tax collecting
-
మిల్లెట్ల పిండిపై 5% పన్ను
న్యూఢిల్లీ: త్రుణ ధాన్యాల ఆధారిత పిండిపై 5 శాతం పన్ను విధించాలని జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. లూజుగా విక్రయించే కనీసం 70 శాతం త్రుణధాన్యాల పిండిపై ఎలాంటి పన్ను ఉండదని ఆమె తెలిపారు. అదే ప్యాకేజీ రూపంలో లేబుల్‌తో విక్రయించే పిండిపై మాత్రం 5 శాతం పన్ను ఉంటుందని వివరించారు. జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ (జీఎస్టీఏటీ)ప్రెసిడెంట్‌కు 70 ఏళ్లు, సభ్యులకైతే 67 ఏళ్ల గరిష్ట వయో పరిమితి విధించాలని కూడా 52వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్ణయించిందన్నారు. గతంలో ఇది వరుసగా 67, 65 ఏళ్లుగా ఉండేదన్నారు. మొలాసెస్‌పై ప్రస్తుతమున్న 28 శాతం జీఎస్టీని, 5 శాతానికి తగ్గించడంతోపాటు మానవ అవసరాల కోసం వినియోగించే డిస్టిల్డ్ ఆల్కహాల్‌కు జీఎస్టీ నుంచి మినహాయింపు కల్పించినట్లు మంత్రి చెప్పారు. ఒక కంపెనీ తన అనుబంధ కంపెనీకి కార్పొరేట్ గ్యారెంటీ ఇచ్చినప్పుడు, ఆ విలువను కార్పొరేట్ గ్యారెంటీలో 1 శాతంగా పరిగణిస్తారు. దీనిపై జీఎస్టీ 18 శాతం విధించాలని కూడా కౌన్సిల్ నిర్ణయించిందన్నారు. -
ప్యాకేజ్డ్ ఆహారోత్పత్తులపై జీఎస్టీ బాదుడు.. పెరుగు, మజ్జిగలపైనా పెంపు
న్యూఢిల్లీ: నిత్యావసర ఉత్పత్తులపై జీఎస్టీ బాదుడు షురూ అయింది. 25 కిలోలు/లీటర్లు, అంతకులోపు పరిమాణంలో ఉండే ప్యాకేజ్డ్ ఆహారోత్పత్తులపై (బ్రాండెడ్ కాకపోయినా) కొత్తగా 5 శాతం జీఎస్టీ పడనుంది. ప్యాక్ చేసి విక్రయించే గోధుమ పిండి, మైదా వంటి అన్ని రకాల పిండులు, బియ్యం, గోధుమల వంటి ధాన్యాలు, పప్పు దినుసులు తదితరాలన్నింటికీ ఇది వర్తిస్తుంది. వీటిని ‘ప్రీ ప్యాకేజ్డ్, లేబుల్డ్ కమోడిటీ’ విభాగం కిందకు చేరుస్తూ 5 శాతం జీఎస్టీని కేంద్రం సోమవారం నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. వీటిని లూజ్‌గా కొనుగోలు చేస్తే ఈ పన్నుండదని పరోక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీఐసీ) పేర్కొంది. అలాగే 25 కిలోలకు/లీటర్లకు మించిన పరిమాణంలో విక్రయించినా జీఎస్టీ పడదని స్పష్టం చేసింది. కొత్త పన్ను రేట్లపై సందేహాలను నివృత్తి చేస్తూ తాజాగా ప్రకటన విడుదల చేసింది. ధరలు పెంచిన ప్రముఖ సంస్థలు పెరుగు, మజ్జిగ, పనీర్, టెట్రా ప్యాక్‌లో విక్రయించే పానీయాలపైనా జీఎస్టీ 12 నుంచి 18 శాతానికి పెరిగింది. ఈ నిర్ణయాన్ని ప్రముఖ సంస్థలు అమల్లోకి తీసుకొచ్చేశాయి. బటర్‌మిల్క్, పెరుగు, లస్సీ, టెట్రా ప్యాక్‌ల్లో విక్రయించే పానీయాలపై ధరలను 5 శాతం పెంచినట్టు అమూల్ బ్రాండ్ పేర్కొంది. కొత్త జీఎస్టీ రేట్ల ప్రకారం ధరలను సవరిస్తున్నట్టు మదర్ డెయిరీ కూడా మంగళవారమే ప్రకటన జారీ చేసింది. ఇదీ చదవండి: ఇలా అయితే జీఎస్టీ ఉండదు: నిర్మలా సీతారామన్ క్లారిటీ -
భారత్‌కు కెయిర్న్ షాక్..
