గొప్ప సంఘ సంస్కర్త సేవాలాల్ మహరాజ్
మహబూబ్‌నగర్ న్యూటౌన్/మహబూబ్‌నగర్ రూరల్: సంత్ సేవాలాల్ మహరాజ్ గొప్ప సంఘ సంస్కర్త అని ఎంపీ డీకే అరుణ అన్నారు. జిల్లా గిరిజన సేవా సంఘం, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శనివారం సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్లాక్‌టవర్ చౌరస్తా నుంచి అయ్యప్పకొండ వద్దనున్న సేవాలాల్ మహరాజ్ దేవాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. వేడుకల్లో ఎంపీ డీకే అరుణ పాల్గొని గిరిజన మహిళలతో కలిసి సంప్రదాయ నృత్యం చేశారు. సేవాలాల్ మహరాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు చేశారు. ర్యాలీలో బంజారా పాటలకు మహిళలు, యువత సంప్రదాయ నృత్యాలతో హోరెత్తించారు. అనంతరం సేవాలాల్ మహరాజ్ దేవాలయం వద్ద మహాభోగ్ కార్యక్రమం నిర్వహించారు. ఉత్సవాల్లో కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ జానకి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్‌కుమార్‌గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అతిథులను అలరించాయి.
● ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ.. బంజారా జాతిని చైతన్యం చేసిన సేవాలాల్ మహరాజ్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సేవాలాల్ మహరాజ్ జయంతిని దేశవ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాలని పార్లమెంటులో ప్రస్తావించడం జరిగిందన్నారు. ఆయన చరిత్ర ప్రతి ఒక్కరికీ తెలిసేలా చర్యలు తీసుకున్నప్పుడే భవిష్యత్ తరాలకు మార్గదర్శనం అవుతుందన్నారు.
● ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. బంజారాలు సంచార జీవనం వదిలి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవాలని, వ్యవసాయంతో అభివృద్ధి సాధించాలని చైతన్యం చేసిన వ్యక్తి సేవాలాల్ మహరాజ్ అని అన్నారు. బంజారా సంస్కృతీ సంప్రదాయాలను కాపాడేందుకు ఎంతో కృషి చేశారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలో ప్రతి తండాకు బీటీరోడ్డు నిర్మించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. అందులో భాగంగా హన్వాడ, మహబూబ్‌నగర్ రూరల్ మండలాల్లోని తండాలకు బీటీరోడ్ల నిర్మాణాలకు రూ. 5 కోట్లతో శంకుస్థాపన చేసినట్లు వివరించారు. మహబూబ్‌నగర్ విద్యానిధిలో 10 శాతం గిరిజన బంజారా విద్యార్థులకు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ సేవాలాల్ మహరాజ్ చిత్రపటానికి పూజలు చేశారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్‌కుమార్, సిరాజ్ ఖాద్రీ, డీటీడబ్ల్యూఓ చత్రూ నాయక్, ఉత్సవ కమిటీ చైర్మన్ రాంచందర్‌నాయక్, శేఖర్‌నాయక్, జిల్లా గిరిజన సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్‌నాయక్, కార్యదర్శి ప్రతాప్, రమేశ్, కిషన్‌నాయక్, గంగారాంనాయక్, రవిరాథోడ్ పాల్గొన్నారు.
గొప్ప సంఘ సంస్కర్త సేవాలాల్ మహరాజ్
Comments
Please login to add a commentAdd a comment