖ కార్యదర్శి తుహిన్ కాంత పాండే
న్యూఢిల్లీ: కొత్త ప్రత్యక్ష పన్నుల కోడ్(ఐటీ చట్టం) లో ఎలాంటి కొత్త పన్నులు ఉండబోవని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి తుహిన్ కాంత పాండే(Tuhin Kanta Pandey) స్పష్టం చేశారు. అలాగే బడ్జెట్ 2025 ద్రవ్యోల్బణానికి ఆ జ్యం పోసేది కాదన్నారు. ద్రవ్యలోటు తగ్గింపుతో, ద్రవ్యోల్బణాన్ని పెంచని బడ్జెట్‌ను అందించినట్టు చెప్పారు. వృద్ధికి మద్దతునిచ్చే ద్రవ్య విధానానికి అనుగుణంగా ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కూడా ఉంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. తద్వారా వడ్డీ రేట్లలో మార్పు ఉండొచ్చన్న సంకేతాన్నిచ్చినట్టయింది.
మీడియాతో మాట్లాడిన సందర్భంగా పలు అంశాలపై గందరగోళం, అయోమయాన్ని తొలగించే ప్రయత్నం చేశారు పాండే. మూలధన లాభాల పన్ను లేదా సెక్యూరిటీల లావాదేవీల పన్ను పెంపు రూపంలో ఊహించనిది ఏదైనా ఉంటుందా? అన్న ప్రశ్నకు అలాంటిదేమీ లేదని తోసిపుచ్చారు. ప్రస్తుత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే వారం వ్యవధిలో కొత్త ఆదాయపన్ను చట్టాన్ని ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. ఇది పూర్తిగా కొత్త బిల్లు, తిరగ రాసిందంటూ దీన్ని పార్లమెంట్ ఆమోదించాల్సి ఉందన్నారు పాండే.
‘‘ఇది పన్ను రేట్లను మార్చదు. నిర్మాణాత్మకంగా పూర్తి మార్పునకు గురికానుంది. హేతుబద్దీకరణతోపాటు ప్రక్రియలను సులభంగా మార్చడం ఇందులో కనిపిస్తుంది. ఇందులో ఎన్నో సంస్కరణలు ఉంటాయి. వచ్చే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది’’అని పాండే వివరించారు. ప్రస్తుత పన్ను చట్టంతో పోల్చితే సగమే ఉంటుందన్న ఆర్థిక మంత్రి
ప్రకటనను గుర్తు చేశారు.
వృద్ధి నిలకడగా కొనసాగాలంటే ద్రవ్యోల్బణంపై మంచి నియంత్రణ అవసరమని, రెండింటి మధ్య సమతుల్యం అవసరమన్నారు. ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశం ఈ నెల 5న ప్రారంభం కానుంది. 7వ తేదీన నిర్ణయాలు వెలువడనున్నాయి. ఈ సమావేశంలో రేట్ల కోత నిర్ణయం ఉంటుందా? అన్న ప్రశ్నకు.. పరిస్థితిని వారు తెలుసుకున్నారని, దీనిపై వారే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పాండే బదులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment