నవాబుపేట, న్యూస్‌లైన్: అతిసార మృత్యుఘంటికలు మోగిస్తూనే ఉంది. వట్టిమీనపల్లిని వణికిస్తూనే ఉంది. అతిసారతో ఎనిమిది రోజుల క్రితం గ్రామానికి చెందిన వృద్ధురాలు నల్లోల్ల అనంతమ్మ (70) మృతి చెందగా.. బుధవారం ఆమె భర్త లక్ష్మారెడ్డి (75)మరణించారు. గ్రామంలో పలువురు ఈ వ్యాధితో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వట్టిమీనపల్లిలో అతిసార విజృంభిస్తున్నా అధికారులకు మాత్రం ఏమీ పట్టడంలేదు. దీంతో గ్రామస్తులు భయాందోళనతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. మండంలంలోని వట్టిమీనపల్లిలో అతిసారతో నల్లొల్ల లక్ష్మారెడ్డి బుధవారం ఉదయం మృతి చెందారు.
పదిహేను రోజులుగా గ్రామంలో 20 మందికిపైగా అతిసార సోకింది. వీరిలో అనంతమ్మ ఈ నెల 13న మృతి చెందింది. ఈమెతో పాటు ఆమె భర్త లక్ష్మారెడ్డికి కూడా అతిసార సోకింది. ఇన్ని రోజులుగా వ్యాధితో బాధపడుతున్న ఆయన బుధవారం మృతి చెందారు. ఒకే కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు అతిసారతో మృత్యువాత పడడంపై కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. గ్రామంలో అతిసార విజృంభించిందనే సమాచారంతో కొద్దిరోజుల క్రితం నవాబుపేట ఆస్పత్రి వైద్యులు వట్టిమీనపల్లిలో ఒక్కరోజు వైద్య శిబిరాన్ని నిర్వహించి వెళ్లిపోయారు. ఆ తర్వాత గ్రామం వైపు కన్నెత్తి చూడలేదు. కేవలం ఏఎన్‌ఎంలు వచ్చి మందులు ఇచ్చి వెళ్లారు. కానీ బాధితుల ఆరోగ్య కుదుటపడడంలేదు. గ్రామానికి చెందిన మాణిక్‌రెడ్డి, మల్లారెడ్డి, రాములు ప్రస్తుతం వికారాబాద్ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరికొందరు గ్రామంలోనే ఉంటూ ఆస్పత్రులకు వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారు.
అధికారుల నిర్లక్ష్యమే..
వట్టిమీనపల్లిలో సుమారు 20 మంది అతిసారతో బాధపడుతుంటే కేవలం ఒక్క రోజు డాక్టర్లు వచ్చి మందులు ఇచ్చి వెళ్లి చేతులు దులుపుకొన్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతిసారతో మనుషులు చచ్చిపోతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని మండిపడుతున్నారు. వైద్యాధికారుల నిర్లక్ష్యం కారణంగానే గ్రామంలో అతిసార బాధితులు మృతి చెందుతున్నారని ఆందోళన వ్యక్త చేస్తున్నారు.
గ్రామాన్ని సందర్శించిన జిల్లా అదనపు వైద్యాధికారి
జిల్లా అదనపు వైద్యాధికారి నసీరుద్దీన్ బుధవారం నవాబుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. అనంతరం ఆయన వట్టిమీనపల్లిని సందర్శించారు. అతిసార బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. గ్రామంలో తక్షణమే వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 104, 108 వాహనాలను అందుబాటులో ఉంచుతామని చె ప్పారు. నవాబుపేట ఆస్పత్రి సిబ్బంది, డాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, మందులు లేవంటున్నారని, తమను పట్టించుకోవడంలేదని గ్రామస్తులు నసీరుద్దీన్‌ను నిలదీశారు. దీంతో ఆయన స్పందిస్తూ.. నిర్లక్ష్యం వహించే వైద్యులపై చర్యలు తీసుకుంటామని, గ్రామంలో ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు చేస్తామన్నారు. గ్రామంలో మందులు నిలువ ఉంచుతామన్నారు. ఆయన వెంట జిల్లా మలేరియా ఆఫీసర్ సంతోష్, స్థానిక వైద్యాధికారి ఆసీబ్ జహాన్, సిబ్బంది, రవిందర్, జంగయ్య తదితరులున్నారు.
విజృంభిస్తున్న అతిసార
Published Thu, Aug 22 2013 1:16 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement
Advertisement