పిన్నంచర్లలో వైరస్ కలకలం
ఆత్మకూర్: బర్డ్‌ఫ్లూ వైరస్ కలకలం రేపుతోంది. మండలంలోని పిన్నంచర్ల గ్రామంలో పౌల్ట్రీ రైతు దామోదర్ ఫాంలో వెయ్యికిపైగా కోళ్లు మృతిచెందాయి. గురువారం జరిగిన ఈ ఘటనతో పౌల్ట్రీ యజమానులు ఉలిక్కి పడ్డారు. రైతు దామోదర్ తనఫాంలో 4 వేలకుపైగా కోళ్లు పెంచుతుండగా మూడురోజుల వ్యవధిలోనే వెయ్యికిపైగా కోళ్లు మృతి చెందాయని వాపోయాడు. ఈ విషయాన్ని పశు సంవర్ధశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో గురువారం సందర్శించి మృతిచెందిన కోళ్లను పరిశీలించారు. చనిపోయిన కోళ్లను గొయ్యి తీసి పాతి పెట్టారు. ఈ సందర్భంగా పశు వైద్యాధికారి రమేష్ మాట్లాడుతూ గురువారం 450కి పైగా కోళ్లు మృతిచెందాయన్నారు. మృతిచెందిన కోళ్లను పరిశీలించి ఉన్నతాధికారులతోపాటు మహబూబ్‌నగర్ ఏడీడీఎల్ ల్యాబ్ డాక్టర్ కరుణశ్రీకి సమాచారం ఇచ్చామన్నారు. ఇక్కడ కోళ్లను పరిశీలించి శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపిస్తామన్నారు. ఏ వైరస్‌తో చనిపోయాయనే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తామని, వైరస్ వ్యాపించకుండా యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వారి వెంట పశు సంవర్ధక శాఖ జేవీఓ నిర్మల, ఏఎస్‌లు నాగరాజు, మహిమూద్ తదితరులున్నారు.
రూ.లక్షల్లో నష్టం..
పౌల్ట్రీ పరిశ్రమపైనే ఆధారపడి రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టి కోళ్లను పెంచుతున్నామని యజమాని దామోదర్ తెలిపారు. మాయదారి వైరస్ వచ్చి 2.5 కిలోల నుంచి 3 కిలోల వరకు పెరిగిన కోళ్లు చనిపోవడంతో రూ.లక్షల్లో నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పౌల్ట్రీ రైతులను ఆదుకోవాలని కోరారు.
పౌల్ట్రీఫాంలో వెయ్యి కోళ్లు మృతి
Comments
Please login to add a commentAdd a comment