ఇంటి ఆవరణలో ఖాళీ స్థలంపై పన్ను!
► మూడింతలు ఖాళీగా ఉంటే వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ వర్తింపు
► ఇంత కాలం పన్ను వసూలు చేయకపోవడంపై సర్కారు అసంతృప్తి
► ఇకపై కట్టుదిట్టంగా వసూలు చేయాలని పురపాలికలకు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: మీ ఇంటి ఆవరణలో మూడింతలు, ఆపై స్థలం ఖాళీగా ఉందా? అయితే ఇక నుంచి ఆ స్థలంపై ఖాళీ స్థల పన్ను (వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్)ను ముక్కుపిండి వసూలు చేయనున్నారు. నగర, పట్టణ ప్రాంతాల్లోని భవనాల నిర్మిత స్థలంతో పోల్చితే మూడింతలు, ఆపై స్థలం ఖాళీగా ఉన్నా లేక భవనం ఆవరణలో 1,000 చదరపు మీటర్లు, ఆపై స్థలం ఖాళీగా ఉన్నా ఆయా భవనాల యజమానులపై ఖాళీ స్థల పన్ను విధించాల్సిందేనని పురపాలకశాఖ చట్టాలు పేర్కొంటున్నాయి. అయితే రాష్ట్రంలో ఇప్పటివరకు ఇలాంటి పన్నులను విధించలేదు.
రాష్ట్రంలోని 69 నగర, పురపాలికల ఆర్థిక వనరులపై పురపాలకశాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు ఇటీవల సమీక్ష నిర్వహించారు. పన్నులు, ఇతర మార్గాల్లో పురపాలికలకు రావాల్సిన మేరకు ఆదాయం సమకూరడం లేదని ఈ సమావేశంలో గుర్తించారు. కొన్ని రకాల పన్నులు, రుసుముల వసూళ్లపై పురపాలికలు ఏమాత్రం దృష్టిసారించడంలేదని ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా ఇళ్లలోని ఖాళీ స్థలాలపై పన్నులు విధించకపోవడంపై ఈ సమీక్షలో చర్చ జరిగింది. ఇకపై ఖాళీ స్థల పన్నును కచ్చితంగా వసూలు చేయాలని ఈ సమావేశంలో పురపాలకశాఖకు ఆదేశాలు అందాయి. దీంతో ఖాళీ స్థల పన్నుల వసూళ్లపై పురపాలకశాఖ ప్రత్యేక దృష్టి సారించింది.
భవనం, అపార్ట్‌మెంట్, ఇంటి ఆవరణలో మూడింతల స్థలం ఖాళీగా ఉంటే .. ఆ స్థలాన్ని ఖాళీ స్థలంగా పరిగణించి పన్ను విధించాలనే నిబంధనను ఇకపై కచ్చితంగా అమలు చేయాల్సిందేనని రాష్ట్రంలోని అన్ని పురపాలికలకు ఇటీవల అంతర్గత ఆదేశాలు జారీ అయ్యాయి. ఖాళీ స్థలాల జాబితాలను ప్రతి నెలా రూపొందిస్తుండాలని, ఎప్పటికప్పుడు పన్నుల విధింపుపై సమీక్షలు జరపాలని మున్సిపల్ కమిషనర్లకు సూచనలు వెళ్లాయి. భవనాలపై ఆస్తి పన్నులు విధించినట్లే పట్టణ ప్రాంతాల్లోని వ్యవసాయేతర ఖాళీ స్థలాలపై పన్నులను విధించాలని పురపాలక చట్టాలు పేర్కొంటున్నాయి. నిబంధనల ప్రకారం మున్సిపాలిటీల్లోని ఖాళీ స్థలాలపై వాటి మార్కెట్ విలువలో 0.20 శాతం, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని ఖాళీ స్థలాలపై వాటి మార్కెట్ విలువలో 0.50 శాతం మొత్తాన్ని గణించి ఖాళీ స్థలం పన్నుగా విధిస్తారు.