
ప్రజల ముంగిటికే న్యాయం
- మొబైల్ లోక్ అదాలత్‌ల ఏర్పాటు: హైకోర్టు సీజే
- పేదరికంవల్ల న్యాయానికి దూరం కావొద్దు
- గ్రామ పంచాయతీ, పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు ఇవ్వొచ్చు
- పోస్టు ద్వారా కూడా జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీకి పంపవచ్చు
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు ఉచితంగా, సత్వర న్యాయం అందించాలనే లక్ష్యంతో, ప్రజల ముంగిటికే న్యాయాన్ని తీసుకెళ్లాలనే ధ్యేయంతో మొబైల్ లోక్‌అదాలత్‌ను ప్రవేశపెడుతున్నామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా తెలిపారు. దేశంలోనే మొదటిసారిగా ఈ తరహా విధానాన్ని తెలంగాణలో ప్రవేశపెడుతున్నామని ఆయన చెప్పారు.
బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ న్యాయసేవాధికార సంస్థ ప్రధాన కార్యాల యంలో జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా విలేకరులతో మాట్లాడారు. పేదరికం కారణంగా అనేక మంది ప్రజలు జిల్లా కేంద్రంలోని న్యాయ సేవాధికార సంస్థ (లీగల్ సర్వీస్ అథారిటీ)లను ఆశ్రయించలేకపోతున్నారని... దాంతో వారికి న్యాయం అందడం లేదని ఆయన పేర్కొన్నారు.
రూ. రెండు వేలు వెచ్చించి కొన్న మొబైల్ ఫోన్ పనిచేయకపోయినా సంబంధిత సంస్థపై ఫిర్యాదు చేసేం దుకు జిల్లా కేంద్రంలోని వినియోగదారుల ఫోరానికి వెళ్లా ల్సి వస్తోందని... ఇది ఖర్చుతో కూడుకున్నది కావడంతో ప్రజలు ఫిర్యాదు చేయడం లేదని సీజే అన్నారు. సివిల్, క్రిమినల్, వినియోగదారుల వివాదం సహా ఏ ఫిర్యాదునైనా తెల్లకాగితం మీద రాసి గ్రామ పంచాయతీ లేదా స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఇవ్వవచ్చని చెప్పారు. అందులో లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించగల ఫిర్యాదులను గ్రామ పంచాయతీ లేదా పోలీసులు లీగల్ సర్వీస్ అథారిటీకి పంపుతారని తెలిపారు.
లేదా పోస్టు ద్వారా కూడా బాధితులు నేరుగా జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీకి ఫిర్యాదులు పంపవచ్చన్నారు. పేదరికం కారణంగా ప్రజలు న్యాయానికి దూరం కాకూడదనే లక్ష్యంతో మొబైల్ లోక్ అదాలత్‌ను ఏర్పాటు చేస్తున్నామని జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా తెలిపారు. 100 ఫిర్యాదులు వచ్చిన వెంటనే జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన మొబైల్ బృందం సంబంధిత ప్రాంతానికి చేరుకుంటుందని... ఇరువర్గాల వాదనలు విని అక్కడిక్కడే తీర్పులు ఇస్తారని వెల్లడించారు.
ఈ తీర్పులకు అప్పీల్ కూడా ఉండదని, మొబైల్ కోర్టు ఇచ్చిన తీర్పే తుది తీర్పు అని స్పష్టం చేశారు. గ్రామస్థాయి వివాదాలు కోర్టుల దాకా వస్తే కక్షలు, కార్పణ్యాలు పెరిగే అవకాశం ఉందని... ఈ నేపథ్యంలో ప్రజల దగ్గరకే న్యాయాన్ని తీసుకెళుతున్నామని లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ జస్టిస్ ఖండవల్లి చంద్రభాను తెలిపారు.
ఖర్చు లేకుండా ప్రజలు తమ సొంత గ్రామాల్లోనే న్యాయం పొందవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పశ్చిమబెంగాల్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఈ తరహా లోక్‌అదాలత్‌లు విజయవంతమయ్యాయని అథారిటీ సభ్య కార్యదర్శి శ్యాంప్రసాద్ తెలిపారు.