తీరనున్న తండ్లాట
- గ్రామ పంచాయతీల ఏర్పాటుపై ఆశలు
- 500 జనాభా గల తండాలు గుర్తింపు
- 341 కొత్త జీపీలు అయ్యే అవకాశం
జిల్లావ్యాప్తంగా 1,207కు పెరగనున్న జీపీలు
ఉట్నూర్ : టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆ దిశగా అడుగులు వేస్తోంది. 500 జనాభా ఉన్న గిరిజన తండాలు, గూడెలను పంచాయతీలుగా మార్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని పంపించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. అందుకు అనుగుణంగా నివేదికలు పంపించారు. జిల్లా వ్యాప్తంగా 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రభుత్వం గుర్తించిన 32 నోటిఫైడ్ గిరిజన మండలాలతోపాటు మరో 12 మండలాల్లో 4,95,794 గిరిజన జనాభా ఉంది.
జిల్లాలో 866 గ్రామ పంచాయతీలుండగా ఇందులో షెడ్యూల్డ్, నాన్ షెడ్యూల్డ్ ప్రాంతాల్లో కలిపి 272 గిరిజన పంచాయతీలు, 646 గ్రామాలు, 2 వేల వరకు అనుసంధాన గ్రామాలు ఉన్నాయి. ఇక తెగలవారీగా గిరిజన జనాభాలో గోండులు 2,63,515, లంబాడాలు 1,12,793, కోలాంలు 38,176, ప్రధాన్స్ 26,029, మన్నెవార్ 15,370, నాయక్‌పోడ్ 5,206, తోటి 2,231, ఎరుకల 1,735, కోయ, ఇతరులు 30,739 చొప్పున నివాసం ఉంటున్నారు.
341 పంచాయతీలు అయ్యే అవకాశం
ప్రభుత్వ నిర్ణయం ప్రకారం తండాలు, గూడేలు గ్రామ పంచాయతీలుగా మార్చితే నూతనంగా 341 గ్రామ పంచాచతీలు ఏర్పాటయ్యే అవకాశం ఉందని జిల్లా అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. తండాలు, గూడాల పూర్తి వివరాలు ఇప్పటికే సిద్ధం చేశారు. జిల్లాలో 272 గిరిజన గ్రామ పంచాయతీలున్నాయి. వీటికి అనుసంధానంగా ఉన్న తండాలు, గూడాలను గుర్తించి వాటిలో 500 గిరిజన జనాభా ఉన్న వాటిని విలీనం చేస్తూ నూతన పంచాయతీల ఏర్పాటు జరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే గిరిజన పంచాయతీల ఏర్పాటు ఏ విధంగా చేపట్టాలో ప్రభుత్వం నుంచి విధివిధానాలు రాక పోవడంతో తాము కేవలం సమాచారం సేకరించి పంపినట్లు అధికారులు తెలిపారు.
అభివృద్ధి వేగవంతం
గిరిజన ప్రాంతాల్లో ప్రస్తుతం పంచాయతీలకు అనుసంధాన తండాలు, గూడాలు కిలోమీటర్ల దూరం ఉండటంతో పాలకవర్గాలు, యంత్రాంగం పూర్తిస్థాయి దృష్టి సారించక అభివృద్ధి కుంటుపడుతోంది. ఇప్పటికీ తండాలు, గూడాల్లో రోడ్లు, తాగునీరు, విద్యుత్, ప్రభుత్వ విద్య తదితర మౌలిక వసతులు లేక కొట్టుమిట్టాడుతున్నాయి. రాజకీయ పార్టీల నాయకులు తమ మనుగడ, ఓటు బ్యాంక్ కోసం ప్రభుత్వాలు విడుదల చేసే నిధులను జనాభా అధికంగా ఉండే పంచాయతీల్లో ఖర్చు చేస్తూ అనుబంధంగా ఉన్న పంచాయతీలను విస్మరించారు. నూతన పంచాయతీలుగా ఏర్పాటుతో అయా పంచాయతీల్లో స్థానికంగా రాజకీయ అవకాశాలు పెరుగడంతోపాటు ప్రభుత్వం బాధ్యత పెరిగి అభివృద్ధి వేగవంతం అవుతుంది.
ప్రయోజనాలు ఇవే..
- నూతన పంచాయతీల వల్ల పాలన సులభం అవుతుంది. తద్వారా ప్రజలు పంచాయతీల ద్వారా వివిధ ధ్రువీకరణ పత్రాలు సునాయసంగా పొందవచ్చు.
- పంచాయతీల విడిది చిన్నదిగా ఉండటంతో గ్రామాల్లో మురికి కాలువల నిర్వహణ, వీధి దీపాలు, తాగు నీరు ఇతర వసతుల కల్పనలో ఎలాంటి అటంకాలు ఉండవు.
- పంచాయతీ జనాభా తక్కువగా ఉండటం వల్ల పంచాయతీ పాలక వర్గాలు ప్రజలకు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాయి.
- ప్రజలకు పంచాయతీలకు మధ్య దూరభారం తగ్గుతుంది. గ్రామ సమస్యలను ప్రజలు పాలకుల దృష్టికి తీసుకురాగలుగుతారు.
- ప్రభుత్వ నిధుల విడుదలతో గ్రామాల అభివృద్ధి వేగం అవుతుంది.
- ప్రభుత్వం పంచాయతీల ద్వారా అమలు చేసే సంక్షేమ పథకాలు నేరుగా అర్హులకు అందించేందుకు వీలవుతుంది.