assets valuation
-
రూ.10 లక్షల కోట్లకు పింఛను నిధులు
న్యూఢిల్లీ: పింఛను పధకాల నిర్వహణ ఆస్తుల విలువ ఈ ఏడాది సెప్టెంబర్ చివరికి రూ.10 లక్షల కోట్ల మైలురాయిని చేరుకోనున్నట్టు పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి సంస్థ చైర్మన్ దీపక్ మహంతి తెలిపారు. చందాదారుల నుంచి క్రమం తప్పకుండా వస్తున్న చందాల వల్లే ఈ వృద్ధి సాధ్యమని చెప్పారు. తాజా గణాంకాల ప్రకారం పీఎఫ్ఆర్డీఏ నిర్వహణలోని నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్), అటల్ పెన్షన్ యోజన (ఏపీవై), ఎన్పీఎస్ లైట్ పథకాల పరిధిలోని ఆస్తుల విలువ (ఏయూఎం) రూ.9.58 లక్షల కోట్లకు చేరుకుంది. ‘‘రూ.9.5 లక్షల కోట్ల ఏయూఎంను చేరుకున్నాం. ఈ ఆర్థిక సంవత్సరం మధ్య భాగానికి ఏయూఎం రూ.10 లక్షలు చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒక్క ఎన్పీఎస్ నిర్వహణ నిధి రూ.10 లక్షల కోట్లు దాటుతుంది’’అని తెలిపారు. నిధులపై వచ్చే రాబడులు, మార్కెట్ పనితీరు ఏయూఎంను ప్రభావితం చేస్తాయన్నారు. ఈక్విటీ, కొన్ని రకాల డెట్ ఆస్తుల రాబడులు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా చలిస్తుండడం తెలిసిందే. పింఛను పథకాల మొత్తం ఏయూఎం రూ.9.58 లక్షల కోట్లలో ఒక్క ఎన్పీఎస్ నిర్వహణ ఆస్తుల విలువే రూ.9.29 లక్షల కోట్లకు చేరినట్టు మహంతి తెలిపారు. ఏపీవై నిధులు రూ.28,538 కోట్లుగా ఉన్నట్టు చెప్పారు. విస్తరణకు చర్యలు ఎన్పీఎస్ కింద ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ప్రైవేటు ఉద్యోగులు, వ్యక్తుల పింఛను నిధులు కూడా ఉన్నట్టు మహంతి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల పింఛను చందాలు వాటంతట అవే వస్తుంటాయని చెబుతూ.. ప్రైవేటు వ్యక్తుల నుంచి ఇవి వృద్ధి చెందాల్సి ఉందన్నారు. ఇందుకోసం పీఎఫ్ఆర్డీఏ ఎన్నో చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఏజెంట్లను అనుమతించామని, కార్పొరేట్ ఉద్యోగులు ఎన్పీఎస్ను తీసుకునే విధంగా ప్రోత్సాహక చర్యలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. డిజిటల్‌గా ఈ–ఎన్పీఎస్ ఖాతాను తెరిచి, చందాలు చెల్లించే అవకాశం కల్పించినట్టు పేర్కొన్నారు. దీనివల్ల మధ్యవర్తుల ప్రమేయం ఉండదన్నారు. ఎన్పీఎస్ చందాదారుల సంఖ్య గతేడాదే 1.20 కోట్లకు చేరినట్టు తెలిపారు. ఈ ఏడాది చందాదారుల సంఖ్యను 1.3 కోట్లకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇక ఏపీవై చందాదారుల సంఖ్య 5.2 కోట్లుగా ఉందని, ఇది చాలా గణనీయమైనదన్నారు. -
‘ప్రైవేటు’గా సమాచార సేకరణ!
