‘ఉపాధి’ ఇక కొందరికే ! | Employment Guarantee Scheme only for some peoples | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’ ఇక కొందరికే !

Published Sat, Sep 20 2014 2:19 AM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM

‘ఉపాధి’ ఇక కొందరికే ! - Sakshi

‘ఉపాధి’ ఇక కొందరికే !

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రూపురేఖలు మారనున్నాయి. ఈ పథకాన్ని కొత్త తరహాలో అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యూహరచన చేసింది. జిల్లా నీటి యాజమాన్య సంస్థకు ఉత్తర్వులు కూడా అందాయి. ఇకపై జిల్లా అంతటా కాకుండా కేవలం నిరుపేదలున్న గ్రామాల్లో మాత్రమే ఉపాధి హామీ పథకం అమలు కానుంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 76 మండలాలకు ఈ పథకం వర్తించనుండగా.. జిల్లాలో 8 మండలాలకు చెందిన సుమారు 212 గ్రామాల్లో ‘ఉపాధి’ పనులు జరగనున్నాయి.

ఈ ఎనిమిది మండలాల్లో ప్రత్యే క చర్యల ద్వారా గ్రామాలను, నిరుపేద కుటుంబాలను అభివృద్ధి చేయాలని, వారికి అండగా నిలవాలనేది కేంద్రం నిర్ణయం. గాంధారి, బిచ్కుంద, జుక్కల్, మద్నూరు, నిజాంసాగర్‌తో పాటు మరో మూడు మండలాల్లోని గ్రామాల్లో 2015-16 సంవత్సరానికి ఉపాధి హామీ పథ కం ద్వారా పనులు చూపాలని గ్రామీణాభివృద్ధి శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

ప్రస్తుతం ‘ఉపాధి’..

జిల్లాలోని 36 మండలాలకు చెందిన 718 గ్రామ పంచాయతీలు, 1,297 హాబిటేషన్లలో ఉపాధి హామీ పథకం పనులను గుర్తించారు. 25,669 గ్రూపులకు చెందిన 4,48,077 మందికి జాబ్‌కార్డులు జారీ చేశారు. వీరందరికి పనులు కల్పించేందుకు మొత్తం 52,526 పనులను గుర్తించిన అధికారులు రూ.866.69 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇప్పటి వరకు రూ.126.88 కోట్లు ఖర్చు చేసి 18,652 పనులు పూర్తి చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే ఈ ఏడాది సుమారు 1.08 కోట్ల పనిదినాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు ఆ మేరకు కృషి చేస్తుండగా ఇప్పటి వరకు 82 లక్షల పనిదినాలు పూర్తయినట్లు చెప్పారు. సీజన్‌లో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన అన్ని పనుల్లో 80 వేల మంది నుంచి 1.12 లక్షల మంది వరకు కూలీలు పాల్గొన్నారు. ప్రస్తుతం ఆ సంఖ్య 10-15 వేల మందికి పడిపోయినట్లు చెప్తుండగా ఈ ఏడాది ఇప్పటి వరకు 9,243 కుటుంబాలకు 100 రోజుల ‘ఉపాధి’ లభించింది. ఇప్పటి వరకు ఉపాధి హామీ పథకం అమలు తీరు ఇలా వుంటే... కేంద్ర ప్రభుత్వం కొత్తగా పూర్తిగా నిరుపేదలున్న గ్రామాలకే పరిమితం చేయాలని జీవో జారీ చేయడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.

భవిష్యత్ ‘ఉపాధి’ కార్యాచరణ..

జిల్లాలో ఎంపిక చేసిన ఎనిమిది మండలాలకు చెందిన గ్రామాలకే ఉపాధి హామీ పథకం అమలవుతుంది. మురికి వాడల్లో పనులను గుర్తిస్తారు. గ్రామ ప్రజలతో చర్చించి అభివృద్ధి పనులు చేపడతారు. ఇందుకోసం ఉపాధి కూలీలకు, గ్రామ ప్రజలకు శిక్షణ తరగతులు ఇస్తారు. ఆ తర్వాత ఊరికి కావాల్సిన పనులను గుర్తించి ప్రజలతో చర్చించి సర్పంచి నివేదికలు సిద్ధం చేయాల్సి ఉంటుంది. తర్వాత మూడు రోజుల్లో గ్రామసభ ఏర్పాటు చేయాలి. నవంబర్ 29లోగా గుర్తించిన పనులను గ్రామసభ, జిల్లా పరిషత్తు ఆమోదం పొందేట్లు చేస్తారు. డిసెంబర్ 20 నాటికి కలెక్టర్ అనుమతి పొందిన పనులు మొదలు పెడతారు. ఈ పనులను మూడు దశలుగా విభజించనున్నారు. మొదటి దశ కింద ప్రకృతి వనరుల పనులకు ప్రాధాన్యం ఇస్తారు. వాటర్‌షెడ్ల నిర్మాణం, చెరువుల మరమ్మతులు, స్థానిక ట్యాంకు, కేసీ కెనాల్‌లో పూడికతీత పనులు, మొక్కల పెంపకం వంటివి చేపడతారు. రెండో దశలో నిరుపేద కుటుంబాల్లో ఎస్సీ, ఎస్టీల భూమి అభివృద్ధి పనులు, వారి పొలాల్లో పండ్లతోటల పెంపకం, నిరుపయోగమైన భూమిని సాగులోకి తేవడం, కోళ్ల, గొర్రెల పెంపకం వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తారు. మూడో దశ కింద స్వయం సహాయక సంఘాల ద్వారా వ్యవసాయ ఉత్పాదక పనులు, సేంద్రియ ఎరువులు, పండ్లు దాచిపెట్టడానికి గోదాములు, గ్రామీణాభివృద్ధికి సంబంధించిన పారిశుద్ధ్యం, వ్యక్తిగత మరుగుదొడ్లు, గ్రామాల్లో రహదారుల నిర్మాణం, పాఠశాలల్లో మైదానం లాంటి పనులు చేపడతారు.
 
ప్రభుత్వం నుంచి ఇంకా ఉత్తర్వులు అందలేదు -శివలింగయ్య, పీడీ, డ్వామా
 
2015-16 సంవత్సరానికి సంబంధించి ఉపాధి హామీ కింద కొత్తగా చేపట్టే అంశాలకు సంబంధించిన ఎలాంటి ఉత్తర్వులు అందలేదు. అధికారికంగా ఎలాంటి ఆదేశాలు లేవు. జిల్లాలో ఉపాధి హామీ పథకం పనులు బాగా జరుగుతున్నాయి. 1.08 కోట్ల పనిదినాలు లక్ష్యంగా పెట్టుకుంటే 85 లక్షల పనిదినాలు కల్పించాము.. మరో అరు నెలల గడువుంది... మిగతా పనిదినాలు కూడ కల్పిస్తాం. అవసరమైన పనులు చేపట్టి ఉపాధి చూపిస్తాం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement