సబ్సిడీ నిధులు ఆదా చేస్తే మీకే..!
రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్
* ఎల్‌పీజీ తరహాలో నేరుగా లబ్ధిదారులకే ప్రయోజనాలు
* దీంతో డూప్లికేట్లు, అనర్హులు, అక్రమార్కులకు ముకుతాడు
* దేశవ్యాప్తంగా రూ.36 వేల కోట్లు మిగులుతాయని అంచనా
* అన్ని రాష్ట్రాల్లోని లబ్ధిదారుల డేటా ఒకేచోటికి
* డీబీటీ ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: పెన్షన్లు.. స్కాలర్‌షిప్పులు.. ఉపాధిహామీ.. ప్రజాపంపిణీ.. ఉపాధి శిక్షణ.. వీటికి సంబంధించి అమలవుతున్న పథకాలు.. కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీని అందిస్తోంది.
వీటిలో కొన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు చేరుతున్నాయి. మరికొన్ని పథకాలకు సంబంధించిన సబ్సిడీ ముందుగా ఆయా శాఖలకు అందుతున్నాయి. అయితే ఈ సబ్సిడీ నిధులు వివిధ రకాలుగా దుర్వినియోగమవుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం చాలావరకూ దెబ్బతింటోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. సబ్సిడీ నిధులను ఆదా చేస్తే ఆ డబ్బును రాష్ట్రాలకే పంచి పెడతామని ప్రకటించింది. వివిధ పథకాలకు ఇస్తున్న సబ్సిడీ నిధులను నేరుగా లబ్ధిదారులకు బదిలీ చేసే విధానాలను అమలు చేస్తే.. దేశవ్యాప్తంగా సుమారు రూ.36 వేల కోట్లు మిగులుతాయని అంచనా వేసింది.
కేంద్రం ఇప్పటికే ఎల్‌పీజీ గ్యాస్ సబ్సిడీలను నేరుగా వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా దాదాపు రూ.28 వేల కోట్లు ఆదా అయినట్లుగా లెక్కతేల్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తే సబ్సిడీ నిధులను ఆదా చేసే అవకాశముందని, వీటిని ఆయా రాష్ట్రాల ఖాతాలకే బదిలీ చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు తగిన వ్యూహాలను అమలు చేయాలని సూచించింది. ఇటీవల కేంద్ర కేబినెట్ సెక్రెటేరియట్ అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ అధికారులతో ఢిల్లీలో ఈ అంశంపై ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించింది.
నేరుగా ప్రయోజనం
ఉదాహరణకు రేషన్ బియ్యం, కిరోసిన్, ప్రజా పంపిణీ ద్వారా సరఫరా చేసే రేషన్ సరుకులపై కేంద్రం ఇచ్చే సబ్సిడీ నేరుగా రాష్ట్ర ఖాతాలో జమవుతుంది. అందుకు బదులుగా కిరోసిన్ లబ్ధి పొందే రేషన్ కార్డుదారుడికి.. ఆ నెల కిరోసిన్ అందిందా..? లేదా..? అనే వివరాలను సెల్‌ఫోన్‌కు ఎస్సెమ్మెస్ పంపించే విధానం అమలు చేయాలని నిర్ణయించింది.
దీంతో సబ్సిడీ కిరోసిన్‌పై పక్కదారి పడుతున్న కోట్లాది రూపాయలు ఆదా అవుతాయని కేంద్రం భావిస్తోంది. కొన్ని పథకాలకు ఐరిష్ విధానం అమలు చేయాలని, మరికొన్నింటికి బయో మెట్రిక్‌ను.. ఇదేతరహాలో వివిధ విభాగాల్లో అమలవుతున్న పథకాలను, లబ్ధిదారుల డేటాను ఒకేచోటికి చేర్చడం ద్వారా భారీ మొత్తంలో నిధులు ఆదా అవుతాయని విశ్లేషించింది. దీంతో డూప్లికేట్లు, అనర్హులు, అక్రమార్కులకు ముకుతాడు పడుతుందనే అభిప్రాయపడింది.
లబ్ధిదారుల డేటా ఒకేచోట..
అన్ని విభాగాల డేటాను సమ్మిళితం చేసేందుకు వీలుగా పథకాలన్నింటినీ ‘ఆధార్’తో అనుసంధానం చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. అన్ని రాష్ట్రాలు తమ దగ్గర ఉన్న డేటాను కేంద్రం అధ్వర్యంలోని ‘సర్వం’ డేటాబేస్‌తో లింకప్ చేయాలని సూచించింది. దీంతో అన్ని రాష్ట్రాల్లో లబ్ధిదారుల డేటా ఒకేచోటికి చేరుతుంది. ప్రభుత్వం సైతం ఎప్పటికప్పుడు తమకు అవసరమైన సమాచారాన్ని ఈ డేటాబేస్ నుంచి రాబట్టుకునే అవకాశం ఉంటుంది.
ఆధార్‌తో అనుసంధానం చేయటం ద్వారా.. ఏ గ్రామంలో.. ఏ కుటుంబం.. ప్రభుత్వం నుంచి ఏయే పథకాల్లో ఎంతమేరకు లబ్ధి పొందిందనే వివరాలను క్షణాల్లో తెలుసుకోవటం సాధ్యమవుతుందని, అది ప్రజా ప్రతినిధులకు, రాష్ట్ర ప్రభుత్వాలకు సైతం ఉపయుక్తంగా ఉంటుందని నిర్దేశించింది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు డెరైక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్(డీబీటీ) సెల్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రం తక్షణ కార్యాచరణను నిర్దేశించింది. గత వారంలో జరిగిన ఈ సదస్సు నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం డీబీటీ సెల్‌ను ఏర్పాటు చేసింది.
ఆర్థిక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్‌ను ఈ సెల్‌కు కో ఆర్డినేటర్‌గా, జాయింట్ సెక్రెటరీ వి.సాయిప్రసాద్‌ను నోడల్ ఆఫీసర్‌గా నియమించింది. అన్ని విభాగాల్లో పథకాలను, లబ్ధిదారుల డేటాను సమ్మిళితం చేసి.. ఒకే డేటాబేస్ కిందికి తీసుకువచ్చేందుకు డీబీటీ సెల్ ప్రత్యేక కార్యాచరణ చేపడుతుంది. రాష్ట్రంలో డేటా ఒకేచోటికి వచ్చిన తర్వాత.. కేంద్రం సూచించిన ‘సర్వం’ డేటాబేస్‌కు లింకప్ చేస్తారు.