
గ్రేట్ ఎన్నికలకు సై
ఆరు నెలల్లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు?
హైకోర్టు తీర్పుతో అధికారుల్లో కదలిక
సిద్ధమవుతున్న పార్టీలు
స్పష్టత కోసం యంత్రాంగం ఎదురు చూపులు
సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీలో గ్రేట్ ఫైట్‌కు తెర లేవనుందా? పాలక మండలి ఎన్నికల దిశగా అడుగులు పడబోతున్నాయా? ఎన్నికల నిర్వహణలో జాప్యంపై ‘ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్’ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై స్పందించిన హైకోర్టు... ఈ తాత్సారాన్ని తప్పు పడుతూ.. ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారో వారం రోజుల్లోగా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించడంతో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటు పార్టీల్లోనూ...అటు అధికారుల్లోనూ ఇది చర్చనీయాంశంగా మారింది. ఇదే జరిగితే ఏం చేయాలనే దానిపై పార్టీలు ఆలోచనలో పడ్డాయి. మరోవైపు ఎన్ని రోజుల్లో ఎన్నికలు నిర్వహించవచ్చు? ఆలోగా చేయాల్సిన కార్యక్రమాలు.. పాటించాల్సిన విధి విధానాలపై జీహెచ్‌ఎంసీ అధికారులు తర్జనభర్జనలు పడుతున్నారు. నిర్ణీత సమయంలో ఎన్నికలు నిర్వహించకపోవడంతో పాలక మండలి గడువు ముగిసినప్పటి నుంచి స్పెషలాఫీసర్ పాలన అమల్లోకి తెచ్చారు. ఇది ఆరు నెలలు ఉండవచ్చు. గత డిసెంబర్ 4 నుంచి జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ నుప్రభుత్వం స్పెషలాఫీసర్‌గా నియమించింది. మరో నాలుగు నెలల వరకు స్పెషలాఫీసర్ పాలనకు అవకాశం ఉంది. ఇదే సందర్భంలో మరో అంశం తెరపైకి వచ్చింది. ఆర్నెళ్లకోమారు చొప్పున పొడిగింపునిస్తూ 11 ఏళ్ల వరకు ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని కొందరు ప్రస్తావిస్తున్నారు.
1991లో అప్పటి ఎంసీహెచ్ పాలకమండలి పదవీ కాలం ముగిశాక తిరిగి 2002 వరకు ఎన్నికలు నిర్వహించని విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇందుకు అవకాశం కల్పించిన రాజ్యాంగ నిబంధనలను సవరించాల్సిందిగా పిటిషనర్ కోరినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అనివార్య కారణాలతో పాలక మండలి పడిపోతే... తిరిగి ఎన్నికలు జరిగే వరకు మాత్రమే స్పెషలాఫీసర్ పాలన ఉండాలని... ఆర్నెళ్లలోపునే ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాలని నిపుణులు చెబుతున్నారు. గతంలో అహ్మదాబాద్‌లో గడువులోగా ఎన్నికలు నిర్వహించాల్సిందిగా సుప్రీంకోర్టు తీర్పునివ్వడాన్ని గుర్తు చేస్తున్నారు. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటే... నాలుగు నెలల్లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కానీ, అంతకంటే ముందుగానే డివిజన్ల విభజన పూర్తి చేయాలని హైకోర్టు గత ఆగస్టులో మరో కేసులో తీర్పునిచ్చింది. ఇంతవరకు విభజన ప్రక్రియ ప్రారంభం కాలేదు. దీని విధి విధానాల కోసం ప్రభుత్వానికి లేఖ రాసిన జీహెచ్‌ఎంసీ అధికారులు వాటి కోసం ఎదురు చూస్తున్నారు. ఈ విధి విధానాలు అందిన వెంటనే విభజన ప్రక్రియ ప్రారంభించినా ఎన్నికల నిర్వహణకు కనీసం 188 రోజులు పడుతుందని నిపుణుల అభిప్రాయం. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉన్నందున... బీసీ గణన అంశాన్నీ పరిగణనలకి తీసుకోవలసి ఉంటుంది. ఆ లెక్కన ఎన్నికలకు సమయం పడుతుందని అంటున్నారు.
వీటిని మరింత త్వరితంగా పూర్తి చేస్తే 100 నుంచి 120 రోజుల్లో చే సే అవకాశం ఉందని ఎన్నికల నిర్వహణలో అనుభవమున్న సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ లెక్కన నాలుగు నుంచి ఆరు నెలల్లో జీహెచ్‌ఎంసీ పాలక మండలి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. తగిన కారణాలు చూపుతూ విభజించకుండానే ఎన్నికలు నిర్వహించేందుకు వీలుందని ఆయన చెప్పారు. గతంలో కర్ణాటకలో అలా జరిగిందని గుర్తు చేశారు. ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించే కౌంటర్ పిటిషన్‌లో దీనిపై స్పష్టత రానుంది.
రెండు కార్పొరేషన్లు చేస్తారా?
ఇదిలా ఉండగా జీహెచ్‌ఎంసీని ఢిల్లీ, ముంబైల తరహాలో రెండు లేదా మూడు కార్పొరేషన్లుగా విభజించాలనే అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో వ్యక్తం చేయడం తెలిసిందే. ఎన్నికల లోపునే ఇది పూర్తవుతుందా? లేదా అనేది హాట్‌టాపిక్‌గా మారింది. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో తమ జెండాను ఎగురవేయాలనే కృతనిశ్చయంతో ఉన్న టీఆర్‌ఎస్.. రెండు కార్పొరేషన్ల వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శివారు ప్రాంతాల్లో టీడీపీ బలంగా ఉండటం.. కేంద్రంలోని అధికార బీజేపీతో పొత్తు.. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లోనూ మైత్రి కొనసాగుతుందని ఆ రెండు పార్టీలు ప్రకటించిన నేపథ్యంలో రెండు కార్పొరేషన్లకు ప్రభుత్వం మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఇలా జరిగితే ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న వార్డులతో పాటు ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్) పరిధిలోని కొన్ని గ్రామాలను కలుపుకొని రెండు కార్పొరేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. వీటికి హైదరాబాద్ కార్పొరేషన్, సికింద్రాబాద్ కార్పొరేషన్‌లుగా పేర్లు పెడతారా? లేక ఇతరత్రా పేర్లు పెడతారా అన్నదానిపై స్పష్టత లేదు.
ఎన్నికలు నిర్వహించాలనుకుంటే...
అంశం పట్టే సమయం విభజన ప్రకటన, సూచనలు, అభ్యంతరాల స్వీకరణ, అంతిమ జాబితా తయారీ : 78 రోజులు
బీసీ జన గణన, వార్డుల రిజర్వేషన్లు, ఇతరత్రా అంశాలు : 80 రోజులు
పోలింగ్ కేంద్రాల ఏర్పాటు పూర్తి.. ఎన్నికల నోటిఫికేషన్ : 30 రోజులు