సాక్షి, హైదరాబాద్: సాంకేతిక సమస్యలు ఆస్తుల నమోదు ప్రక్రియపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఏకకాలంలో లక్షల కొద్దీ ఆస్తుల సమాచారాన్ని యాప్‌లో నమోదు చేస్తుండటంతో సర్వర్ మొరాయిస్తోంది. దీంతో పంచాయతీ కార్యదర్శులు ‘యాప్’సోపాలు పడుతున్నారు. దసరా రోజున ధరణి పోర్టల్‌ను ప్రారంభించడానికి ముహూర్తం ఖరారు చేసిన ప్రభుత్వం.. ఆలోపు ఈ పోర్టల్‌కు వ్యవసాయేతర ఆస్తుల వివరాలను అనుసంధానించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఇంటింటికీ వెళ్లి సేకరిస్తున్న ఈ డేటాను యాప్‌లో పొందుపర్చడం గగనంగా మారింది. కొన్నిచోట్ల సిగ్నల్ అందక.. మరికొన్ని చోట్ల అసలు సిగ్నలే లేక.. ఇంకొన్ని చోట్ల బఫరింగ్‌తో యాప్‌లో వివరాలను నిక్షిప్తం చేయడం తలనొప్పిగా తయారైంది. ఇలాంటి సాంకేతిక సమస్యలతో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా కొన్నిచోట్ల యాప్ నిలిచిపోయింది. యాప్ గాడినపడ్డ తర్వాత.. వ్యవసాయేతర ఆస్తుల నమోదుకు పంచాయతీరాజ్‌శాఖ ‘న్యాప్’ పేరిట కొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే.(చదవండి: ఆస్తి పన్ను పరిధిలోకి రాని ప్రతి కట్టడం లెక్క తేల్చండి!) ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీల పరిధిలోని ప్రతి కట్టడానికి సంబంధించిన డేటాను ఈ యాప్‌లో నమోదు చేయాలని స్పష్టం చేసింది. విజయదశమి నుంచి వ్యవసాయేతర ఆస్తులకు కూడా పాస్ పుస్తకాలు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో పైకప్పు ఉన్న ప్రతి కట్టడం లెక్కను సేకరించాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించింది. అయితే, సాంకేతిక సమస్యలు చుట్టుముడుతుండడంతో నమోదు ప్రక్రియ జాప్యమవుతోంది. దీంతో యాప్‌ను పక్కనపెడుతున్న సిబ్బంది.. సమాచారాన్ని మాన్యువల్‌గా సేకరించి యాప్ గాడినపడ్డ తర్వాత దాంట్లో ఎక్కించాలని నిర్ణయించింది. యాప్ మొరాయించినందున.. ఆస్తుల నమోదును రాత్రి 9 గంటల వరకు సేకరించాలని ఎంపీవో, ఎంపీడీవోలను ఆదేశిస్తూ కొన్ని జిల్లాల కలెక్టర్లు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ‘ప్రైవేటు’గా సమాచార సేకరణ! ఆస్తుల నమోదులో ఏ మాత్రం తప్పులు దొర్లినా కార్యదర్శులే బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ క్రమంలో వివరాల నమోదులో జాగ్రత్తగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. అయితే, ఆస్తుల నమోదుకు నిర్దేశిత గడువు సమీపిస్తుండటం.. సేకరించాల్సిన ఆస్తుల జాబితా చాంతాడంత ఉండటంతో సమాచార సేకరణకు ఇతరులను స్థానిక యంత్రాంగం రంగంలోకి దించింది. అంగన్వాడీ కార్యకర్తలు, ప్రభుత్వ ఉపాధ్యాయుల సేవలేగాకుండా.. కాలేజీ విద్యార్థులు, ప్రైవేటు వ్యక్తులను కూడా ఆస్తుల నమోదులో వినియోగించుకుంటోంది. ఇంటింటికీ వెళ్లి నిర్ణీత ఫార్మాట్లో వివరాలను సేకరిస్తున్న వీరంతా.. వాటిని కార్యదర్శులకు అందజేస్తున్నారు. కార్యదర్శులు ఆ సమాచారాన్ని యాప్‌లోకి ఎక్కిస్తున్నారు. అయితే, ఆస్తులకు సంబంధించిన వివరాల సేకరణలో పొరపాట్లు జరిగితే ఎవరూ బాధ్యత వహిస్తారోననే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. -
ఆన్‌లైన్‌కు ‘ఆఫీసర్లు’.. లెక్క తేల్చండి!
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీల్లో ఆస్తుల ఆన్లైన్ నమోదు ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తొలుత నాలుగు రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్దేశించిన పంచాయతీ రాజ్ శాఖ.. తాజాగా బుధవారంలోగా కొలిక్కి తేవాలని ఆదేశించింది. రివిజన్ రిజిస్టర్లో ఉన్న ఆస్తులు గాకుండా ఇప్పటి వరకు ఆస్తి పన్ను పరిధిలోకి రాని ప్రతి కట్టడం లెక్క తేల్చాలని స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం జిల్లా పంచాయతీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆ శాఖ ఉన్నతాధికారులు.. గడువు కుదింపు నిర్ణయాన్ని వెల్లడించారు. (చదవండి: బడి..గుడి.. అన్నీ!) ఈ క్రమంలో గ్రామాల్లో పంచాయతీ కార్య దర్శులు ఆగమేఘాల మీద ఆస్తుల లెక్క తేల్చే పనుల్లో నిమగ్నమయ్యారు. సేకరించిన ఆస్తుల వివరాలను ఇప్పటికే అందు బాటులో ఉన్న ఈ–పంచాయతీ (e-panchayat) వెబ్సైట్లో పొందుపరచాలని ప్రభుత్వం ఆదేశించింది. మరో వైపు ఆస్తుల ఆన్‌లైన్‌పై నాలుగైదు రోజుల్లో డీపీవోలకు శిక్షణ ఇవ్వాలని పంచాయతీ రాజ్ శాఖ యోచిస్తోంది. ఈ లోపు కొత్త యాప్‌ను ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలిస్తోంది. పంచాయతీలకు పర్యవేక్షణాధికారులు.. ఆస్తుల ఆన్లైన్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు మండలాల వారీగా జిల్లా స్థాయి అధికారులను నియమిస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా.. మండల స్థాయిలోనూ తహసీల్దార్, ఎంపీడీవో, ఎంపీవోలతో కూడిన బృందాలకు గ్రామాలను కేటాయించారు. ఆయా గ్రామాల్లో జరుగుతున్న ఆస్తుల ఆన్లైన్ తీరు, తప్పొప్పులు, సందేహాల నివృత్తి, డేటా సేకరణలో అనుసరిస్తున్న విధానాన్ని వీరు ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. బుధవారం సాయంత్రంలోగా ఈ క్రతువును పూర్తి చేయాలని, ఎక్కడైనా ఆస్తుల నమోదు మిగిలిపోతే ఒకట్రెండు రోజులు అదనంగా తీసుకోవాలని, ఆస్తులు నమోదు కాలేదని తేలితే చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. దీంతో చకచకా ఆస్తుల డేటా సేకరిస్తున్న కార్యదర్శులు, కారోబార్లు, పంచాయతీ కార్యాలయాల్లో కూర్చొని సమాచారాన్ని కంప్యూటీకరించడంలో తలమునకలయ్యారు. -
జూబ్లీహిల్స్ భవనం విలువ రూ. 3 కోట్లేనా?
-
జూబ్లీహిల్స్ భవనం విలువ రూ. 3 కోట్లేనా?
హైదరాబాద్ నగరంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతమైన జూబ్లీహిల్స్‌లో ఉన్న భవనం విలువ కేవలం రూ. 3 కోట్లేనా అని వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి ప్రశ్నించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ అంశంపై చిత్తూరులో మాట్లాడారు. అవినీతికి మూలమైన పెదబాబు, చినబాబుల ఆస్తులు అంతేనా అని మిథున్ రెడ్డి ప్రశ్నించారు. మీరు ప్రకటించిన ఆస్తులకు 50 శాతం అదనంగా ఇస్తామని.. ఆ డబ్బును మీరు మోసం చేసిన డ్వాక్రా మహిళలకు పంచగలరా అని ఆయన సవాలు చేశారు.