న్యూఢిల్లీ: బ్రిటన్ దిగ్గజం కెయిర్న్ ఎనర్జీతో రెట్రాస్పెక్టివ్ పన్నుల వివాదంలో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. తనకు రావాల్సిన పరిహారాన్ని రాబట్టుకునేందుకు ప్యారిస్‌లో భారత్‌కి ఉన్న 20 ప్రభుత్వ ఆస్తులను జప్తు చేసుకునేందుకు కెయిర్న్ ఎనర్జీకి అనుకూలంగా ఫ్రాన్స్ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. ఎక్కువగా ఫ్లాట్ల రూపంలో ఉన్న ఈ ప్రాపర్టీలను భారత ప్రభుత్వం ఫ్రాన్స్‌లో తమ కార్యకలాపాలకు ఉపయోగిస్తోంది. వీటి విలువ సుమారు 20 మిలియన్ యూరోల దాకా ఉంటుందని అంచనా. తమకు అనుకూలంగా వచ్చిన ఉత్తర్వుల ఊతంతో ఆయా ప్రాపర్టీల్లో ఉన్న భారత అధికారులను కెయిర్న్ వెళ్లగొట్టే అవకాశాలు తక్కువే అయినా, కోర్టు ఆదేశాల కారణంగా వాటిని భారత ప్రభుత్వం విక్రయించడానికి ఉండదు. మరోవైపు, ఫ్రాన్స్ న్యాయస్థానం నుంచి తమకు ఇంకా ఎలాంటి ఉత్తర్వులు అందలేదని, అందిన తర్వాత చట్టపరంగా తగు పరిష్కార మార్గాలు అమలు చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. వివరాల్లోకి వెడితే.. కెయిర్న్ ఎనర్జీ 1994లో భారత్‌లో చమురు, గ్యాస్ రంగంలో ఇన్వెస్ట్ చేసింది. 2006లో తన భారత విభాగాన్ని బీఎస్ఈలో లిస్ట్ చేసింది. ఈ క్రమంలో కార్యకలాపాల పునర్వ్యవస్థీకరణ ద్వారా కెయిర్న్ ఎనర్జీ లబ్ధి పొందిందని, దానికి సంబంధించి రూ. 10,247 కోట్ల మేర పన్ను పెనాల్టీ, వడ్డీ కట్టాలని కెయిర్న్‌కు ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. గత డీల్స్‌కు కూడా వర్తించేలా సవరించిన పన్ను చట్టాలకు (రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్) అనుగుణంగా వీటిని జారీ చేసింది. భారత విభాగంలో కెయిర్న్‌కు ఉన్న షేర్లను, దానికి రావాల్సిన డివిడెండ్లు మొదలైన వాటిని జప్తు చేసింది. దీన్ని కెయిర్న్ ఎనర్జీ పలు న్యాయస్థానాలతో పాటు అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌లో సవాలు చేయగా.. కంపెనీకి అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. కెయిర్న్‌కు 1.72 బిలియన్ డాలర్లు పరిహారం ఇవ్వాలంటూ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ భారత్‌కు సూచించింది. కానీ కేంద్రం ఇందుకు సుముఖంగా లేకపోవడంతో విదేశాల్లో భారత్‌కి ఉన్న ఆస్తులను జప్తు చేయడం ద్వారా పరిహారాన్ని రాబట్టుకోవాలని కెయిర్న్ యోచిస్తోంది. దీనికోసం అమెరికా, ఫ్రాన్స్ తదితర దేశాల్లో ఆర్బిట్రేషన్ ప్యానెల్ ఆదేశాల అమలు కోరుతూ పిటీషన్లు దాఖలు చేసింది. -
