అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా
పాలమూరు: జిల్లాలో విద్యుత్ డిమాండ్ గతేడాది కంటే ఈసారి 18 శాతం పెరిగిందని, ఎలాంటి ఓవర్ లోడ్ సమస్య లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్, ఎండీ ముషారఫ్ ఫారూఖీ అన్నారు. జిల్లాలో విద్యుత్ శాఖ వేసవి యాక్షన్ ప్లాన్ పనులను శుక్రవారం పరిశీలించడంతోపాటు టీడీగుట్ట సబ్‌స్టేషన్‌లో దాదాపు రూ.కోటి వ్యయంతో అదనంగా ఏర్పాటు చేసిన ఐదు ఎంవీఏ ఫవర్ ట్రాన్స్‌ఫార్మర్లను కలెక్టర్ విజయేందిరతో కలిసి సీఎండీ ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్‌లో విద్యుత్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతేడాది పీక్ డిమాండ్ 352 మెగావాట్లు కాగా ఈసారి 415 మెగావాట్లకు చేరిందని, ఇంతగా డిమాండ్ పెరిగినా ఎలాంటి ఓవర్‌లోడ్ సమస్య లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. డిమాండ్ 500 మెగావాట్లకు చేరిన సరఫరా చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలో గృహ, వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయ రంగంలో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతుందని, గతేడాదితో పోల్చితే ఈసారి జనవరి వరకు దాదాపు 15 వేల మంది చేరికతో మొత్తం వినియోగదారులు 3.99 లక్షలకు చేరారని, గృహాజ్యోతి పథకం కింద దాదాపు 1.29 లక్షల మంది గృహ వినియోగదారులు లబ్ధిపొందుతున్నారని చెప్పారు. గతేడాది దాదాపు 9 సబ్‌స్టేషన్ల్ పరిధిలో ఫవర్ ట్రాన్స్‌ఫార్మర్లు ఓవర్ లోడ్ అయ్యాయని, డివిజన్ల వారీగా పెరుగుతున్న లోడ్‌లకు తగ్గట్టుగా నూతన ట్రాన్స్‌ఫార్మర్, ఫీడర్ల విభజన చేయడం జరిగిందన్నారు. కేవలం హైదరాబాద్‌కు పరిమితమైన విద్యుత్ కాల్ సెంటర్ 1912 సదుపాయాన్ని జిల్లాలకు విస్తరించామన్నారు. విద్యుత్ అంతరాయాలు జరిగిన వెంటనే సమస్య పరిష్కరించేందుకు అంబులెన్స్ తరహా వాహనాలు ఏర్పాటు చేశామన్నారు. విద్యుత్ సమస్య ఉంటే వినియోగదారులు 1912 ఫిర్యాదు చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, డైరెక్టర్ ఆపరేషన్ నర్సింహులు, రూరల్ జోన్ చీఫ్ ఇంజినీర్ బాలస్వామి, ఎస్‌ఈ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
గతేడాది కంటే ఈసారి జిల్లాలో 18 శాతం పెరిగిన డిమాండ్
విద్యుత్ శాఖ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ
Comments
Please login to add a commentAdd a comment