విశాఖపట్నం, సాక్షి: కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ మరోసారి ఏపీని మోసం చేసింది. విశాఖపట్నం రైల్వే జోన్ విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతూనే ఉంది. తాజాగా విశాఖకు జోన్ ఇవ్వకుండానే ఒడిషాకు రాయగడ డివిజన్ ఇచ్చారు. ఇదే సమయంలో రాయగడ డీఆర్‌ఎం కార్యాలయానికి టెండర్ కూడా ఇచ్చారు. రాయగడ డివిజన్ ఏర్పాటుతో విశాఖ రైల్వే జోన్ తీవ్రంగా నష్టపోనుంది. ఆదాయం వచ్చే ప్రాంతమంతా ఒడిషాలో కలిసిపోతుందని విశాఖ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు.. వాల్తేరు డివిజన్ రద్దువైపు అడుగులు పడుతున్నాయి. దశాబ్దాలుగా విశాఖపట్నం రైల్వే జోన్ కల నెరవేరటం లేదు. 2019 ఎన్నికలకు ముందు రైల్వే జోన్ ఇస్తామని కేంద్రం ప్రకటన చేసింది. ఈ మేరకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైల్వే జోన్ కోసం సరిపడా భూమి ఇచ్చినా కేంద్ర ప్రభుత్వం ముందుకు రాలేదు. కాగా, వాల్తేర్ డివిజన్‌తో కలిపి విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని ఎప్పటినుంచో డిమాండ్ ఉంది.
కానీ, రైల్వే జోన్‌పై కేంద్ర ప్రభుత్వం మాత్రం కేవలం మాటలకు మాత్రమే పరిమితం అవుతోంది. రైల్వే జోన్ ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వంపై కూటమి నేతలు ఎటువంటి ఒత్తిడి చేయకపోవటం గమనార్హం. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నోరు మెదపటం లేదు.
Comments
Please login to add a commentAdd a comment