‘ఉపాధి’కి నిధుల కొరత!
నెలరోజులుగా కూలీలకు నిలిచిన చెల్లింపులు
♦ దాదాపు కోటి పనిదినాలకు రూ. 170 కోట్ల వరకు బకాయిలు
♦ ఆగస్టులోనే రూ. 550 కోట్లు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
♦ ఆ నిధులను ఇతర అవసరాలకు వినియోగించుకున్న రాష్ట్ర సర్కారు
♦ ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో గ్రామాల్లో ఆగిన పనులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధి హామీ పనులకు నిధుల కొరత ఏర్పడింది. తొమ్మిది జిల్లాల్లో ఉపాధి పనులకు వెళుతున్న సుమారు తొమ్మిది లక్షల మంది కూలీలకు వేతనాలు నిలిచిపోయాయి. దాదాపు నెల రోజులుగా రోజువారీ వేతనాలు అందకపోతుండడంతో ఉపాధి పనులకు వచ్చే వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. ఫిబ్రవరి మొదటి వారంలో 44.86 లక్షల పనిదినాలు నమోదు కాగా, రెండో వారం 35.30 లక్షలు, మూడోవారంలో 14.76 లక్షల పనిదినాలు నమోదు కావడం గమనార్హం. నెలారంభంలో రోజుకు తొమ్మిది లక్షల మంది పనులకు హాజరుకాగా.. మూడోవారంలో పనులకు హాజరైంది మూడు లక్షల మందే.
ఉపాధి హామీ పథకం కింద కేంద్రం ఆగస్టులోనే రూ. 550 కోట్లను రాష్ట్రానికి విడుదల చేసినా.. చెల్లింపులు లేకపోవడం ఆందోళనకరంగా మారింది. అసలు గత ఆర్థిక సంవత్సరం వరకు కేంద్రం ఉపాధి హామీ పనులను నిర్వహించే రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖకే నేరుగా నిధులు ఇచ్చేది. కానీ ఈసారి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తోంది. ఇలా అందిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర ప్రాజెక్టులకు మళ్లించింది. దీంతో కూలీలకు వేతనాలు చెల్లించలేక గ్రామీణాభివృద్ధిశాఖ చేతులెత్తేసింది.
భారీగా బకాయిలు..
రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి హామీ పనులు జరిగిన ప్రాంతాల్లో సుమారు కోటి పనిదినాలు పూర్తి చేసిన కూలీలకు దాదాపు రూ.170 కోట్లు చెల్లించాల్సి ఉంది. చేసిన పనికిగాను రోజువారీ వేతనాలను చెల్లించకపోతుండడంతో కూలీల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఉపాధిహామీ పథకం కింద రోజుకు కూలీ రూ. 180గా కేంద్రం నిర్ణయించినా... సగటున రూ.130కి మించి అందడం లేదు. ఇక వేసవిలో ఉపాధి పనులు పనిచేసే కూలీలకు కేంద్రం 20 నుంచి 35శాతం ప్రత్యేక అలవెన్స్‌ను ప్రకటించినా... రూ.170 నుంచి రూ. 180లోపే అందుతోంది. ఇది కూడా కొద్దిరోజులుగా చేతికి అందకపోతుండడంతో ఉపాధి పనులకు వచ్చే కూలీల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతోంది. ఫలితంగా గ్రామాల్లో జరగాల్సిన పనులు మందగించాయి.
అధికారులు ఏమంటున్నారంటే..
ఉపాధి పనులు చేసిన కూలీలకు కొన్నిరోజులు వేతనాలు అందకపోవడం వాస్తవమేనని క్షేత్రస్థాయి అధికారులే చెబుతున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి నిధులు రాకపోవడంతో కూలీలకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదని వాపోతున్నారు. అయితే పనులకు వచ్చే కూలీల సంఖ్య తగ్గిపోవడానికి వేతనాలు అందకపోవడంతోపాటు చాలా మంది కూలీల కుటుంబాలు 150 రోజుల పనిదినాలను పూర్తి చేసుకుని ఉండడం, గ్రామాల్లో జాతరలు, వివాహాలకు ఇదే సీజన్ కావడం కూడా కారణమని చెబుతున్నారు. కూలీలకు పనులు కల్పించే విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదని... భూముల అభివృద్ధి, ఇంకుడు గుంతల తవ్వకం, మరుగుదొడ్ల నిర్మాణం తదితర పనులు సమృద్ధిగా ఉన్నాయని అంటున్నారు.