వ్యవసాయ కూలీలు పనుల సమయంలో ఖాళీగా లేకుండా, పనుల కోసం వలస పోకుండా తమ ప్రాంతాలలోనే పనులు చేసుకొని ఉండాలన్న ఉద్దేశంతో గతంలో కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని అమలులోకి తెచ్చింది. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పథకాలకు రాజకీయ రంగు పూసి తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటుంది. పథకాల అమల్లో లోపాలుంటే మాత్రం దాన్ని అమలు చేసే వారిపై నెడుతుంది.
రామభద్రపురం: కేంద్ర పథకాలకు రాష్ట్రంలో అధికార తెలుగుదేశం ప్రభుత్వం తమ రంగు వేస్తూ ప్రయోజనం పొందేందుకు శతవిధాల ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే ఉపాధి హామీ జాబ్ కార్డులను పూర్తిగా పసుపు రంగుతో ముద్రించి జారీ చేసింది. తెలుగుదేశం ప్రచార కార్డులుగా పసుపు రంగుతో ముద్రించిన జాబ్‌కార్డులను ఇప్పటికే జిల్లాలోని ఏపీఓలు క్షేత్ర స్థాయి అధికారులకు అందజేశారు. వీటిని జన్మభూమి గ్రామ సభలలో ఉపాధి హామీ వేతనదారులకు అందజేస్తున్నారు. జిల్లాలో 5,03,038 జాబ్‌కార్డులుండగా, సుమారుగా 11 లక్షలు వేతనదారులున్నారు. వారిలో 3,50,000 పైబడి జాబ్‌కార్డుదారులు పనులుకు వెళ్తున్నట్టు సమాచారం. వీరికి గతంలో మాదిరిగా కాకుండా కొత్తగా పసుపు పచ్చరంగులో ఉపాది పనులకు పోతున్న వేతనదారులకు మాత్రమే ఫోటోలతో ముద్రించిన జాబ్‌కార్డులను పంపిణీ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న జాబ్‌కార్డులు స్థానంలో కొత్త వాటికి ఆధార్ అనుసంధానం చేసి అందజేస్తున్నారు.
వీటిని పుస్తక రూపంలో ముద్రించి కుటుంబంలో ఉపాధి పనులకు వెళ్తున్న వారి వివరాలను ముద్రించారు. కార్డు ఐదేళ్లు ఉపయోగపడేలా రూపొందించారు. అలాగే పనులు చేసే ముందుగా ఒక ఫోటో, 60 శాతం పనులు పూర్తి చేసిన తరువాత మరో ఫోటో తీసి జియో ట్యాగింగ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఉపాధి పనుల్లో అక్రమాలకు తావు లేకుండా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇక నుంచి వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఈ జాబ్ కార్డులు కీలకంగా మారనున్నాయని సమాచారం. హౌసింగ్ పథకంలో ఇళ్ల నిర్మాణం, ఇంకుడు గుంతల తవ్వకం, గ్రామాల్లో సీసీ రోడ్లు, వ్యక్తిగత మరుగుదొడ్లు, పశుగ్రాస క్షేత్రాలు నాడెఫ్ తొట్లు, చెరువులు తవ్వకం, పూడికతీత పనులు, వర్మీ కంపోస్టులు, మట్టి రోడ్ల నిర్మాణం ఇలా అన్ని పనులకు జాబ్‌కార్డుల అవసరం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దీంతో కొత్తగా అందజేస్తున్న జాబ్‌కార్డులు టీడీపీ ప్రచార కార్డులుగా ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని బీజేపీ నాయకులు పెదవి విరుస్తున్నారు.
సొంత పథకాలుగా ప్రచారం తగదు...
రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సంక్షేమ ప«థకాలను అమలు చేస్తాయి. ఆ పథకాలను కేంద్రం ఇచ్చిన వాటా ఎంత ఉంది, రాష్ట్ర ప్రభుత్వ వాటా ఎంత అనేది రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారం చేయాలి. అలా కాకుండా సొంత పథకాలుగా ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉంది. –పెద్దింటి జగన్మోహనరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు
నిర్వీర్యం చేస్తోంది...
రాష్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతీ పథకానికి 80 శాతం నిధులు ఇస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకోవడం తప్ప కనీసం ఏ పథకానికి కేంద్రం ప్రభుత్వ పేరు చెప్పడం లేదు. –ఆర్.లక్ష్మణరావు, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు
Comments
Please login to add a commentAdd a comment