మహిళలు.. శక్తికి ప్రతి రూపం | - | Sakshi
Sakshi News home page

మహిళలు.. శక్తికి ప్రతి రూపం

Published Thu, Feb 20 2025 12:30 AM | Last Updated on Thu, Feb 20 2025 12:29 AM

 మహిళలు.. శక్తికి ప్రతి రూపం

మహిళలు.. శక్తికి ప్రతి రూపం

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: ‘మీరు శక్తికి ప్రతిరూపం.. మీరే మహబూబ్‌నగర్‌ రోల్‌ మోడల్స్‌..’ అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ‘మహబూబ్‌నగర్‌ ఫస్ట్‌ నవరత్నాలు’లో భాగంగా బీకేరెడ్డి కాలనీలో ఎమ్మెల్యే సొంత నిధులతో మహిళలకు వివిధ కోర్సులలో మూడు నెలల పాటు ఇచ్చే వృత్తి నైపుణ్య శిక్షణ (మొదటి బ్యాచ్‌)ను 224 మంది పూర్తి చేశారు. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక మంచి ఆలోచన, సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. స్థానిక మహిళలలో దాగి ఉన్న ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పేందుకే మూడు నెలల క్రితం ఈ శిక్షణ తరగతులు ప్రారంభించామన్నారు. త్వరలోనే ఎంసెట్‌ కోసం మరి కొందరికి శిక్షణ ఇప్పిస్తామన్నారు. ముఖ్యంగా మహిళలు బాగుంటేనే కుటుంబంతో పాటు సమాజం పురోగతి సాధిస్తుందన్నారు. మహబూబ్‌నగర్‌లో ప్రతిభకు కొదవలేదని అందుకు నిదర్శనం తమరేనని పేర్కొన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వచ్చే నెల 8న మయూరి బ్రాండ్‌ను విస్తరించనున్నామన్నారు. స్వయం ఉపాధి కింద బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తామన్నారు. జిల్లాకేంద్రంలోని శిల్పారామంలో మహిళా ఉత్పత్తుల కోసం ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేస్తామన్నారు.

ఎదగాలనే ఆకాంక్ష ఉండాలి: కలెక్టర్‌

కలెక్టర్‌ విజయేందిర మాట్లాడుతూ జీవితంలో ఎదగాలనే ఆశ.. ఆకాంక్ష మహిళలలో నిండుగా ఉండాలన్నారు. ఇక్కడ శిక్షణ పూర్తి చేసుకున్న వారు సొంత యూనిట్లు ఏర్పాటు చేసుకుని ఉన్నత స్థితికి చేరుకోవాలన్నారు. తాము ఎంచుకున్న, నేర్చుకున్న కోర్సు పై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ముందుకు సాగిపోవాలన్నారు. అనంతరం ఎస్పీ డి.జానకి మాట్లాడుతూ ఈ కార్యక్రమ ఉద్దేశాన్ని శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలందరూ నిజం చేయాలన్నారు. జీవితంలో సొంత కాళ్లపై నిలబడి ఆర్థిక స్వావలంబన సాధించి ఇతరులకు ఆదర్శంగా నిలవాలన్నారు. పోలీసుశాఖ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. కాగా, మహిళలు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయి. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ముఖ్య అతిథులు జ్ఞాపికలు అందజేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మల్లు నర్సింహారెడ్డి, ముడా చైర్మన్‌ లక్ష్మణ్‌యాదవ్‌, ఎమ్మెల్యే సతీమణి లక్ష్మీప్రసన్న, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్‌ఖాద్రీ, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు రాఘవేందర్‌, శ్రీనివాస్‌యాదవ్‌, నాయకులు గుండా మనోహర్‌, రాజుగౌడ్‌, ఖాజాపాషా, అంజద్‌, పోతన్‌పల్లి మోహన్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్‌, మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ డి.మహేశ్వర్‌రెడ్డి, ఎల్‌డీఎం కల్వ భాస్కర్‌, డీవైఎస్‌ఓ శ్రీనివాస్‌, సెట్విన్‌ అధికారి విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

వృత్తి నైపుణ్య శిక్షణ పూర్తి చేసుకున్న 224 మంది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement