చికెన్ అమ్మకాలు నిలిపివేయండి : కలెక్టర్
మదనాపురం: వనపర్తి జిల్లా మదనాపురం మండలంలోని కొన్నూరు సమీపంలో ఉన్న ఓ పౌల్ట్రీఫాంలో అంతుచిక్కని వ్యాధితో కోళ్లు మృత్యువాత పడిన నేపథ్యంలో సమీప ప్రాంతాల్లో చికెన్ అమ్మకాలను నిలిపివేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్‌తో కలిసి పౌల్ట్రీఫాంను పరిశీలించారు. కోళ్లు ఎలా మృత్యువాత పడ్డాయనే విషయంపై జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి, సంబంధిత కోళ్ల ఫారం యజమానితో ఆరా తీశారు. ఇటీవల బయటకు ఏమైనా కోళ్లు అమ్మారా అని ప్రశ్నించగా.. ఎవరికి అమ్మలేదని, చనిపోయిన వాటన్నింటినీ ఫాం సమీపంలోనే పూడ్చివేసినట్లు యజమాని బదులిచ్చారు. సమీపంలో ఉన్న చికెన్ దుకాణాలను తెరవనీయొద్దని, ఎవరైనా అమ్మకాలు జరిపితే వెంటనే బైండోవర్ చేసి.. చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌కు ఆదేశించారు. సమీపంలో ఉన్న పౌల్ట్రీఫారాలను సైతం పశుసంవర్ధక శాఖ అధికారులు సందర్శించి పరిస్థితులను పర్యవేక్షించాలని సూచించారు. ఏదైనా ఫాంలో కోళ్లకు అనుమానాస్పద లక్షణాలు కనిపిస్తే.. స్టాక్ బయటికి వెళ్లకుండా ఆపివేయాలని ఆదేశించారు. మృత్యువాత పడిన కోళ్ల శాంపిల్స్ వీబీఆర్‌ఐకి పరీక్షల కోసం పంపినట్లు తెలిపారు. ల్యాబ్ నుంచి రిపోర్టు వచ్చిన తర్వాత కారణాలు తెలుస్తాయని చెప్పారు. అనంతరం గ్రామంలో చికెన్ దుకాణాలను తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, జిల్లా పశుసంవర్ధక అధికారి వెంకటేశ్వర్‌రెడ్డి, తహసీల్దార్ అబ్రహం లింకన్, ఎంపీడీఓ ప్రసన్న కుమారి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment