Diarrhoea virus
-
డయేరియాకు చెక్
సాక్షి, అమరావతి: గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది డయేరియా, టైఫాయిడ్ కేసులు భారీగా తగ్గాయి. వర్షాలు ఎక్కువగా కురిసినా కేసులకు అడ్డుకట్టపడింది. 2019తో పోలిస్తే.. డయేరియా కేసులు 50 శాతానికి పైగా తగ్గినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వాస్తవానికి 2019 కంటే ఈ ఏడాదే వర్షాలు ఎక్కువగా కురిశాయి. అయితే, సురక్షిత తాగునీరు అందించడం, పారిశుధ్య పనుల నిర్వహణలో ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడంతో కేసులు తగ్గినట్టు నిపుణులు చెబుతున్నారు. టైఫాయిడ్ కేసులు సైతం భారీగా తగ్గడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. సర్కారు ఆదేశాలతో.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ఏడాది వర్షాకాలంలో సాంక్రమిక వ్యాధుల విభాగం (ఎపిడెమిక్ సెల్) అప్రమత్తంగా వ్యవహరించింది. అన్ని స్థాయిల్లోని సిబ్బంది వర్షాకాలంలో 24/7 క్షేత్రస్థాయిలో తగిన చర్యలు చేపట్టారు. సాంక్రమిక వ్యాధుల నివారణ మందులతోపాటు పాముకాటు, కుక్క కాటు మందులనూ ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. వర్షాల బారిన పడిన ప్రాంతాల్లో పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టడంతోపాటు వైద్యారోగ్య శాఖతో కలిసి సురక్షిత తాగునీటిని ప్రజలకు అందేలా చూశారు. ఈ చర్యలన్నీ సత్ఫలితాలివ్వడంతో డయేరియా, టైఫాయిడ్ కేసులు భారీగా తగ్గాయి. 2019లో 4,60,931 డయేరియా కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది 1.58 లక్షల కేసులు మాత్రమే నమోదయ్యాయి. టైఫాయిడ్ కేసుల విషయానికి వస్తే 2019లో 28,551 నమోదు కాగా.. ఈ ఏడాది 7,869 మాత్రమే నమోదయ్యాయి. ఈ ఏడాది నెల్లూరు జిల్లాలో అతి తక్కువగా 117 టైఫాయిడ్ కేసులు రాగా.. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 1,359 కేసులొచ్చాయి. ఈ ఏడాది చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 23,013 డయేరియా కేసులు నమోదు కాగా.. అత్యల్పంగా పశి్చమ గోదావరి జిల్లాలో 3,279 కేసులు మాత్రమే నమోదయ్యాయి. గతేడాది అత్యధికంగా 80,854 డయేరియా కేసులు తూర్పు గోదావరి జిల్లాలో నమోదు కాగా.. ఈ ఏడాది కేవలం 6,161 కేసులు మాత్రమే నమోదయ్యాయి. -
విజృంభిస్తున్న అతిసార
నవాబుపేట, న్యూస్‌లైన్: అతిసార మృత్యుఘంటికలు మోగిస్తూనే ఉంది. వట్టిమీనపల్లిని వణికిస్తూనే ఉంది. అతిసారతో ఎనిమిది రోజుల క్రితం గ్రామానికి చెందిన వృద్ధురాలు నల్లోల్ల అనంతమ్మ (70) మృతి చెందగా.. బుధవారం ఆమె భర్త లక్ష్మారెడ్డి (75)మరణించారు. గ్రామంలో పలువురు ఈ వ్యాధితో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వట్టిమీనపల్లిలో అతిసార విజృంభిస్తున్నా అధికారులకు మాత్రం ఏమీ పట్టడంలేదు. దీంతో గ్రామస్తులు భయాందోళనతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. మండంలంలోని వట్టిమీనపల్లిలో అతిసారతో నల్లొల్ల లక్ష్మారెడ్డి బుధవారం ఉదయం మృతి చెందారు. పదిహేను రోజులుగా గ్రామంలో 20 మందికిపైగా అతిసార సోకింది. వీరిలో అనంతమ్మ ఈ నెల 13న మృతి చెందింది. ఈమెతో పాటు ఆమె భర్త లక్ష్మారెడ్డికి కూడా అతిసార సోకింది. ఇన్ని రోజులుగా వ్యాధితో బాధపడుతున్న ఆయన బుధవారం మృతి చెందారు. ఒకే కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు అతిసారతో మృత్యువాత పడడంపై కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. గ్రామంలో అతిసార విజృంభించిందనే సమాచారంతో కొద్దిరోజుల క్రితం నవాబుపేట ఆస్పత్రి వైద్యులు వట్టిమీనపల్లిలో ఒక్కరోజు వైద్య శిబిరాన్ని నిర్వహించి వెళ్లిపోయారు. ఆ తర్వాత గ్రామం వైపు కన్నెత్తి చూడలేదు. కేవలం ఏఎన్ఎంలు వచ్చి మందులు ఇచ్చి వెళ్లారు. కానీ బాధితుల ఆరోగ్య కుదుటపడడంలేదు. గ్రామానికి చెందిన మాణిక్‌రెడ్డి, మల్లారెడ్డి, రాములు ప్రస్తుతం వికారాబాద్ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరికొందరు గ్రామంలోనే ఉంటూ ఆస్పత్రులకు వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారు. అధికారుల నిర్లక్ష్యమే.. వట్టిమీనపల్లిలో సుమారు 20 మంది అతిసారతో బాధపడుతుంటే కేవలం ఒక్క రోజు డాక్టర్లు వచ్చి మందులు ఇచ్చి వెళ్లి చేతులు దులుపుకొన్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతిసారతో మనుషులు చచ్చిపోతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని మండిపడుతున్నారు. వైద్యాధికారుల నిర్లక్ష్యం కారణంగానే గ్రామంలో అతిసార బాధితులు మృతి చెందుతున్నారని ఆందోళన వ్యక్త చేస్తున్నారు. గ్రామాన్ని సందర్శించిన జిల్లా అదనపు వైద్యాధికారి జిల్లా అదనపు వైద్యాధికారి నసీరుద్దీన్ బుధవారం నవాబుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. అనంతరం ఆయన వట్టిమీనపల్లిని సందర్శించారు. అతిసార బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. గ్రామంలో తక్షణమే వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 104, 108 వాహనాలను అందుబాటులో ఉంచుతామని చె ప్పారు. నవాబుపేట ఆస్పత్రి సిబ్బంది, డాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, మందులు లేవంటున్నారని, తమను పట్టించుకోవడంలేదని గ్రామస్తులు నసీరుద్దీన్‌ను నిలదీశారు. దీంతో ఆయన స్పందిస్తూ.. నిర్లక్ష్యం వహించే వైద్యులపై చర్యలు తీసుకుంటామని, గ్రామంలో ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు చేస్తామన్నారు. గ్రామంలో మందులు నిలువ ఉంచుతామన్నారు. ఆయన వెంట జిల్లా మలేరియా ఆఫీసర్ సంతోష్, స్థానిక వైద్యాధికారి ఆసీబ్ జహాన్, సిబ్బంది, రవిందర్, జంగయ్య తదితరులున్నారు. -
పరిగిలో ప్రబలిన అతిసార
అతిసార విజృంభిస్తోంది. పరిగి మండల పరిధిలోని పలు గ్రామాలను కుదిపేస్తున్న అతిసార సోమవారం మరో గ్రామానికి పాకింది. గోవిందాపూర్, చిగురాల్‌పల్లి గ్రామాల్లో ఇప్పటికే అతిసార బాధితులు ఉండగా కొత్తగా ఇబ్రహీంపూర్ తండాలో మరో నలుగురికి సోకింది. శని, ఆదివారాల్లో పరిగి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన అతిసార బాధితుల పరిస్థితి నిలకడగా ఉంది. సోమవారం ఆయా గ్రామాలకు చెందిన మరో 14 మంది అతిసారతో ఆస్పత్రిలో చేరారు. ఇప్పటికే పరిగి, నస్కల్, రూప్‌ఖాన్‌పేట్, చిగురాల్‌పల్లి, గోవిందాపూర్ గ్రామాల నుంచి 10 మంది రోగులు ప్రభుత్వ ఆస్పత్రిలో, మరో 10 మంది పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరారు. ఇబ్రహీంపూర్ తండాకు చెందిన నలుగురు సోమవారం ఆస్పత్రిలో చేరారు. వివరాలు సేకరించిన అధికారులు చిగురాల్‌పల్లి, గోవిందాపూర్ గ్రామాలను సోమవారం అధికారులు సందర్శించారు. అక్కడ అతిసారకు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. చిగురాల్‌పల్లి గ్రామాన్ని సందర్శించిన ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ జగదీశ్వర్‌రెడ్డి గ్రామంలో పరిస్థితులను పరిశీలించారు. పైపులైన్ లీకేజీలు ఉన్న చోట కొత్తగా పైపులైన్ వేయాలని స్థానిక అధికారులు, సర్పంచ్ సావిత్రమ్మలకు సూచించారు. అవసరమైతే ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు. ఎస్పీహెచ్ఓ దశరథ్, తహశీల్దార్ బాల్‌రాజ్, ఎంపీడీఓ విజయప్ప, ఆర్డబ్ల్యూఎస్ డీఈ నర్సింలు, ఏఈ జైపాల్‌రెడ్డి తదితరులు ఆయా గ్రామాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ట్యాంకు ద్వారా నీళ్లు సరఫరాను నిలిపివేశారు. దీంతో ప్రస్తుతం గ్రామస్తులు మినరల్ వాటర్ తాగుతున్నారు. మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి సోమవారం మండల పరిధిలోని చిగురాల్పల్లిని సందర్శించారు. అతిసారతో మృతిచెందిన చిన్నారి శివలీల కుటుంబీకులను ఆయన పరామర్శించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకుని గ్రామస్తులు, యువకులతో మాట్లాడారు. గ్రామస్తులకు అవగాహణ కల్పించాలని ఆయన అధికారులకు సూచించారు. గ్రామంలోని రోడ్ల బాగు కోసం రూ. 10 లక్షలు కేటాయిస్తానని ఎమ్మెల్యే గ్రామస్తులకు హామీ ఇచ్చారు. అతిసారకు కల్లే కారణమా? చిగురాల్‌పల్లి, గోవిందాపూర్, మిట్టకోడూర్ గ్రామాల్లో ఆయా శాఖల అధికారులు సందర్శించి అతిసార ప్రబలటానికి కారణాలను తెలుసుకున్నారు. గ్రామస్తులతో మాట్లాడి ఓ అంచనాకు వచ్చారు. మండల పరిషత్, ఆర్‌డబ్య్లూఎస్, ఆరోగ్య శాఖల పనితీరు బాగానే ఉన్నప్పటికీ ఆ మూడు గ్రామాల్లో ప్రజలు కల్లు తాగటం వల్లే అతిసార ప్రబలినట్లు అధికారులు నిర్ధారించారు. మిట్టకోడూర్‌లో తయారవుతున్న కల్లు మిగతా రెండు గ్రామాలకు సరఫరా అవుతోందని కల్తీ కల్లుతోనే ప్రజలకు అతిసార సోకిందని అధికారులు పేర్కొంటున్నారు. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డికి వివరించగా సదరు కల్లు దుకాణాన్ని మూసివేయాలని అధికారులకు సూచించారు.