అమెరికాలో అతిపెద్ద షాపింగ్ ఫెస్టివల్ ‘బ్లాక్ ఫ్రైడే’
ఇప్పుడు మన దేశంలోనూ మెగా షాపింగ్ ఈవెంట్‌గా మారుతున్న వైనం
బ్లాక్ ఫ్రైడే పేరిట భారీ డిస్కౌంట్స్‌ను ప్రకటిస్తున్న రిటైల్ సంస్థలు
విమానయాన సంస్థల నుంచి ఈ–కామర్స్ వరకు భారీ డిస్కౌంట్స్ ప్రకటన
ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా లావాదేవీలపై అదనపు ప్రయోజనాలు
2వ తేదీ వరకు భారత్‌లో ‘బ్లాక్ ఫ్రైడే’ డిస్కౌంట్ సేల్స్
గత ఏడాది కన్నా ఈసారి 40శాతం కొనుగోళ్లు పెరుగుతాయని అంచనా
అమెరికాలో అత్యంత ప్రజాదరణ పొందిన బ్లాక్ ఫ్రైడే సేల్స్ సంస్కృతి ఇప్పుడు భారతదేశ మార్కెట్లోకి ప్రవేశించింది. దసరా–దీపావళి డిస్కౌంట్ సేల్స్‌కు దీటుగా ఈసారి రిటైల్ సంస్థలు బ్లాక్ ఫ్రైడే సేల్స్‌లో భారీ డిస్కౌంట్స్‌ను ఆఫర్ చేస్తున్నాయి. ఈ నెల 29 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు జరిగే ఈ బ్లాక్ ఫ్రైడే సేల్స్‌లో పలు ఉత్పత్తులపై ఏకంగా 50 నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్స్‌ను ఇస్తున్నాయి.
ఎయిర్ ఇండియా, ఐఆర్‌టీసీ దగ్గర నుంచి ఆన్‌లైన్ రిటైల్ సంస్థలు, గృహోపకరణాల సంస్థలు ఈ బ్లాక్ ఫ్రైడే సేల్స్ సందర్భంగా ప్రత్యేక రాయితీలు ప్రకటించాయి. ఈ నెల 29 నుంచి డిసెంబర్ 2వ తేదీలోపు విమాన టికెట్లు బుక్ చేసుకున్న వారికి ఎయిర్ ఇండియా 12 నుంచి 20 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది.
అంతర్జాతీయ ప్రయాణ టికెట్ చార్జీలపై 12 శాతం, దేశీయ టికెట్ చార్జీలపై 20 శాతం డిస్కౌంట్‌ను ఇస్తోంది. ఐఆర్‌టీసీ అయితే ఈ ఆఫర్ సమయంలో కన్వేనియన్స్ ఫీజులను తొలగించడంతోపాటు ఉచిత బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. – సాక్షి, అమరావతి
బ్లాక్ ఫ్రైడే సేల్స్ అంటే..
» అమెరికాలో రైతులు తమ పంటల దిగుబడి పూర్తయినందుకు సంతోషంగా ప్రతి ఏడాది నవంబర్ నాలుగో గురువారం ‘థ్యాంక్స్ గివింగ్’ పేరిట పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ రోజు ఆమెరికాలో జాతీయ సెలవు దినం.
» ‘థాంక్స్ గివింగ్ డే’ మరుసటి రోజు వచ్చే శుక్రవారాన్ని ‘బ్లాక్ ఫ్రైడే సేల్స్’ పేరుతో షాపింగ్ కోసం కేటాయిస్తారు.
» డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ పర్వదినాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాపార సంస్థలు బ్లాక్ ఫ్రైడే సేల్స్‌లో భారీ డిస్కౌంట్స్‌ను ప్రకటిస్తాయి.
» అమెరికాలో అత్యధికంగా అమ్మకాలు జరిగేది ఈ బ్లాక్ ఫ్రైడే సేల్స్‌లోనే.
» ఇప్పుడు ఈ సంస్కృతి నెమ్మదిగా మన దేశంలోకి కూడా విస్తరించింది.
ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్స్
ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గృహోపకరణాలపై అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ డిజిటల్, మింత్రా వంటి ఈ–కామర్స్ దిగ్గజ సంస్థలు భారీ డిస్కౌంట్స్‌ను ప్రకటిస్తున్నాయి. అంతేకాకుండా శామ్‌సంగ్, షియోమీ, సోనీ, హెచ్‌పీ వంటి సంస్థలు కూడా డిస్కౌంట్ ఆఫర్స్‌ను ప్రకటించాయి. సామ్‌సంగ్ తన గెలాక్సీ ఫోన్లపై రూ.12,000 వరకు, రెడ్‌మీ అయితే రూ.15,000 వరకు డిస్కౌంట్లను అందిస్తున్నాయి.
కొన్ని సంస్థలు ఎంపిక చేసిన బ్యాంకుల కార్డుల ద్వారా లావాదేవీలు నిర్వహిస్తే అదనపు తగ్గింపును వర్తింపజేస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది బ్లాక్ ఫ్రైడే అమ్మకాలు 35 నుంచి 40శాతం వరకు పెరుగుతాయని ఈ–కామర్స్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. డిసెంబర్ 2న ‘సైబర్ మండే’తో ఈ డిస్కౌంట్ అమ్మకాలు ముగుస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment