Kalyan JyotiSen gupta
-
ఎన్నికలు నిర్వహించకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనే
పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలి ఎన్నికల షెడ్యూల్‌ను కూడా కోర్టు ముందుంచాలి టీ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం విచారణ వచ్చే వారానికి వాయిదా సాక్షి, హైదరాబాద్: కాల పరిమితి ముగిసిన సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోవడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. కాలపరిమితి ముగిసినా గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)కు ఇప్పటి వరకు ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని ఎలా సమర్ధించుకుంటారో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని, అదే విధంగా ఎన్నికల షెడ్యూల్‌ను సైతం కోర్టు ముం దుంచాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. జీహెచ్ఎంసీకి ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించడంతోపాటు స్పెషల్ ఆఫీసర్ల నియామకానికి అవకాశం కల్పిస్తున్న జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 70జి చట్ట విరుద్ధంగా ప్రకటించాలంటూ ‘ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్’ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి హైకోర్టులో ఇటీవల ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన ప్రధాన న్యాయమూర్తి కల్యాన్జ్యోతిసేన్గుప్తా నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం దానిని మరోసారి విచారించింది. కేసు విచారణకు రాగానే ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది బి.మహేందర్‌రెడ్డి లేచి, అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఢిల్లీ వెళ్లారని, కోర్టు ఆదేశించిన విధంగా ఎన్నికల షెడ్యూల్ ఇచ్చేందుకు విచారణను వచ్చే వారానికి వాయిదా వేయాలని కోరారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ కాల పరిమితి ముగిసిన సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని, కాల పరిమితి ముగిసిన జీహెచ్ఎంసీకి ఇప్పటి వరకు ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని ఎలా సమర్ధించుకుంటారని ప్రశ్నించింది. జీహెచ్ఎంసీకి ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఎప్పుడు నిర్వహించే విషయంలో షెడ్యూల్‌ను కోర్టు ముందుంచుతామని మహేందర్‌రెడ్డి కోర్టుకు నివేదించారు. ఈ స్టేట్మెంట్ను రికార్డ్ చేయమంటారా..? అని ధర్మాసనం ఈ సందర్భంగా ప్రశ్నించడంతో, రికార్డ్ చేయవచ్చునని మహేందర్‌రెడ్డి తెలిపారు. ఈ సమయంలో పిటిషనర్ తరఫు న్యాయవాది శివరాజు శ్రీనివాస్ జోక్యం చేసుకుంటూ, 2014, డిసెంబర్ 3తో జీహెచ్ఎంసీ పాలక మండలి కాల వ్యవధి ముగిసిందని, దీనికి ఒక రోజు ముందు పాలక వర్గం స్థానంలో స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తూ ప్రభుత్వం జీవో 186 జారీ చేసిందని తెలిపారు. స్పెషల్ ఆఫీసర్ల కాల వ్యవధి ఈ ఏడాది మేతో ముగియనున్నదని, ఆ లోపు ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, ఎన్నికల షెడ్యూల్‌ను చూసిన తరువాతనే ఏమైనా చెప్పగలమని, అంత వరకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. -
ప్రజల ముంగిటికే న్యాయం
మొబైల్ లోక్ అదాలత్‌ల ఏర్పాటు: హైకోర్టు సీజే పేదరికంవల్ల న్యాయానికి దూరం కావొద్దు గ్రామ పంచాయతీ, పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు ఇవ్వొచ్చు పోస్టు ద్వారా కూడా జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీకి పంపవచ్చు సాక్షి, హైదరాబాద్: ప్రజలకు ఉచితంగా, సత్వర న్యాయం అందించాలనే లక్ష్యంతో, ప్రజల ముంగిటికే న్యాయాన్ని తీసుకెళ్లాలనే ధ్యేయంతో మొబైల్ లోక్‌అదాలత్‌ను ప్రవేశపెడుతున్నామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా తెలిపారు. దేశంలోనే మొదటిసారిగా ఈ తరహా విధానాన్ని తెలంగాణలో ప్రవేశపెడుతున్నామని ఆయన చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ న్యాయసేవాధికార సంస్థ ప్రధాన కార్యాల యంలో జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా విలేకరులతో మాట్లాడారు. పేదరికం కారణంగా అనేక మంది ప్రజలు జిల్లా కేంద్రంలోని న్యాయ సేవాధికార సంస్థ (లీగల్ సర్వీస్ అథారిటీ)లను ఆశ్రయించలేకపోతున్నారని... దాంతో వారికి న్యాయం అందడం లేదని ఆయన పేర్కొన్నారు. రూ. రెండు వేలు వెచ్చించి కొన్న మొబైల్ ఫోన్ పనిచేయకపోయినా సంబంధిత సంస్థపై ఫిర్యాదు చేసేం దుకు జిల్లా కేంద్రంలోని వినియోగదారుల ఫోరానికి వెళ్లా ల్సి వస్తోందని... ఇది ఖర్చుతో కూడుకున్నది కావడంతో ప్రజలు ఫిర్యాదు చేయడం లేదని సీజే అన్నారు. సివిల్, క్రిమినల్, వినియోగదారుల వివాదం సహా ఏ ఫిర్యాదునైనా తెల్లకాగితం మీద రాసి గ్రామ పంచాయతీ లేదా స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఇవ్వవచ్చని చెప్పారు. అందులో లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించగల ఫిర్యాదులను గ్రామ పంచాయతీ లేదా పోలీసులు లీగల్ సర్వీస్ అథారిటీకి పంపుతారని తెలిపారు. లేదా పోస్టు ద్వారా కూడా బాధితులు నేరుగా జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీకి ఫిర్యాదులు పంపవచ్చన్నారు. పేదరికం కారణంగా ప్రజలు న్యాయానికి దూరం కాకూడదనే లక్ష్యంతో మొబైల్ లోక్ అదాలత్‌ను ఏర్పాటు చేస్తున్నామని జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా తెలిపారు. 100 ఫిర్యాదులు వచ్చిన వెంటనే జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన మొబైల్ బృందం సంబంధిత ప్రాంతానికి చేరుకుంటుందని... ఇరువర్గాల వాదనలు విని అక్కడిక్కడే తీర్పులు ఇస్తారని వెల్లడించారు. ఈ తీర్పులకు అప్పీల్ కూడా ఉండదని, మొబైల్ కోర్టు ఇచ్చిన తీర్పే తుది తీర్పు అని స్పష్టం చేశారు. గ్రామస్థాయి వివాదాలు కోర్టుల దాకా వస్తే కక్షలు, కార్పణ్యాలు పెరిగే అవకాశం ఉందని... ఈ నేపథ్యంలో ప్రజల దగ్గరకే న్యాయాన్ని తీసుకెళుతున్నామని లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ జస్టిస్ ఖండవల్లి చంద్రభాను తెలిపారు. ఖర్చు లేకుండా ప్రజలు తమ సొంత గ్రామాల్లోనే న్యాయం పొందవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పశ్చిమబెంగాల్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఈ తరహా లోక్‌అదాలత్‌లు విజయవంతమయ్యాయని అథారిటీ సభ్య కార్యదర్శి శ్యాంప్రసాద్ తెలిపారు.