అతిసార విజృంభిస్తోంది. పరిగి మండల పరిధిలోని పలు గ్రామాలను కుదిపేస్తున్న అతిసార సోమవారం మరో గ్రామానికి పాకింది. గోవిందాపూర్, చిగురాల్‌పల్లి గ్రామాల్లో ఇప్పటికే అతిసార బాధితులు ఉండగా కొత్తగా ఇబ్రహీంపూర్ తండాలో మరో నలుగురికి సోకింది. శని, ఆదివారాల్లో పరిగి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన అతిసార బాధితుల పరిస్థితి నిలకడగా ఉంది. సోమవారం ఆయా గ్రామాలకు చెందిన మరో 14 మంది అతిసారతో ఆస్పత్రిలో చేరారు. ఇప్పటికే పరిగి, నస్కల్, రూప్‌ఖాన్‌పేట్, చిగురాల్‌పల్లి, గోవిందాపూర్ గ్రామాల నుంచి 10 మంది రోగులు ప్రభుత్వ ఆస్పత్రిలో, మరో 10 మంది పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరారు. ఇబ్రహీంపూర్ తండాకు చెందిన నలుగురు సోమవారం ఆస్పత్రిలో చేరారు.
వివరాలు సేకరించిన అధికారులు
చిగురాల్‌పల్లి, గోవిందాపూర్ గ్రామాలను సోమవారం అధికారులు సందర్శించారు. అక్కడ అతిసారకు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. చిగురాల్‌పల్లి గ్రామాన్ని సందర్శించిన ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ జగదీశ్వర్‌రెడ్డి గ్రామంలో పరిస్థితులను పరిశీలించారు. పైపులైన్ లీకేజీలు ఉన్న చోట కొత్తగా పైపులైన్ వేయాలని స్థానిక అధికారులు, సర్పంచ్ సావిత్రమ్మలకు సూచించారు. అవసరమైతే ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు. ఎస్పీహెచ్‌ఓ దశరథ్, తహశీల్దార్ బాల్‌రాజ్, ఎంపీడీఓ విజయప్ప, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ నర్సింలు, ఏఈ జైపాల్‌రెడ్డి తదితరులు ఆయా గ్రామాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ట్యాంకు ద్వారా నీళ్లు సరఫరాను నిలిపివేశారు. దీంతో ప్రస్తుతం గ్రామస్తులు మినరల్ వాటర్ తాగుతున్నారు.
మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
స్థానిక ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి సోమవారం మండల పరిధిలోని చిగురాల్‌పల్లిని సందర్శించారు. అతిసారతో మృతిచెందిన చిన్నారి శివలీల కుటుంబీకులను ఆయన పరామర్శించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకుని గ్రామస్తులు, యువకులతో మాట్లాడారు. గ్రామస్తులకు అవగాహణ కల్పించాలని ఆయన అధికారులకు సూచించారు. గ్రామంలోని రోడ్ల బాగు కోసం రూ. 10 లక్షలు కేటాయిస్తానని ఎమ్మెల్యే గ్రామస్తులకు హామీ ఇచ్చారు.
అతిసారకు కల్లే కారణమా?
చిగురాల్‌పల్లి, గోవిందాపూర్, మిట్టకోడూర్ గ్రామాల్లో ఆయా శాఖల అధికారులు సందర్శించి అతిసార ప్రబలటానికి కారణాలను తెలుసుకున్నారు. గ్రామస్తులతో మాట్లాడి ఓ అంచనాకు వచ్చారు. మండల పరిషత్, ఆర్‌డబ్య్లూఎస్, ఆరోగ్య శాఖల పనితీరు బాగానే ఉన్నప్పటికీ ఆ మూడు గ్రామాల్లో ప్రజలు కల్లు తాగటం వల్లే అతిసార ప్రబలినట్లు అధికారులు నిర్ధారించారు. మిట్టకోడూర్‌లో తయారవుతున్న కల్లు మిగతా రెండు గ్రామాలకు సరఫరా అవుతోందని కల్తీ కల్లుతోనే ప్రజలకు అతిసార సోకిందని అధికారులు పేర్కొంటున్నారు. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డికి వివరించగా సదరు కల్లు దుకాణాన్ని మూసివేయాలని అధికారులకు సూచించారు.
పరిగిలో ప్రబలిన అతిసార
Published Tue, Aug 6 2013 12:58 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement
Advertisement