ఎన్నికలు నిర్వహించకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనే | Of an unconstitutional violation of election | Sakshi
Sakshi News home page

ఎన్నికలు నిర్వహించకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనే

Published Tue, Feb 17 2015 2:34 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

Of an unconstitutional violation of election

  • పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలి
  • ఎన్నికల షెడ్యూల్‌ను కూడా కోర్టు ముందుంచాలి
  • టీ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం
  • విచారణ వచ్చే వారానికి వాయిదా
  • సాక్షి, హైదరాబాద్: కాల పరిమితి ముగిసిన సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోవడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. కాలపరిమితి ముగిసినా గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)కు ఇప్పటి వరకు ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని ఎలా సమర్ధించుకుంటారో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

    ఇందుకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని, అదే విధంగా ఎన్నికల షెడ్యూల్‌ను సైతం కోర్టు ముం దుంచాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. జీహెచ్‌ఎంసీకి ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించడంతోపాటు స్పెషల్ ఆఫీసర్ల నియామకానికి అవకాశం కల్పిస్తున్న జీహెచ్‌ఎంసీ చట్టంలోని సెక్షన్ 70జి చట్ట విరుద్ధంగా ప్రకటించాలంటూ ‘ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్’ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి హైకోర్టులో ఇటీవల ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే.

    ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన ప్రధాన న్యాయమూర్తి కల్యాన్‌జ్యోతిసేన్‌గుప్తా నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం దానిని మరోసారి విచారించింది. కేసు విచారణకు రాగానే ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది బి.మహేందర్‌రెడ్డి లేచి, అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఢిల్లీ వెళ్లారని, కోర్టు ఆదేశించిన విధంగా ఎన్నికల షెడ్యూల్ ఇచ్చేందుకు విచారణను వచ్చే వారానికి వాయిదా వేయాలని కోరారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ కాల పరిమితి ముగిసిన సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని, కాల పరిమితి ముగిసిన జీహెచ్‌ఎంసీకి ఇప్పటి వరకు ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని ఎలా సమర్ధించుకుంటారని ప్రశ్నించింది.

    జీహెచ్‌ఎంసీకి ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఎప్పుడు నిర్వహించే విషయంలో షెడ్యూల్‌ను కోర్టు ముందుంచుతామని మహేందర్‌రెడ్డి కోర్టుకు నివేదించారు. ఈ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయమంటారా..? అని ధర్మాసనం ఈ సందర్భంగా ప్రశ్నించడంతో, రికార్డ్ చేయవచ్చునని మహేందర్‌రెడ్డి తెలిపారు.

    ఈ సమయంలో పిటిషనర్ తరఫు న్యాయవాది శివరాజు శ్రీనివాస్ జోక్యం చేసుకుంటూ, 2014, డిసెంబర్ 3తో జీహెచ్‌ఎంసీ పాలక మండలి కాల వ్యవధి ముగిసిందని, దీనికి ఒక రోజు ముందు పాలక వర్గం స్థానంలో స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తూ ప్రభుత్వం జీవో 186 జారీ చేసిందని తెలిపారు. స్పెషల్ ఆఫీసర్ల కాల వ్యవధి ఈ ఏడాది మేతో ముగియనున్నదని, ఆ లోపు ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, ఎన్నికల షెడ్యూల్‌ను చూసిన తరువాతనే ఏమైనా చెప్పగలమని, అంత వరకు  మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement