పురపాలనలోకి శంషాబాద్‌ | Shamshabad Entry in Municipality | Sakshi
Sakshi News home page

పురపాలనలోకి శంషాబాద్‌

Published Mon, Apr 22 2019 8:26 AM | Last Updated on Mon, Apr 22 2019 8:26 AM

Shamshabad Entry in Municipality - Sakshi

శంషాబాద్‌ పట్టణం

శంషాబాద్‌: అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుతో ప్రపంచపటంలో చోటు సంపాదించుకున్న శంషాబాద్‌ మేజర్‌ గ్రామపంచాయతీ ఆదివారం నుంచి పురపాలనలోకి అడుగులు పెట్టింది. అరవై ఏళ్ల గ్రామీణ పాలన శనివారంతో ముగిసింది. 1959 అక్టోబరు 29 శంషాబాద్‌ మేజర్‌ గ్రామ పంచాయతీ పాలన ప్రారంభమై 2019 ఏప్రిల్‌ 20 నాటికి ముగిసింది. అరవై ఏళ్ల వ్యవధిలో మొత్తం 8 మంది సర్పంచ్‌లుగా పనిచేశారు. ఇందులో మామిడి దయానంద్‌రెడ్డి 1970 నుంచి 1988 వరకు రికార్డు స్థాయిలో సర్పంచ్‌గా పనిచేశారు. ఆ తర్వాత కూడా మరో దఫా 1995 నుంచి 2001 వరకు ఐదేళ్ల పాటు శంషాబాద్‌ సర్పంచ్‌గా పనిచేశారు.

అందరోని అబాదీగా..
శంషాబాద్‌ గ్రామాన్ని నిజాం పాలనలో అందరోని అబాదీగా పిలిచేవారని పూర్వీకులు చెబుతుంటారు. గ్రామానికి నాలుగు వైపులా గౌనీలు (పెద్ద ఎత్తున దర్వాజాలు) ