రాజ్‌ఘర్/భోపాల్ : కులం కుంపటి నెత్తినబెట్టుకుని ఊరేగుతున్న కొందరు ‘పెద్ద మనుషులు’ కళ్లునెత్తికెక్కి ప్రవర్తించారు. దళితుడి చేతిలో అత్యాచారానికి గురైన కారణంగా.. తమకు విందు భోజనాలు ఏర్పాటుచేస్తేనే ఓ యువతి పవిత్రత పొందినట్లని తీర్పునిచ్చారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసింది. వివరాలు.. రాజ్‌ఘర్ జిల్లాలోని ఓ గ్రామంలో దామోదర్ (పేరుమార్చాం) కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. ఆయన కూతురు(16)పై ఓ దళిత యువకుడు గత జనవరిలో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు కూడా చేశారు.
అయితే, నిందితుడు తక్కువ కులంవాడు కావడంతో... యువతి మలినమైందని కుల పంచాయతీ పెద్దలు తేల్చారు. కులం మొత్తానికి విందు ఏర్పాటు చేసి ఆ మాలిన్యాన్ని పోగొట్టుకోవాలని హుకుం జారీ చేశారు. అప్పటివరకు ఆ కుంటుంబాన్ని బహిష్కరిస్తున్నట్టు తీర్పు చెప్పారు. కూతురికి జరిగిన అన్యాయంపై ఓ పక్క ఆ తండ్రి ఆవేదనకు గురవుతోంటే... పంచాయతీ పెద్దల మతిలేని తీర్పు అతనికి మరింత భారమైంది. ఆర్థికస్థితి అంతంత మాత్రమే కావడంతో తామెలాంటి విందు ఇవ్వలేమని దామోదర్ వేడుకున్నాడు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో మహిళా శిశుసంక్షేమం అధికారులకు సమాచారం ఇచ్చాడు. దాని ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. అయితే, తమ ప్రాథమిక విచారణలో దామోదర్ ఆరోపణలు నిజం కాదని తేలినట్టు పోలీసులు చెప్తుండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment