కేజీబీవీ జీసీడీఓపై వేటు
● విధుల నుంచి తొలగిస్తూ డీఈఓ ఉత్తర్వులు
● రిపోర్టు అనుకూలంగా ఇవ్వనందుకేతొలగించారని ఆరోపణలు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ) జీసీడీఓ(గర్ల్ చైల్డ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్)పై వేటు పడింది. విధుల నుంచి తొలగిస్తూ డీఈఓ ప్రవీణ్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఓ పాఠశాలలో విచారణకు సంబంధించి అనుకూలంగా రిపోర్టు ఇవ్వనందుకే జీసీడీఓను తొలగించారని పలు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవల రాజాపూర్ కేజీబీవీలో ఎస్‌ఓ విద్యార్థినులకు సరిగా గుడ్లు, అరటి పండ్లు ఇవ్వడం లేదని, విద్యార్థినులను పాఠశాలలో చేర్చుకునే విషయంలో డబ్బులు వసూలు చేస్తున్నారని, ఉపాధ్యాయులు రెండు గ్రూపులుగా విడిపోయి విద్యార్థినులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో విద్యార్థినులు, తల్లిదండ్రులు జీబీవీ వద్ద నిరసన తెలిపారు. ఈ క్రమంలో డీఈఓ విచారణకు ఆదేశించారు. రాజాపూర్ ఎంఈఓ, కేజీబీవీ జీసీడీఓ రాధ సైతం విచారణకు వెళ్లి రిపోర్టును సమర్పించారు. ఈ క్రమంలో విచారణ పూర్తయ్యాక బాధ్యులపై చర్యలు తీసుకుంటారని అనుకున్న క్రమంలో కేజీబీవీ జీసీడీఓ రాధను విధుల నుంచి తొలగిస్తున్నట్లు డీఈఓ ప్రవీణ్‌కుమార్ ప్రకటించారు. విద్యాశాఖ అధికారుల తీరుపై యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి వెంకటేష్‌తో పాటు పలువురు సంఘం నాయకులు డీఈఓను కలిశారు. వారు మాట్లాడుతూ ఇలాంటి పరిణామాలు బాధాకరమని, సంబంధం లేకుండా ఒక అధికారిణి తొలగించడం సరికాదని విమర్శించారు. ఎవరికి మేలు చేసేందుకు తొలగించారని, గతంలో అక్రమాలకు పాల్పడుతున్న వారిని తీసుకువచ్చేందుకు అధికారులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారా అని ప్రశ్నించారు. జీసీడీఓగా నియమించేందుకు అర్హత లేకుంటే మొదట విధుల్లోకి తీసుకోకుండా ఉండాల్సిందని, ఇప్పుడు అర్ధాంతరంగా తొలగిస్తే సంబంధిత అధికారిపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని, ఈ అంశాన్ని పరిశీలించాలన్నారు. తమకు అనుకూలంగా రిపోర్టు రాయనందుకే కొందరు కుట్రలు పన్ని జీసీడీఓ తొలగించారని పలువురు విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.
ఎలాంటి సంబంధం లేదు
కేజీబీవీ జీసీడీఓ రాధను విధుల నుంచి తొలగింపునకు, రాజాపూర్ కేజీబీవీ విచారణకు ఎలాంటి సంబంధం లేదు. రెండు నెలల క్రితమే తొలగించేందుకు ప్రతిపాదనలు పంపించాం. జీసీడీఓగా నియామకం చేసే క్రమంలో ఆమె ఎలాంటి అర్హత లేదు. అందుకే తొలగించాం.
– ప్రవీణ్‌కుమార్, డీఈఓ,
Comments
Please login to add a commentAdd a comment