పన్ను వసూళ్లు @ 17.28 కోట్లు
సాక్షి,ఆదిలాబాద్ అర్బన్: ఇంటి పన్ను వసూళ్లలో ఉమ్మడి జిల్లా కొంత మెరుగుపడింది. పన్నులు వసూలు చేయడంలో ఎప్పుడు వెనుకబడి ఉండే ఆదిలాబాద్ ఈ ఏడాది ముందు వరుసలో నిలిచేందుకు సిద్ధమవుతోంది. జిల్లాల వారీగా పన్ను వసూలు లక్ష్యాన్ని ముందుగానే చేరుకునే పరిస్థితి కనిపిస్తోంది. నాలుగు జిల్లాల పంచాయతీ అధికారులు పన్ను వసూళ్ల లక్ష్యాన్ని చాలెంజ్‌గా తీసుకొని వసూలు చేస్తున్నారు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు అధికారులతోపాటు సిబ్బంది నానాఅవస్థలు పడుతున్నారు. ఇందుకు తగ్గట్టుగా పన్ను కూడా వసూలు అవుతోంది. గడిచిన రెండు నెలల్లో భారీగా పన్ను వసూలు అయినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. పన్ను వసూలు శాతాన్ని జిల్లాల వారీగా గమనిస్తే.. రెండు నెలల కిందట 28వ స్థానంలో ఉన్న ఆదిలాబాద్ జిల్లా ప్రస్తుతం 61 శాతం పన్ను వసూలు చేసి రాష్ట్రంలోనే ఏడోస్థానం సాధించింది. మంచిర్యాల జిల్లా 58.79 శాతం, కుమురంభీం జిల్లా 57.64 శాతం పన్ను వసూలు చేసి రాష్ట్రంలో ఎనిమిది, తొమ్మిది స్థానాలను పదిలం చేసుకున్నాయి. ఇక నిర్మల్ జిల్లా 47.75 శాతం పన్ను వసూలు చేసి 20వ స్థానంలో ఉంది. అయితే అధికారులు వసూలు చేసే పన్నులో రెండు రకాలు ఉన్నాయి. మొదటిది ఇంటి పన్ను (ట్యాక్స్) కాగా, రెండోది నాన్ ట్యాక్స్ ఉంది. జిల్లా లక్ష్యం వసూలైంది శాతం ఆదిలాబాద్ రూ.5,06,50,733 రూ.3,08,98,625 61 మంచిర్యాల రూ.4,60,93,108 రూ.2,70,98,771 58.79 కుమురంభీం రూ.3,51,85,189 రూ.2,02,82,159 57.64 నిర్మల్ రూ.4,08,82,404 రూ.1,95,22,580 47.75 మొత్తం రూ.17,28,11,434 రూ.7,82,79,555 56.2 నెల రోజుల్లో సాధ్యమేనా.? ఆయా జిల్లాల జిల్లా పంచాయతీ అధికారులు గ్రామ పంచాయతీల వారీగా ఇంటి పన్ను వసూలు చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక తయారు చేశారు. ఈ ప్రణాళిక ప్రకారం గత రెండు నెలల నుంచి ఇంటి పన్ను వసూలు చేస్తున్నారు. అయితే నవంబర్, డిసెంబర్లోనే పన్ను వసూలు చేపట్టిన సిబ్బంది అంతగా శ్రద్ధ చూపకపోవడంతో తక్కువగా వసూలైంది. దీనికి తోడు అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల సందడి కూడా తోవడంతో వసూలు లక్ష్యం మందగించింది. జనవరి మొదటి నుంచి ఇప్పటి వరకు గ్రామాల్లో జోరుగా పన్ను వసూలు