e panchayat
-
అనుమతులకు అష్టకష్టాలు... ఇళ్ల నిర్మాణాలకు ఇబ్బందులు పడుతున్న ప్రజలు
మహబూబ్‌నగర్ న్యూటౌన్: గ్రామాల్లో ఇంటి నిర్మాణ అనుమతులకు కష్టాలు మొదలయ్యాయి. కొత్త ఇంటి నిర్మాణం చేసుకోవాలన్నా.. పాత ఇంటిని పునర్నిర్మించుకోవాలన్నా.. అనుమతులు తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇంతకాలం గ్రామ పంచాయతీ పరిధిలోనే ఉన్న అనుమతుల ప్రక్రియ ప్రస్తుతం టీఎస్‌బీపాస్ పరిధిలోకి వెళ్లింది. దీంతో అనుమతులు తీసుకునే విషయంలో ప్రజలకు ఎలాంటి అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. టీఎస్ బీపాస్‌లో ఇంటి నిర్మాణ అనుమతుల కోసం మీసేవా కార్యాలయంలో గాని లేదా సిటిజన్ లాగిన్‌లో గాని దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ విధానం ఇంకా గ్రామీణ స్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. గతంలో ఈ పంచాయతీ ద్వారా అనుమతుల ప్రక్రియను సులువుగా నిర్వహించుకునేవారు. టీఎస్‌బీపాస్ వచ్చాక ఈ పంచాయతీ పోర్టల్ విధానాన్ని నిలిపివేశారు. దీంతో టీఎస్‌బీపాస్ విధివిధానాలపై అవగాహన లేక గ్రామాల్లో ఎక్కడికక్కడ నిర్మాణాలు చేపడుతున్నారు. తద్వారా గ్రామ పంచాయతీకి ఎలాంటి ఆదాయం రాకపోవడంతోపాటు ఆయా నిర్మాణా లకు సంబంధించి ఇంటి నంబర్లు, నల్లా కనెక్షన్లు ఇచ్చేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అంతేకాకుండా కొత్తగా నిర్మాణం చేపట్టే ఇళ్ల విషయంలో ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతున్నా గ్రామ పంచాయతీలు నిస్సహాయ స్థితిలో ఉన్నాయి. ముడా పరిధిలో.. ఇదిలా ఉండగా మహబూబ్‌నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి వెళ్లిన గ్రామాల్లో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఆయా గ్రామాల్లో ఇళ్ల నిర్మాణ అనుమతులను ఎలా తీసుకోవాలో అధికారులకు సైతం స్పష్టత లేకపోవడం గమనార్హం. ఇళ్ల నిర్మాణాలకు తీసుకోవాల్సిన అనుమతులు సైతం టీఎస్‌బీపాస్‌లో దరఖాస్తు చేయాలి. అయితే అనుమతుల ప్రక్రియ మూడు కేటగిరీలలో జరగాల్సి ఉంది. గ్రామ పంచాయతీ, ముడా, డీటీసీపీ పరిధిలో అనుమతుల ప్రక్రియ జరుగుతుంది. ఏ కేటగిరీలో ఎన్ని గజాల వరకు అనుమతులు ఇస్తారు.. అందుకు కావాల్సిన పత్రాలు ఏమేం కావాలి.. అనేదానిపై ఎవరికీ స్పష్టత లేకపోవడం గమనార్హం. కార్యదర్శుల నిస్సహాయత టీఎస్‌బీపాస్ ద్వారా గ్రామాల్లో ఇంటి నిర్మాణ, ఇతర అనుమతుల ప్రక్రియపై గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం ఇప్పటి వరకు శిక్షణ ఇవ్వకపోవడంతో నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. ఈ పంచాయతీ పోర్టల్‌ను ప్రభుత్వం నిలిపివేయడం, గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలకు ఇచ్చే అనుమతులన్నీ టీఎస్ బీపాస్ ద్వారానే తీసుకునేలా చర్యలు తీసుకున్న ప్రభుత్వం ఆ మేరకు పంచాయతీ కార్యదర్శులకు పూర్తిస్థాయి అవగాహన కల్పించకపోవడంతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులకు దారితీస్తోంది. మహబూబ్‌నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి వెళ్లిన గ్రామాల్లో పరిస్థితి మరీ దారుణంగా మారింది. ముడాలోకి వెళ్లిన గ్రామాలకు సంబంధించి అభివృద్ధి పనులు, అనుమతులు తదితర అంశాలపై పంచాయతీ కార్యదర్శులకు, సర్పంచ్‌లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించాల్సిన ప్రభుత్వం ఇప్పటి వరకు అలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. జిల్లాలో ఇదీ పరిస్థితి.. జిల్లాలో మొత్తం 441 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అయితే మహబూబ్‌నగర్ పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న 143 గ్రామ పంచాయతీలు మహబూబ్‌నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి వెళ్లాయి. ఈ–పంచాయతీ పోర్టల్‌లో ఆప్షన్లు లేకపోవడం, టీఎస్ బీపాస్‌పై అవగాహన లేకపోవడం పంచాయతీల అభివృద్ధికి శాపంగా మారుతోంది. ముడా పరిధిలోకి వెళ్లిన గ్రామాల్లో ఇప్పటివరకు ముడా ఆధ్వర్యంలో ఎలాంటి పనులు చేపట్టలేదు. ముడా ఏర్పాటై 16 నెలలు కావొస్తున్నా ఆశించిన పురోగతి కనిపించడం లేదనే ఆరోపణలున్నాయి. త్వరలో శిక్షణ ఇస్తాం ముడా పరిధిలోకి వచ్చిన గ్రామ పంచాయతీ కార్యదర్శులకు త్వరలో శిక్షణ ఇస్తాం. ఆయా గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులు, రికార్డుల నిర్వహణ, అనుమతులు వంటి అశాలపై అవగాహన కల్పిస్తాం. ముడా సమావేశంలో తీసుకునే నిర్ణయాల మేరకు అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుంది. – మజీద్, ముడా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ -
‘ప్రైవేటు’గా సమాచార సేకరణ!
సాక్షి, హైదరాబాద్: సాంకేతిక సమస్యలు ఆస్తుల నమోదు ప్రక్రియపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఏకకాలంలో లక్షల కొద్దీ ఆస్తుల సమాచారాన్ని యాప్‌లో నమోదు చేస్తుండటంతో సర్వర్ మొరాయిస్తోంది. దీంతో పంచాయతీ కార్యదర్శులు ‘యాప్’సోపాలు పడుతున్నారు. దసరా రోజున ధరణి పోర్టల్‌ను ప్రారంభించడానికి ముహూర్తం ఖరారు చేసిన ప్రభుత్వం.. ఆలోపు ఈ పోర్టల్‌కు వ్యవసాయేతర ఆస్తుల వివరాలను అనుసంధానించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఇంటింటికీ వెళ్లి సేకరిస్తున్న ఈ డేటాను యాప్‌లో పొందుపర్చడం గగనంగా మారింది. కొన్నిచోట్ల సిగ్నల్ అందక.. మరికొన్ని చోట్ల అసలు సిగ్నలే లేక.. ఇంకొన్ని చోట్ల బఫరింగ్‌తో యాప్‌లో వివరాలను నిక్షిప్తం చేయడం తలనొప్పిగా తయారైంది. ఇలాంటి సాంకేతిక సమస్యలతో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా కొన్నిచోట్ల యాప్ నిలిచిపోయింది. యాప్ గాడినపడ్డ తర్వాత.. వ్యవసాయేతర ఆస్తుల నమోదుకు పంచాయతీరాజ్‌శాఖ ‘న్యాప్’ పేరిట కొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే.(చదవండి: ఆస్తి పన్ను పరిధిలోకి రాని ప్రతి కట్టడం లెక్క తేల్చండి!) ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీల పరిధిలోని ప్రతి కట్టడానికి సంబంధించిన డేటాను ఈ యాప్‌లో నమోదు చేయాలని స్పష్టం చేసింది. విజయదశమి నుంచి వ్యవసాయేతర ఆస్తులకు కూడా పాస్ పుస్తకాలు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో పైకప్పు ఉన్న ప్రతి కట్టడం లెక్కను సేకరించాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించింది. అయితే, సాంకేతిక సమస్యలు చుట్టుముడుతుండడంతో నమోదు ప్రక్రియ జాప్యమవుతోంది. దీంతో యాప్‌ను పక్కనపెడుతున్న సిబ్బంది.. సమాచారాన్ని మాన్యువల్‌గా సేకరించి యాప్ గాడినపడ్డ తర్వాత దాంట్లో ఎక్కించాలని నిర్ణయించింది. యాప్ మొరాయించినందున.. ఆస్తుల నమోదును రాత్రి 9 గంటల వరకు సేకరించాలని ఎంపీవో, ఎంపీడీవోలను ఆదేశిస్తూ కొన్ని జిల్లాల కలెక్టర్లు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ‘ప్రైవేటు’గా సమాచార సేకరణ! ఆస్తుల నమోదులో ఏ మాత్రం తప్పులు దొర్లినా కార్యదర్శులే బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ క్రమంలో వివరాల నమోదులో జాగ్రత్తగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. అయితే, ఆస్తుల నమోదుకు నిర్దేశిత గడువు సమీపిస్తుండటం.. సేకరించాల్సిన ఆస్తుల జాబితా చాంతాడంత ఉండటంతో సమాచార సేకరణకు ఇతరులను స్థానిక యంత్రాంగం రంగంలోకి దించింది. అంగన్వాడీ కార్యకర్తలు, ప్రభుత్వ ఉపాధ్యాయుల సేవలేగాకుండా.. కాలేజీ విద్యార్థులు, ప్రైవేటు వ్యక్తులను కూడా ఆస్తుల నమోదులో వినియోగించుకుంటోంది. ఇంటింటికీ వెళ్లి నిర్ణీత ఫార్మాట్లో వివరాలను సేకరిస్తున్న వీరంతా.. వాటిని కార్యదర్శులకు అందజేస్తున్నారు. కార్యదర్శులు ఆ సమాచారాన్ని యాప్‌లోకి ఎక్కిస్తున్నారు. అయితే, ఆస్తులకు సంబంధించిన వివరాల సేకరణలో పొరపాట్లు జరిగితే ఎవరూ బాధ్యత వహిస్తారోననే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. -
ఆన్‌లైన్‌కు ‘ఆఫీసర్లు’.. లెక్క తేల్చండి!
