జాయింట్ జగడం
- కార్యదర్శికి చెక్ పవర్‌పై సర్పంచుల గుర్రు
- నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట పడేనా?
- కార్యదర్శుల కొరతతో తీవ్ర ఇబ్బందులు
- 29 అంశాలు బదలాయింపు అయ్యేనా..?
సుల్తానాబాద్: గ్రామపంచాయతీలకు 29 అంశాలను బదలాయించడంతో పాటు నిధులు, విధుల్లో సర్వాధికారాలు కట్టబెడుతామన్న సర్కారు దానికి విరుద్ధంగా పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులకు జాయింట్ చెక్‌పవర్ కల్పిస్తూ జీవో జారీ చేయడంపై సర్పంచులు గుర్రుగా ఉన్నారు. పారదర్శకత, జవాబుదారీతనం పేరిట గ్రామ ప్రజాప్రతినిధులను అగౌరవ పరచడమేనని, తమ హక్కులను హరించే ప్రయత్నంలో భాగమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈజీవోపై సర్కారు పునరాలోచన చేయాల్సిన అవసరముందని సర్పంచులు కోరుతున్నారు.
నిధుల దుర్వినియోగమే కారణమా..?
సర్పంచులకు నేరుగా చెక్ పవర్ ఉండడంతో పంచాయతీ పాలకవర్గం తీర్మానాలు లేకుం డానే డబ్బులు డ్రా చేసి వాడుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికే పలు గ్రామాల సర్పంచులపై ప్రభుత్వానికి, ఉన్నతాధికారుల కు ఫిర్యాదులు అందాయి. దీంతో ప్రభుత్వం జాయింట్ చెక్ పవర్‌ను అమలు చేస్తే కొంతవరకు అవినీతికి చెక్ పెట్టవచ్చనే ఆలోచనతోనే ఈ జీవో జారీ చేసినట్టు భావిస్తున్నారు.
సర్పంచులు బాధ్యతలు చేపట్టి ఏడాదిన్నర అవుతున్నప్పటికీ మెజారిటీ గ్రామ పంచాయతీల్లో నిధులు లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడింది. ప్రభుత్వం ఏర్పడి ఆర్నెల్లు అవుతున్నప్పటికీ పలు రకాల పనులకు నిధులు విడుదల చేయలేదు. పని చేసిన వాటికి నిధులు నేటికీ ఇవ్వకపోవడంతో అప్పులు తెచ్చి పనులు చేసిన సర్పంచులు ఆందోళన చెందుతున్నారు.
ఇటీవల బీఆర్‌జీఎఫ్, 13వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కావడంతో పాటు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నిధులను గ్రామాభివృద్ధికి నిధులు వెచ్చించనున్నారు. గతంలోనూ జాయింట్ చెక్ పవర్ కల్పించిన సందర్భాల్లో సర్పంచుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదురైంది. పలు చోట్ల కార్యదర్శులు, సర్పంచులు కుమ్మక్కై నిధులు దుర్వినియోగం చేసిన సంఘటనలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో జాయింట్ చెక్ పవర్ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందనే విషయమై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.
కార్యదర్శులేరి..?
జిల్లాలో 1207 గ్రామపంచాయతీలు ఉండగా, 528 మంది మాత్రమే కార్యదర్శులు ఉన్నారు. క్లస్టర్ల వారీగా చూసినా జిల్లాలో 621 క్లస్టర్లు ఉండగా.. 93 కార్యదర్శి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో పెద్ద పంచాయతీలను మినహాయిస్తే మిగిలిన వాటిలో నాలుగు నుంచి ఆరు గ్రామపంచాయతీలకు ఒక కార్యదర్శి మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు.
అదనపు భారంతో వీరు అన్ని పనులు నిర్వహించడం ఇబ్బందికరంగా ఉంది. అంతేగాకుండా నిధుల విషయమై సర్పంచులకు, కార్యదర్శులకు మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శి పోస్టులను భర్తీ చేస్తేనే లక్ష్యం నెరవేరుతుంది.