జరుగుతోంది. ఒక్కో ఇంటికి రూ.85 నుంచి రూ.350కిపైగా వసూలు చేస్తున్నారు. ఇందులో కొంత మంది ఇంటి యాజమానులు రెండేళ్ల పన్ను కట్టని సంఘటనలు ఉన్నాయి. ప్రతీ ఏటా జనవరి, ఫిబ్రవరిలో పన్ను వసూలుకు ఉరుకులు పరుగులు పెట్టే అధికారులు ఈ ఏడాది ముందుగానే లక్ష్యాన్ని చేరుకునేలా కనిపిస్తున్నారు. ఆర్థిక సంవత్సరం ముగింపునకు ఇంకా ఇరవై ఏడు రోజుల సమయమే మిగిలి ఉంది. అయితే ఈ ఇరవై ఏడురోజుల్లో రూ.9,45,31,879 లను వసూలు చేయగలరా అనే అనుమానాలు కలుగుతున్నాయి. పన్ను వసూళ్లకు ప్రత్యేక బృందాలు.. గ్రామ పంచాయతీల్లో పన్ను వసూళ్లు చేసేందుకు జిల్లా పంచాయతీ అధికారులు ప్రత్యేక బృందా లను నియమించారు. నాలుగైదు పంచాయతీల కు ఒక బృందం చొప్పున సభ్యులు గ్రామాల్లో తిరుగుతున్నారు. ఈ బృందాలలో పంచాయతీ కార్యదర్శి, కారోబర్, వీసీవో, సాక్షరభారత్ కో–ఆర్డినేటర్లు, ఇతర అధికారులు ఉన్నారు. అయితే జిల్లాలో ఇది వరకే కొన్ని జీపీలో 100 శాతం పన్ను వసూలైంది. అయితే ఆ పంచాయతీ పరిధిలోని అధికారులు, సిబ్బంది వందశాతం చేరుకొని పంచాయతీల్లో పన్ను వసూలు చేయడంలో భాగస్వాములు అవుతున్నారు. సిబ్బంది ఎక్కువై పన్ను వసూళ్ల లక్ష్యం త్వరగా చేరుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. దీనికి తోడు పంచాయతీ కార్యదర్శులు, ఏవోపీఆర్డీలకు వేర్వేరుగా వాట్సాప్ గ్రూపులను క్రియేట్ చేశారు. పన్ను వసూళ్ల విషయంలో తలెత్తుతున్న ఇబ్బందులను ఈ గ్రూపుల్లో షేర్ చేసుకుంటూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు లక్ష్యం సాధించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఒక్కో జిల్లాలో పన్ను వసూలు సిబ్బంది సుమారు 220 నుంచి 250 మంది వరకు ఉన్నట్లు , బృందాలుగా పన్ను వసూలు చేస్తే పని సులువుగా ఉంటుందని చెబుతున్నారు. నెలాఖరులోగా లక్ష్యాన్ని చేరుకుంటాం ఇంటి పన్ను వసూలు ప్రస్తుతం జోరుగా సాగుతుంది. ఈ నెలాఖరులోగా నిర్దేశించిన లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకుంటాం. ఈ రెండు నెలల్లో భారీగా పన్ను వసూలైంది. జిల్లాలో కొన్ని జీపీల్లో ఇప్పటికే వందశాతం ఇంటి పన్ను వసూలైంది. పన్ను వసూలుకు ప్రణాళికతో ముందుకెళ్లడంతో అన్ని జీపీల్లో వంద శాతం వసూలు చేస్తున్నాం. గడువులోగా అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాం. – సాయిబాబా, జిల్లా పంచాయతీ అధికారి, ఆదిలాబాద్ -
ఇంటి ఆవరణలో ఖాళీ స్థలంపై పన్ను!
-
ఇంటి ఆవరణలో ఖాళీ స్థలంపై పన్ను!
► మూడింతలు ఖాళీగా ఉంటే వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ వర్తింపు ► ఇంత కాలం పన్ను వసూలు చేయకపోవడంపై సర్కారు అసంతృప్తి ► ఇకపై కట్టుదిట్టంగా వసూలు చేయాలని పురపాలికలకు ఆదేశం సాక్షి, హైదరాబాద్: మీ ఇంటి ఆవరణలో మూడింతలు, ఆపై స్థలం ఖాళీగా ఉందా? అయితే ఇక నుంచి ఆ స్థలంపై ఖాళీ స్థల పన్ను (వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్)ను ముక్కుపిండి వసూలు చేయనున్నారు. నగర, పట్టణ ప్రాంతాల్లోని భవనాల నిర్మిత స్థలంతో పోల్చితే మూడింతలు, ఆపై స్థలం ఖాళీగా ఉన్నా లేక భవనం ఆవరణలో 1,000 చదరపు మీటర్లు, ఆపై స్థలం ఖాళీగా ఉన్నా ఆయా భవనాల యజమానులపై ఖాళీ స్థల పన్ను విధించాల్సిందేనని పురపాలకశాఖ చట్టాలు పేర్కొంటున్నాయి. అయితే రాష్ట్రంలో ఇప్పటివరకు ఇలాంటి పన్నులను విధించలేదు. రాష్ట్రంలోని 69 నగర, పురపాలికల ఆర్థిక వనరులపై పురపాలకశాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు ఇటీవల సమీక్ష నిర్వహించారు. పన్నులు, ఇతర మార్గాల్లో పురపాలికలకు రావాల్సిన మేరకు ఆదాయం సమకూరడం లేదని ఈ సమావేశంలో గుర్తించారు. కొన్ని రకాల పన్నులు, రుసుముల వసూళ్లపై పురపాలికలు ఏమాత్రం దృష్టిసారించడంలేదని ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా ఇళ్లలోని ఖాళీ స్థలాలపై పన్నులు విధించకపోవడంపై ఈ సమీక్షలో చర్చ జరిగింది. ఇకపై ఖాళీ స్థల పన్నును కచ్చితంగా వసూలు చేయాలని ఈ సమావేశంలో పురపాలకశాఖకు ఆదేశాలు అందాయి. దీంతో ఖాళీ స్థల పన్నుల వసూళ్లపై పురపాలకశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. భవనం, అపార్ట్మెంట్, ఇంటి ఆవరణలో మూడింతల స్థలం ఖాళీగా ఉంటే .. ఆ స్థలాన్ని ఖాళీ స్థలంగా పరిగణించి పన్ను విధించాలనే నిబంధనను ఇకపై కచ్చితంగా అమలు చేయాల్సిందేనని రాష్ట్రంలోని అన్ని పురపాలికలకు ఇటీవల అంతర్గత ఆదేశాలు జారీ అయ్యాయి. ఖాళీ స్థలాల జాబితాలను ప్రతి నెలా రూపొందిస్తుండాలని, ఎప్పటికప్పుడు పన్నుల విధింపుపై సమీక్షలు జరపాలని మున్సిపల్ కమిషనర్లకు సూచనలు వెళ్లాయి. భవనాలపై ఆస్తి పన్నులు విధించినట్లే పట్టణ ప్రాంతాల్లోని వ్యవసాయేతర ఖాళీ స్థలాలపై పన్నులను విధించాలని పురపాలక చట్టాలు పేర్కొంటున్నాయి. నిబంధనల ప్రకారం మున్సిపాలిటీల్లోని ఖాళీ స్థలాలపై వాటి మార్కెట్ విలువలో 0.20 శాతం, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని ఖాళీ స్థలాలపై వాటి మార్కెట్ విలువలో 0.50 శాతం మొత్తాన్ని గణించి ఖాళీ స్థలం పన్నుగా విధిస్తారు.