ఆంధ్రప్రదేశ్‌–తెలంగాణ రాష్ట్రాల మధ్య మరో హైవే.. కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ | Another highway between Andhra Pradesh and Telangana States | Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్‌–తెలంగాణ రాష్ట్రాల మధ్య మరో హైవే.. కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌

Published Mon, Dec 19 2022 5:28 AM | Last Updated on Mon, Dec 19 2022 10:35 AM

Another highway between Andhra Pradesh and Telangana States - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌–తెలంగాణ రాష్ట్రాలను అనుసంధానిస్తూ మరో జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి నుంచి మన రాష్ట్రంలోని వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు వరకు 255 కి.మీ. మేర నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ ఆమోదించింది. రూ.4,706 కోట్ల అంచనా వ్యయంతో ఈ రహదారి నిర్మించనున్నారు.

రహదారిలో అంతర్భాగంగా ఇప్పటికే కృష్ణా నదిపై వంతెన నిర్మాణానికి ఎన్‌హెచ్‌ఏఐ టెండర్ల ప్రక్రియ చేపట్టింది. కాగా, రెండు రాష్ట్రాలను అనుసంధానిస్తూ నాలుగు లేన్ల రహదారి నిర్మాణ ప్రక్రియ కూడా తాజాగా చేపట్టింది.  

రహదారి నిర్మాణం ఇలా... 
తెలుగు రాష్ట్రాలను అనుసంధానించే 255 కి.మీ. రహదారి(ఎన్‌హెచ్‌167కె)ని ఏడు ప్యాకేజీల కింద నిర్మిస్తారు. అందులో తెలంగాణలో 91 కి.మీ. రహదారిని రూ.2,406 కోట్లతో నిర్మించేందుకు డీపీఆర్‌ను రూపొందించారు. మొదటి ప్యాకేజీ కింద రూ.886.69 కోట్లు, రెండో ప్యాకేజీ కింద రూ.1,082.40 కోట్లు, మూడో ప్యాకేజీ కింద రూ.436.91కోట్లతో పనులు చేపట్టేందుకు ఎన్‌హెచ్‌ఏఐ టెండర్ల ప్రక్రియ చేపట్టనుంది.

ఇక ఏపీలో 164 కి.మీ. మేర రూ.2,300 కోట్ల అంచనా వ్యయంతో రహదారి నిర్మాణానికి ప్రణాళికను రూపొందించారు. మొత్తం నాలుగు ప్యాకేజీల కింద నంద్యాల జిల్లా సిద్ధేశ్వరం నుంచి వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు వరకు ఈ రహదారిని నిర్మిస్తారు. అందులో మొదటి ప్యాకేజి కింద 62.57 కి.మీ. మేర రహదారి నిర్మాణానికి రూ.785 కోట్లతో పనులకు డీపీఆర్‌ను తాజాగా ఖరారు చేశారు.

మిగిలిన మూడు ప్యాకేజీల కింద పనులను రూ.1,515 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ డీపీఆర్‌ను రూపొందిస్తోంది. నాలుగు ప్యాకేజీల డీపీఆర్‌లు ఖరారు అయ్యాక 2023 ఫిబ్రవరి మొదటి వారంలో టెండర్ల ప్రక్రియ చేపట్టి ఏడాదిన్నరలో నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఎన్‌హెచ్‌ఏఐ భావిస్తోంది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement