
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీలో గ్రామాలు, కాలనీలను కలపడం, విడగొట్టడం వంటివి ప్రభుత్వ పరిధిలోని వ్యవహారాలని, వాటి విషయంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
తమ కాలనీని కొత్తగా ఏర్పాటుచేస్తున్న రామగోవిందాపురం గ్రామ పంచాయతీలో కలపడం లేదంటూ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని గాంగారం గ్రామ పరిధిలోని ప్రకాశ్‌నగర్‌కు చెందిన కె.పుల్లయ్య, మరొకరు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యంపై మంగళవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఇందులో తాము జోక్యం చేసుకోలేమని, అభ్యంతరాలు ఏవైనా ఉంటే వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని పిటిషనర్లకు స్పష్టం చేసింది. పిటిషనర్ల అభ్యంతరంపై ఏం నిర్ణయం తీసుకున్నారో వారికి తెలియచేయాలని అధికారులను ఆదేశించింది.