న్యూఢిల్లీ: నిత్యావసర ఉత్పత్తులపై జీఎస్‌టీ బాదుడు షురూ అయింది. 25 కిలోలు/లీటర్లు, అంతకులోపు పరిమాణంలో ఉండే ప్యాకేజ్డ్ ఆహారోత్పత్తులపై (బ్రాండెడ్ కాకపోయినా) కొత్తగా 5 శాతం జీఎస్‌టీ పడనుంది. ప్యాక్ చేసి విక్రయించే గోధుమ పిండి, మైదా వంటి అన్ని రకాల పిండులు, బియ్యం, గోధుమల వంటి ధాన్యాలు, పప్పు దినుసులు తదితరాలన్నింటికీ ఇది వర్తిస్తుంది. వీటిని ‘ప్రీ ప్యాకేజ్డ్, లేబుల్డ్ కమోడిటీ’ విభాగం కిందకు చేరుస్తూ 5 శాతం జీఎస్‌టీని కేంద్రం సోమవారం నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. వీటిని లూజ్‌గా కొనుగోలు చేస్తే ఈ పన్నుండదని పరోక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీఐసీ) పేర్కొంది. అలాగే 25 కిలోలకు/లీటర్లకు మించిన పరిమాణంలో విక్రయించినా జీఎస్‌టీ పడదని స్పష్టం చేసింది. కొత్త పన్ను రేట్లపై సందేహాలను నివృత్తి చేస్తూ తాజాగా ప్రకటన విడుదల చేసింది.
ధరలు పెంచిన ప్రముఖ సంస్థలు
పెరుగు, మజ్జిగ, పనీర్, టెట్రా ప్యాక్‌లో విక్రయించే పానీయాలపైనా జీఎస్టీ 12 నుంచి 18 శాతానికి పెరిగింది. ఈ నిర్ణయాన్ని ప్రముఖ సంస్థలు అమల్లోకి తీసుకొచ్చేశాయి. బటర్‌మిల్క్, పెరుగు, లస్సీ, టెట్రా ప్యాక్‌ల్లో విక్రయించే పానీయాలపై ధరలను 5 శాతం పెంచినట్టు అమూల్ బ్రాండ్ పేర్కొంది. కొత్త జీఎస్‌టీ రేట్ల ప్రకారం ధరలను సవరిస్తున్నట్టు మదర్ డెయిరీ కూడా మంగళవారమే ప్రకటన జారీ చేసింది.
ఇదీ చదవండి: ఇలా అయితే జీఎస్టీ ఉండదు: నిర్మలా సీతారామన్ క్లారిటీ
Comments
Please login to add a commentAdd a comment