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీల్లో ఆస్తుల ఆన్లైన్ నమోదు ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తొలుత నాలుగు రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్దేశించిన పంచాయతీ రాజ్ శాఖ.. తాజాగా బుధవారంలోగా కొలిక్కి తేవాలని ఆదేశించింది. రివిజన్ రిజిస్టర్లో ఉన్న ఆస్తులు గాకుండా ఇప్పటి వరకు ఆస్తి పన్ను పరిధిలోకి రాని ప్రతి కట్టడం లెక్క తేల్చాలని స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం జిల్లా పంచాయతీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆ శాఖ ఉన్నతాధికారులు.. గడువు కుదింపు నిర్ణయాన్ని వెల్లడించారు. (చదవండి: బడి..గుడి.. అన్నీ!) ఈ క్రమంలో గ్రామాల్లో పంచాయతీ కార్య దర్శులు ఆగమేఘాల మీద ఆస్తుల లెక్క తేల్చే పనుల్లో నిమగ్నమయ్యారు. సేకరించిన ఆస్తుల వివరాలను ఇప్పటికే అందు బాటులో ఉన్న ఈ–పంచాయతీ (e-panchayat) వెబ్సైట్లో పొందుపరచాలని ప్రభుత్వం ఆదేశించింది. మరో వైపు ఆస్తుల ఆన్‌లైన్‌పై నాలుగైదు రోజుల్లో డీపీవోలకు శిక్షణ ఇవ్వాలని పంచాయతీ రాజ్ శాఖ యోచిస్తోంది. ఈ లోపు కొత్త యాప్‌ను ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలిస్తోంది. పంచాయతీలకు పర్యవేక్షణాధికారులు.. ఆస్తుల ఆన్లైన్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు మండలాల వారీగా జిల్లా స్థాయి అధికారులను నియమిస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా.. మండల స్థాయిలోనూ తహసీల్దార్, ఎంపీడీవో, ఎంపీవోలతో కూడిన బృందాలకు గ్రామాలను కేటాయించారు. ఆయా గ్రామాల్లో జరుగుతున్న ఆస్తుల ఆన్లైన్ తీరు, తప్పొప్పులు, సందేహాల నివృత్తి, డేటా సేకరణలో అనుసరిస్తున్న విధానాన్ని వీరు ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. బుధవారం సాయంత్రంలోగా ఈ క్రతువును పూర్తి చేయాలని, ఎక్కడైనా ఆస్తుల నమోదు మిగిలిపోతే ఒకట్రెండు రోజులు అదనంగా తీసుకోవాలని, ఆస్తులు నమోదు కాలేదని తేలితే చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. దీంతో చకచకా ఆస్తుల డేటా సేకరిస్తున్న కార్యదర్శులు, కారోబార్లు, పంచాయతీ కార్యాలయాల్లో కూర్చొని సమాచారాన్ని కంప్యూటీకరించడంలో తలమునకలయ్యారు. -
పని చేయని ఈ-పంచాయతీలు..
గద్వాల రూరల్: ఈ–పంచాయతీలంటూ ఎంతో గొప్పగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించినా ప్రజలకు ఎలాంటి మేలు జరగడం లేదు. రెండేళ్ల క్రితం పంచాయతీ కార్యాలయాలకు కంప్యూటర్లు పంపిణీ చేసినా ఇంటర్నెట్ సౌకర్యం, ఆపరేటర్ల కొరత కారణంగా అవి మూలన పడ్డాయి. కొన్ని గ్రామాల్లో పంపిణీ చేసిన సామగ్రి లేకపోవడం గమనార్హం. దీంతో గ్రామపంచాయతీ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడంతోపాటు అన్ని సేవలు ప్రజల ముంగిట నిలపాలన్న లక్ష్యం నీరుగారిపోతోంది. జిల్లాలోని 195 గ్రామ పంచాయతీలకుగాను 118చోట్ల మూడేళ్ల క్రితం ఈ–పంచాయతీ సేవలు ప్రారంభించారు. ఒక్కో గ్రామపంచాయతీకి అప్పట్లో రూ.40వేలు విలువజేసే కంప్యూటర్ మానిటర్, యూపీఎస్, టేబుల్ తదితర పరికాలను అందించారు. ఆయా గ్రామాల్లో ఆపరేటర్ల నియామకానికి శ్రీకారం చుట్టినా అది అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం కేవలం మండల స్థాయిలోనే 12చోట్ల కొనసాగుతోంది. రెండేళ్లపాటు కంప్యూటర్ ఆపరేటర్లకు వేతనాలు చెల్లించగా కాంట్రాక్టు పూర్తి కావడంతో సంబంధిత