ఉపాధి ప్రణాళిక ఖరారు
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో మౌళిక సదుపాయాల కల్పనతోపాటు కూలీలకు ఉపాధి కల్పించేందుకు అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. 2025– 26 ఆర్థిక సంవత్సరంలో కూలీలకు ఎన్ని పనిదినాలు కల్పించాలి.. వారికి కేటాయించాల్సిన బడ్జెట్ ఎంత.. ఏయే పనులు చేయించాలనే అంశాలపై ఇప్పటికే గ్రామసభలు నిర్వహించారు. ప్రధానంగా జిల్లాలో వేసవి కాలంలో వ్యవసాయ పనులు లేకపోవడం, కూలీలు పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఉండేలా అధికారులు ఈ ప్రణాళిక తయారు చేశారు. వ్యవసాయం, మత్స్య, ఇరిగేషన్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల సమన్వయంతో చేపట్టే పనులను గుర్తించారు. అయితే జిల్లాలో 85,25,900 పనులను ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ఈ పనులు చేపట్టేందుకు రూ.426 కోట్ల నిధులు ఖర్చు చేయాలని అంచనా వేశారు. జిల్లాలో అడిగిన ప్రతి కూలీకి పని కల్పించేలా ప్రజల భాగస్వామ్యంతో ప్రణాళిక రూపొందించారు.
చేపట్టే పనులు..
ఉపాధి హామీ పథకంలో చేపట్టే పనులను పంచాయతీ కార్యదర్శులు గ్రామసభలు నిర్వహించి గ్రామస్తులు, రైతులు, ఉపాధి హామీ కూలీలు, మహిళా సంఘం సభ్యులు, గ్రామ పంచాయతీ పాలకవర్గంతో కలిసి గుర్తించారు. గ్రామాల్లో మట్టి రోడ్లు వేయడం, చెరువుల్లో మట్టి పూడికతీత, అవసరమైన రైతుల పొలాలకు ఒండ్రుమట్టి తరలించడం, నీటి నిల్వ కోసం కట్టలు కాల్వలు తవ్వడం, కందకాలు ఏర్పాటు చేయడం వంటి పనులు చేపడుతారు. అలాగే అత్యవసర పనులతోపాటు రైతుల, గ్రామస్తులకు అవసరమైన పనులకు ప్రాధాన్యం ఇస్తారు.
మండలాల వారీగా లక్ష్యం..
జిల్లాలో 16 మండలాలు ఉండగా 423 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అయితే అధికారులు మండలాల వారీగా పని దినాలను కేటాయించారు. ఇందులో అడ్డాకుల మండలానికి సంబంధించి 4,25,000 పనిదినాలు, బాలానగర్ 5,62,500, భూత్పూర్ 4,06,400, చిన్నచింతకుంట 6,18,600, దేవరకద్రకు 6,53,900, గండేడ్‌కు 8,99,900, హన్వాడకు 6,93,500, జడ్చర్లకు 7,09,700, కోయిలకొండకు 7,55,800, మహబూబ్‌నగర్‌కు 6,02,000, మిడ్జిల్‌కు 5,06,500, మూసాపేట్‌కు 3,32,500, నవాబ్‌పేటకు 9,19,400, రాజాపూర్‌కు 4,40,200 పనిదినాలు కేటాయించారు.
ప్రణాళిక ప్రకారం..
2025–26 సంవత్సరానికి సంబంధించి ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాకు కేటాయించిన నిధులన్నీ వినియోగించుకునేలా ఈ సంవత్సరం ప్రణాళిక తయారు చేశాం. పని అడిగిన ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ ఏడాది జిల్లాకు కేటాయించిన 85,25,900 పనిదినాల లక్ష్యం పూర్తిచేస్తాం.
– నర్సింహులు, డీఆర్‌డీఓ
గ్రామసభల ద్వారా పనుల గుర్తింపు పూర్తి
2025– 26 సంవత్సరానికి 85.25 లక్షల పనిదినాల గుర్తింపు
రూ.426 కోట్ల నిధులు వెచ్చింపు
వ్యవసాయ, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట
ప్రతి కూలీకి పని కల్పించేలా చర్యలు
ఉపాధి ప్రణాళిక ఖరారు
Comments
Please login to add a commentAdd a comment