- గ్రామాల్లో వైకుంఠధామాల అభివృద్ధికి ఉపాధిహామీ నిధులు
- ప్రహరీ బాధ్యత తమది కాదంటున్న గ్రామీణాభివృద్ధి అధికారులు
సాక్షి, హైదరాబాద్: గ్రామాల్లో వైకుంఠధామాల (శ్మశానవాటిక) ఏర్పాటు/ అభివృద్ధి ప్రక్రియ గ్రామ పంచాయతీలకు తలనొప్పిగా మారింది. ఎంపిక చేసిన గ్రామా ల్లో ఒక్కో శ్మశానవాటిక అభివృద్ధికి రూ. 10 లక్షలు కేటాయించిన గ్రామీణాభి వృద్ధి శాఖ, శ్మశాన స్థలాల రక్షణ కోసం ప్రహరీ ఏర్పాటు చేసుకునే బాధ్యత గ్రామ పంచాయతీలదేనని స్పష్టం చేసింది. గ్రామాల్లో ఒక్కొక్క శ్మశాన వాటికకు ప్రహరీ నిర్మించడానికి కనీసం రూ. 10 లక్షల నుంచి గరిష్టంగా రూ. 25 లక్షల దాకా వ్యయమవుతుందని అధికారుల అంచనా. ఈ మొత్తాన్ని గ్రామ పంచాయతీ నిధుల నుంచి గాని, దాతల నుంచి విరాళాల రూపంలో గాని వెచ్చించాలని గ్రామీణాభి వృద్ధిశాఖ సూచించింది.
అయితే.. రాష్ట్రంలో 90 శాతానికి పైగా గ్రామ పంచాయతీలకు ఈ మేరకు ఆదాయ వనరులు లేకపోవడంతో పలు గ్రామాల సర్పంచులు ప్రహరీల నిర్మాణ వ్యయాన్ని తాము భరించే పరిస్థితి లేదంటూ చేతులెత్తేశారు. మరోవైపు ఆయా గ్రామాల్లో వైకుంఠధామం ప్రహరీ నిర్మాణం కోసం రూ. 5 లక్షలకు పైగా విరాళమిచ్చిన గ్రామస్తులు వారి పెద్దల స్మారకంగా వైకుంఠధామానికి పేరును పెట్టుకునే వెసులుబాటును ప్రభు త్వం కల్పించినా, గత రెండు నెలలుగా ఏ గ్రామంలోనూ విరాళాలిచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు.
ఉపాధి నిధులే ఇవ్వాలంటున్న కలెక్టర్లు
రాష్ట్రంలో మొత్తం 8,685 గ్రామాల్లో శ్మశానవాటికలను ఉపాధిహామీ నిధులతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావించగా, ఈ ఆర్థిక సంవత్సరంలో 1,050 గ్రామాల్లో వైకుంఠధామాలు ఏర్పాటు చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ లక్ష్యంగా పెట్టుకొంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మండలానికి ఐదు నుంచి ఏడు గ్రామాలను ఎంపిక చేసి శ్మశాన వాటికల అభివృద్ధి పనులను చేపట్టాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ సూచించారు. అయితే.. గత నెలరోజులుగా కొన్ని జిల్లాల్లో పర్యటించిన కొన్ని జిల్లాల కలెక్టర్లు.. గ్రామ పంచాయతీలకు ఆర్థిక వనరులు లేకపోవడంతో ఉపాధిహామీ నిధుల నుంచే ప్రహరీల ఏర్పాటు చేయాలని లేఖలు రాశారు. ఆ లేఖలకు కమిషనర్ నుంచి స్పందన లేకపోవడం గమనార్హం.
వైకుంఠధామం ఏర్పాటుకే పరిమితం..
గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా గ్రామాల్లో ఏర్పాటు చేయనున్న ఒక్కో వైకుంఠధామం ఏర్పాటు/అభివృద్ధికి మాత్రమే ఉపాధిహామీ నిధులను వెచ్చించనున్నారు. ఈ నిధులతో ఒక్కో శ్మశాన వాటికలో రెండు దహన వేదికలు, ఒక స్టోర్‌రూమ్, సందర్శకుల కోసం ఒక షెడ్, రెండు మరుగుదొడ్లు, సింటెక్స్ ఓవర్‌హెడ్ ట్యాంక్, సోలార్ లైటింగ్ సదుపాయాలను ఏర్పాటు చేస్తారు. దీంతోపాటు భూమి అభివృద్ధి, పొదల తొలగింపు, భూమి చదును, హద్దుల ఏర్పాటు పనులను ఉపాధిహామీ కింద వేరుగా చేపడతారు. అన్ని పనులు పూర్తి కాగానే వైకుంఠధామాన్ని సదరు గ్రామ పంచాయతీకి అప్పగిస్తారు.
ఇదెక్కడి పంచాయితీ!
Published Mon, May 8 2017 2:30 AM | Last Updated on Tue, Sep 5 2017 10:38 AM
Advertisement
Advertisement