కంపెనీ ఈ–సేవల నుంచి తప్పుకొంది. అనంతరం ప్రభుత్వం గ్రామపంచాయతీల నిధుల నుంచి మండలస్థాయిలో ఆపరేటర్లకు వేతనాలు చెల్లించేలా ఆదేశాలు జారీ చేసింది. దీంతో 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి 10శాతం వేతనం రూపంలో వివిధ దశల్లో గ్రామపంచాయతీ నిధుల నుంచి చెల్లిస్తున్నారు. మరోవైపు పంచాయతీ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నా ఈ–సేవలపై మాత్రం దృష్టి సారించడం లేదు. రెండు గ్రామ పంచాయతీలను క్లస్టర్‌గా ఏర్పరచి మండలానికి ముగ్గురు చొప్పున ఆపరేటర్లు ఉండాలని సూచించింది. 12రకాల సేవలు అందించాలి ఈ–పంచాయతీల్లో భాగంగా ఇంటిపన్ను, ఆస్తి వివరాలు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, ఆదాయ వ్యయాలు, నీటి పథకాలు, కొళాయి కనెక్షన్లు, వీధిదీపాలు, వనరులు, అక్షరాస్యత శాతం, ఇంటి పన్నుల వసూళ్లు, బకాయిల వివరాలు అన్నీ కంప్యూటర్లోనే నిక్షిప్తం చేయాల్సి ఉంటుంది. అంతేకాక సంక్షేమ పథకాల గురించి తెలుసుకోవడంతోపాటు 12రకాల సేవలను అందించాలి. అయితే కేవలం మండల పరిషత్ కార్యాలయాల్లోనే కంప్యూటర్లు వినియోగంలో ఉండగా గ్రామాల్లో మూలకు చేరాయి. చాలా గ్రామాల్లో బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుబాటులో లేకపోవడంతో పంపిణీ చేసిన కంప్యూటర్లు నిరుపయోగంగా ఉన్నాయి. మండలం కేంద్రాల్లో కొనసాగుతున్న ఈ–పంచాయతీల సేవలతోపాటు స్వచ్ఛభారత్, ఆసరా పింఛన్లు, హరితహారం, ఇతర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన జాబితాల తయారీలో ఆపరేటర్లు బిజీగా ఉన్నారు. దీంతో తమకు పని తలకు మించిన భారమవుతోందని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోలని ఆయా గ్రామ ప్రజలు కోరుతున్నారు. చాలా ఇబ్బందిగా మారింది నాకు మూడు గ్రామ పంచాయతీలు అప్పగించారు. ఎందులోనూ ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతో నిధులు, లావాదేవీలు, పింఛన్లు, నీటి, ఇంటి పన్ను బకాయిలు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ చేయడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రతిసారి ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లి నమోదు చేయాల్సి వస్తోంది. – సురేష్, పంచాయతీ కార్యదర్శి, గోనుపాడు, గద్వాల మండలం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతోపాటు ఆపరేటర్ల సమస్య కారణంగా కంప్యూటర్లు వృథాగా ఉన్నది వాస్తవమే. చాలా గ్రామాల్లో బీఎస్ఎన్ఎస్ బ్రాడ్‌బాండ్ సేవలు అందుబాటులోకి రాలేదు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. – కృష్ణ, డీపీఓ, గద్వాల -
ఆగస్టు 15 కల్లా ‘ఈ–పంచాయతీ’: జూపల్లి
సాక్షి, హైదరాబాద్: గ్రామాల్లో ఈ– పంచాయతీ వ్యవ స్థను అమలు చేసేందుకు కసరత్తు సాగుతోంది. ఆన్లైన్లో పౌర సేవలను అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుం టోంది. ఆగస్టు 15వ తేదీకల్లా ఈ–పంచాయతీని ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభి వృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. పంచాయ తీరాజ్, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై సోమవారం ఇక్కడ మంత్రి సమీక్షించారు. గ్రామాల్లో ఆగస్టు 15 నాటికి జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, పన్నుల చెల్లింపు లాంటి అన్ని సేవలను ఆన్లైన్ ద్వారా అందించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.