టమాటాలో సస్యరక్షణ చర్యలు
అలంపూర్: టమాటా పంట సాగు చేసిన రైతులు సస్య రక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియానాయక్ అన్నారు. జిల్లాలో ఉన్న అనుకూల పరిస్థితుల్లో రైతులు టమాట పంట సాగు చేశారు. టమాటాలో ఆకు తొలుచు పురుగు ఆశించడానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ పురుగు ఆశిస్తే పంట యొక్క ఆకులను పూర్తిగా తిని వేస్తుంది. ఆకులనే కాకుండా మొగ్గలు, కాయలకు ఆశించి నష్టాన్ని కలుగజేస్తాయి. దీని వలన 50 నుంచి 100 శాతం వరకు నష్టం జరగవచ్చని తెలిపారు. దీనిని ఆకు తొలుచు పురుగు లేదా పినివామ్ అంటారని పేర్కొన్నారు. దీని శాసీ్త్రయ నామం టూట అబ్బలూట్. ఇది అమెరికా ప్రాంతానికి చెందినది. ప్రస్తుతం మన ప్రాంతాల్లో ఈ పురుగును గుర్తించినట్లు చెప్పారు.
నష్టపరిచే విధానం..
రెక్కల పురుగు 7 నుంచి 8 మిల్లీ మీటర్ల పొడవు ఉండి గోధుమ లేదా బూడిద రంగులో ఉంటాయి. తల్లి పురుగులు లేత ఆకుల కింద, తొడిమల కింద సుమారు 200 గుడ్ల వరకు పెడుతుంది. వీటి నుంచి వచ్చిన పిల్ల పురుగులు లేత ఆకులపై వంకర టింకర సొరంగాలు చేసి ఆకుపచ్చని పదార్థాన్ని తినివేస్తాయి. దీని వలన కణాలు తెల్లబారిపోతాయి. ఈ పురుగు లేత ఆకు కాండం, మొగ్గలు, పచ్చి కాయలపై రంధ్రాలు చేసి ఆశించడంతో కాయ కుళ్లు వాసన వస్తుంది. ఈ పురుగులు తక్కువ సమయంలో ఎక్కువ పునరుత్పత్తి జరిగి అధిక సంఖ్యలో ఉండటంతో అధిక నష్టం జరుగుతుంది.
నివారణ ఇలా.. పురుగు లార్వాలు ఆకుల లోపల ఉండటంతో రసాయన మందులతో నివారించడం చాలా కష్టం. సమగ్ర సస్యరక్షణ చేపడితే మంచి ఫలితాలు ఉంటాయి.
● ప్రతిసారి ఒకే పొలంలో టమాటా పంటను సాగు చేయరాదు.
● పంట చుట్టూ కంచె పంటగా జొన్న, మొక్కజొన్న నాలుగు సాళ్లు నాటితే వాటిపై ఈ పురుగులు చేరుతాయి. దీంతో కొంత వరకు పురుగులను నివారించవచ్చు.
● పొలం వెంబడి, గట్ల వెంట ఉమ్మెత్త మొక్కలు లేకుండా చూడాలి. లేకపోతే ఈ మొక్కలు పురుగులకు అతిథ్యం ఇస్తాయి.
లింగాకర్షక బుట్టలు
మగ పురుగులను ఆకర్షించే లింగాకర్షక బుట్టలను ఎకరానికి ఎనిమిది అమర్చుకుంటే మగ పురుగులను నియంత్రించవచ్చు. ఎందుకంటే మగ పురుగులు లేకపోతే సంతానోత్పత్తి వృద్ధికాక పురుగు మనుగడ సాధించలేదు.
రసాయన పద్ధతులు
ఈ పురుగులకు రసాయనాలకు ఎక్కువగా తట్టుకొనే శక్తి ఉంటుంది. ఎక్కువ సార్లు ఒకే రసాయనం వాడకుండా సూచించిన మందులను మార్చి పిచికారీ చేసుకోవాలి. సైనోసాడ్ 0.3 మి.లీ, కొరాజెన్ 0.3 మి.లీ, డెల్టా మెత్రిన్ 0.5 మి.లీ, ప్రాఫినోఫాస్ 1.5 మి.లీ, వేప నునె 5 మి.లీ, కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 1.5 గ్రాములను లీటరు నీటికి కలిపి సాయంత్రం వేళల్లో పిచికారీ చేయాలి.
పసుపు రంగు అట్టలకు జిగురు
ఏ పురుగునైనా ఆకర్షించే గుణం పసుపు రంగు అట్టలకు అధికంగా ఉంటుంది. పసుపు రంగు అట్టలకు గ్రీసు, జిగురు పట్టించి పొలంలో కర్రలకు కడితే రెక్కల పురుగుల వాటికి అతుక్కొని చనిపోతాయి.
టమాటాలో సస్యరక్షణ చర్యలు
Comments
Please login to add a commentAdd a comment