తిరుచానూరు, న్యూస్‌లైన్: తిరుచానూరు గ్రామ పంచాయతీ ఆదాయానికి అధికారులు భారీగా గండి కొడుతున్నారు. రోజురోజుకి విస్తరిస్తుండడంతో అధిక సంఖ్య లో కల్యాణమండపాలు, షాపింగ్ కాంప్లెక్సులు, అపార్ట్‌మెంట్లు తిరుచానూరు పంచాయతీ పరిధిలో వెలుస్తున్నాయి. తిరుచానూరులో సుమారు 40వరకు కల్యాణమండపాలున్నాయి.
అయితే 27కల్యాణమండపాల నుంచే పన్నులు వసూలు చేస్తున్నారని తెలిసింది. వాస్తవానికి భిన్నంగా తక్కువ విస్తీర్ణాన్ని నమోదు చేసి, అందుకు తగ్గట్టుగా తక్కువ మొత్తాన్ని పన్ను రూపంలో వసూలు చేస్తున్నట్లు సమాచారం.అదే విధంగా ఒక కళాశాలకు కూడా పన్నులో భారీ మినహాయింపు ఇచ్చినట్టు తెలిసింది. ఒక్క కల్యాణమండపాలే కాకుండా షాపింగ్ కాంప్లెక్స్, అపార్ట్‌మెంట్లు నుంచి తక్కువ మొత్తాన్నే పన్ను రూపంలో వసూలు చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.
చక్రం తిప్పుతున్న చిన్న స్థాయి ఉద్యోగి
పంచాయతీ విస్తరించడంతో ఇంటి, నీటి తదితర పన్నుల వసూలుకు బిల్‌కలెక్టర్‌కు సహాయకులుగా ఆరుగురిని కాంట్రాక్టు ప్రాతిపదికన బిల్‌కలెక్టర్లుగా నియమించారు. ఇంటింటికి వెళ్లి పన్నులు వసూలు చేయాల్సిన పర్మినెంట్ బిల్‌కలెక్టర్ మాత్రం ఆఫీసులోనే కూర్చుని జూనియర్ అసిస్టెంట్ చేయాల్సిన పనులను చేస్తూ సహద్యోగులపై పెత్తనం చెలాయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐదేళ్లకు పైగా ఇక్కడే విధులు నిర్వహిస్తుండడంతో ఇక్కడున్న లొసుగులన్నింటిని తెలుసుకున్న ఆ ఉద్యోగి చక్రం తిప్పుతూ అవినీతికి పాల్పడుతున్నట్లు స్థానికులే కాకుండా అక్కడ పనిచేసే సిబ్బంది వాపోతున్నారు. జిల్లా స్థాయి అధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని పంచాయతీ సిబ్బంది కోరుతున్నారు.
చర్యలు తీసుకుంటా
తిరుచానూరులోని అన్ని కల్యాణమండపాల నుంచి డాక్యుమెంట్ ప్రకారమే పన్నును వసూలు చేస్తున్నాం. అవకతవకలు తమ దృష్టికి వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాను. ఇప్పుడున్న బిల్‌కలెక్టర్‌కు సాంకేతిక అనుభవం ఉండడంతో అతన్ని ఇతర అవసరాలకు వినియోగించుకుంటున్నామని ఈవో జనార్దనరెడ్డి చెప్పారు.
తిరుచానూరు పంచాయతీ ఆదాయానికి గండి
Published Thu, Feb 13 2014 4:16 AM | Last Updated on Sun, Sep 2 2018 4:03 PM
Advertisement
Advertisement