ఆన్‌లైన్‌లో ఇసుక బుక్ చేసుకోవచ్చు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: జిల్లాలోని అడ్డాకుల మండలం కన్మనూర్, పొన్నకల్ రీచ్‌ల నుంచి ‘మన ఇసుక వాహనం’ ద్వారా ప్రభుత్వ, స్థానిక గృహ నిర్మాణ అవసరాలకు ఆన్‌లైన్‌లో ఇసుక సరఫరాకు బుక్ చేసుకోవచ్చని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో పోలీసు అధికారులు, తహసీల్దార్లు, ఎస్‌హెచ్‌ఓ లు, నీటిపారుదల, గృహ నిర్మాణ శాఖ అధికారులతో జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో గుర్తించిన మిగతా రీచ్‌లను సైతం వెంటనే ప్రారంభించాలన్నారు. వీటి నుంచి ఇందిరమ్మ గృహ నిర్మాణాలకు ఉచితంగా సరఫరా చేయాలన్నారు. కొరత ఉన్న చోట క్రషర్ ఇసుక (రోబో ఇసుక) ఉపయోగించవచ్చని, వినియోగదారులకు అవగాహన కల్పించాలన్నారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఫిల్టర్ ఇసుక తయారీ నిషేఽధించినందున ఎక్కడైనా ఇలాంటివి కనిపిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మండల స్థాయి టాస్క్‌ఫోర్స్ టీంలు ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు నిరంతరం పర్యవేక్షిస్తూ గట్టి నిఘా ఉంచాలని ఆదేశించారు. ఇసుకను అక్రమంగా రవాణా చేసే వాహనాలను పట్టుకుని జరిమానా విధించాలన్నారు. అనంతరం ఎస్పీ డి.జానకి మాట్లాడుతూ పోలీసు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేసి ఇసుక అక్రమ రవాణా నిరోధానికి చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్, రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ మోహన్‌రావు, గనుల శాఖ ఏడీ సంజయ్ కు మార్, భూగర్భజల వనరుల శాఖ డీడీ రమాదేవి, డీఆర్‌డీఓ నర్సింహులు పాల్గొన్నారు.
ఆన్‌లైన్‌లో ఇసుక బుక్ చేసుకోవచ్చు
Comments
Please login to add a commentAdd a comment