క్యూలైన్లలో నిలబడిన గర్భిణులు
పాలమూరు: ఎంసీహెచ్ భవనంలో గర్భిణులను క్యూలైన్లలో నిలబెట్టారు. ఇది గమనించిన రాష్ట్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ కమిషనర్, మిషన్ డైరెక్టర్ ఎన్‌హెచ్‌ఎం ఆర్‌వీ కర్ణనన్ ఆస్పత్రి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం జనరల్ ఆస్పత్రిని ఆయన తనిఖీ చేశారు. గర్భిణులను క్యూలైన్‌లో గంటల తరబడి నిలబెట్టడం సరికాదని, కొత్తగా చికిత్స కోసం వచ్చిన వారికి మాత్రమే ఓపీ తీసుకోవాలని ఆదేశించారు. గతంలో ఓపీ తీసుకొని రెండు, మూడుసార్లు వైద్యురాలితో చికిత్స తీసుకున్న వారికి ఓపీ లేకుండా నేరుగా వైద్యుడి దగ్గరకు పంపించాలన్నారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులకు కొనసాగుతున్న కంటి పరీక్షల విధానాన్ని ఆయన పరిశీలించారు. కేజీబీవీ, గురుకుల విద్యార్థులకు ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు పూర్తి చేయాలని సూచించారు. సెంట్రల్ డ్రగ్ స్టోర్ తనిఖీ చేస్తూ స్టాక్ వివరాలు, డ్రగ్స్ సరఫరా విధానాన్ని తనిఖీ చేశారు. మూడో రోజు కంటి పరీక్షలకు 302 మంది విద్యార్థులు హాజరు కాగా వారందరికీ కంటి పరీక్షలు పూర్తి చేసినట్లు ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. ఇప్పటి వరకు 919 మంది విద్యార్థులకు పరీక్షలు చేయగా.. 912మంది విద్యార్థులు అద్దాలు ఇవ్వనున్నామని, ఏడుగురికి సర్జరీకి రెఫర్ చేశారన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డా.కృష్ణ, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ సునీత్, డీఐఓ పద్మజా, తదితరులు పాల్గొన్నారు.
ఆస్పత్రి అధికారులపై కమిషనర్ ఆగ్రహం
కొత్తగా వచ్చిన వారికి మాత్రమే ఓపీ ఇవ్వండి
రాష్ట్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్
Comments
Please login to add a commentAdd a comment