మహబూబ్‌నగర్ న్యూటౌన్: గ్రామాల్లో ఇంటి నిర్మాణ అనుమతులకు కష్టాలు మొదలయ్యాయి. కొత్త ఇంటి నిర్మాణం చేసుకోవాలన్నా.. పాత ఇంటిని పునర్నిర్మించుకోవాలన్నా.. అనుమతులు తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇంతకాలం గ్రామ పంచాయతీ పరిధిలోనే ఉన్న అనుమతుల ప్రక్రియ ప్రస్తుతం టీఎస్‌బీపాస్ పరిధిలోకి వెళ్లింది. దీంతో అనుమతులు తీసుకునే విషయంలో ప్రజలకు ఎలాంటి అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. టీఎస్ బీపాస్‌లో ఇంటి నిర్మాణ అనుమతుల కోసం మీసేవా కార్యాలయంలో గాని లేదా సిటిజన్ లాగిన్‌లో గాని దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ విధానం ఇంకా గ్రామీణ స్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. గతంలో ఈ పంచాయతీ ద్వారా అనుమతుల ప్రక్రియను సులువుగా నిర్వహించుకునేవారు.
టీఎస్‌బీపాస్ వచ్చాక ఈ పంచాయతీ పోర్టల్ విధానాన్ని నిలిపివేశారు. దీంతో టీఎస్‌బీపాస్ విధివిధానాలపై అవగాహన లేక గ్రామాల్లో ఎక్కడికక్కడ నిర్మాణాలు చేపడుతున్నారు. తద్వారా గ్రామ పంచాయతీకి ఎలాంటి ఆదాయం రాకపోవడంతోపాటు ఆయా నిర్మాణా లకు సంబంధించి ఇంటి నంబర్లు, నల్లా కనెక్షన్లు ఇచ్చేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అంతేకాకుండా కొత్తగా నిర్మాణం చేపట్టే ఇళ్ల విషయంలో ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతున్నా గ్రామ పంచాయతీలు నిస్సహాయ స్థితిలో ఉన్నాయి.
ముడా పరిధిలో..
ఇదిలా ఉండగా మహబూబ్‌నగర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలోకి వెళ్లిన గ్రామాల్లో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఆయా గ్రామాల్లో ఇళ్ల నిర్మాణ అనుమతులను ఎలా తీసుకోవాలో అధికారులకు సైతం స్పష్టత లేకపోవడం గమనార్హం. ఇళ్ల నిర్మాణాలకు తీసుకోవాల్సిన అనుమతులు సైతం టీఎస్‌బీపాస్‌లో దరఖాస్తు చేయాలి. అయితే అనుమతుల ప్రక్రియ మూడు కేటగిరీలలో జరగాల్సి ఉంది. గ్రామ పంచాయతీ, ముడా, డీటీసీపీ పరిధిలో అనుమతుల ప్రక్రియ జరుగుతుంది. ఏ కేటగిరీలో ఎన్ని గజాల వరకు అనుమతులు ఇస్తారు.. అందుకు కావాల్సిన పత్రాలు ఏమేం కావాలి.. అనేదానిపై ఎవరికీ స్పష్టత లేకపోవడం గమనార్హం.
కార్యదర్శుల నిస్సహాయత
టీఎస్‌బీపాస్ ద్వారా గ్రామాల్లో ఇంటి నిర్మాణ, ఇతర అనుమతుల ప్రక్రియపై గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం ఇప్పటి వరకు శిక్షణ ఇవ్వకపోవడంతో నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. ఈ పంచాయతీ పోర్టల్‌ను ప్రభుత్వం నిలిపివేయడం, గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలకు ఇచ్చే అనుమతులన్నీ టీఎస్ బీపాస్ ద్వారానే తీసుకునేలా చర్యలు తీసుకున్న ప్రభుత్వం ఆ మేరకు పంచాయతీ కార్యదర్శులకు పూర్తిస్థాయి అవగాహన కల్పించకపోవడంతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులకు దారితీస్తోంది. మహబూబ్‌నగర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలోకి వెళ్లిన గ్రామాల్లో పరిస్థితి మరీ దారుణంగా మారింది. ముడాలోకి వెళ్లిన గ్రామాలకు సంబంధించి అభివృద్ధి పనులు, అనుమతులు తదితర అంశాలపై పంచాయతీ కార్యదర్శులకు, సర్పంచ్‌లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించాల్సిన ప్రభుత్వం ఇప్పటి వరకు అలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
జిల్లాలో ఇదీ పరిస్థితి..
జిల్లాలో మొత్తం 441 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అయితే మహబూబ్‌నగర్ పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న 143 గ్రామ పంచాయతీలు మహబూబ్‌నగర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలోకి వెళ్లాయి. ఈ–పంచాయతీ పోర్టల్‌లో ఆప్షన్లు లేకపోవడం, టీఎస్ బీపాస్‌పై అవగాహన లేకపోవడం పంచాయతీల అభివృద్ధికి శాపంగా మారుతోంది. ముడా పరిధిలోకి వెళ్లిన గ్రామాల్లో ఇప్పటివరకు ముడా ఆధ్వర్యంలో ఎలాంటి పనులు చేపట్టలేదు. ముడా ఏర్పాటై 16 నెలలు కావొస్తున్నా ఆశించిన పురోగతి కనిపించడం లేదనే ఆరోపణలున్నాయి.
త్వరలో శిక్షణ ఇస్తాం
ముడా పరిధిలోకి వచ్చిన గ్రామ పంచాయతీ కార్యదర్శులకు త్వరలో శిక్షణ ఇస్తాం. ఆయా గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులు, రికార్డుల నిర్వహణ, అనుమతులు వంటి అశాలపై అవగాహన కల్పిస్తాం. ముడా సమావేశంలో తీసుకునే నిర్ణయాల మేరకు అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుంది.
– మజీద్, ముడా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్
Comments
Please login to add a commentAdd a comment