
ఎన్నికల నిర్వహణపై జోక్యం చేసుకోవాలి
♦ హైకోర్టుకు చాడ విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల తేదీలు, నిర్వహణపై జోక్యం చేసుకోవాలని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు సక్రమంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగేలా చూడాలని కోరారు. బుధవారం మఖ్దూం భవన్‌లో పార్టీ నాయకులు అజీజ్ పాషా, వీఎస్ బోస్, సుధాకర్, ఈటీ నర్సింహా, బాల మల్లేశ్, మందా పవన్‌తో కలసి ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు అధికార టీఆర్‌ఎస్ తప్పుడు పద్ధతులు అవలంబిస్తోందని విమర్శించారు. ఇతర పార్టీల అభ్యర్థులను ప్రలోభాలకు గురిచేసి పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. నీతిమంతమైన రాజకీయాలు కోసం సీపీఎం, సీపీఐ, లోక్‌సత్తా తదితర సామాజిక శక్తులతో కలసి పోటీ చేస్తామన్నారు.