ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీల్లో ఆస్తుల ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తొలుత నాలుగు రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్దేశించిన పంచాయతీ రాజ్ శాఖ.. తాజాగా బుధవారంలోగా కొలిక్కి తేవాలని ఆదేశించింది. రివిజన్ రిజిస్టర్‌లో ఉన్న ఆస్తులు గాకుండా ఇప్పటి వరకు ఆస్తి పన్ను పరిధిలోకి రాని ప్రతి కట్టడం లెక్క తేల్చాలని స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం జిల్లా పంచాయతీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆ శాఖ ఉన్నతాధికారులు.. గడువు కుదింపు నిర్ణయాన్ని వెల్లడించారు. (చదవండి: బడి..గుడి.. అన్నీ!)
ఈ క్రమంలో గ్రామాల్లో పంచాయతీ కార్య దర్శులు ఆగమేఘాల మీద ఆస్తుల లెక్క తేల్చే పనుల్లో నిమగ్నమయ్యారు. సేకరించిన ఆస్తుల వివరాలను ఇప్పటికే అందు బాటులో ఉన్న ఈ–పంచాయతీ (e-panchayat) వెబ్‌సైట్‌లో పొందుపరచాలని ప్రభుత్వం ఆదేశించింది. మరో వైపు ఆస్తుల ఆన్‌లైన్‌పై నాలుగైదు రోజుల్లో డీపీవోలకు శిక్షణ ఇవ్వాలని పంచాయతీ రాజ్ శాఖ యోచిస్తోంది. ఈ లోపు కొత్త యాప్‌ను ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలిస్తోంది.
పంచాయతీలకు పర్యవేక్షణాధికారులు..
ఆస్తుల ఆన్‌లైన్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు మండలాల వారీగా జిల్లా స్థాయి అధికారులను నియమిస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా.. మండల స్థాయిలోనూ తహసీల్దార్, ఎంపీడీవో, ఎంపీవోలతో కూడిన బృందాలకు గ్రామాలను కేటాయించారు. ఆయా గ్రామాల్లో జరుగుతున్న ఆస్తుల ఆన్‌లైన్ తీరు, తప్పొప్పులు, సందేహాల నివృత్తి, డేటా సేకరణలో అనుసరిస్తున్న విధానాన్ని వీరు ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. బుధవారం సాయంత్రంలోగా ఈ క్రతువును పూర్తి చేయాలని, ఎక్కడైనా ఆస్తుల నమోదు మిగిలిపోతే ఒకట్రెండు రోజులు అదనంగా తీసుకోవాలని, ఆస్తులు నమోదు కాలేదని తేలితే చర్యలు తప్పవని
ప్రభుత్వం హెచ్చరిస్తోంది. దీంతో చకచకా ఆస్తుల డేటా సేకరిస్తున్న కార్యదర్శులు, కారోబార్లు, పంచాయతీ కార్యాలయాల్లో కూర్చొని సమాచారాన్ని కంప్యూటీకరించడంలో తలమునకలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment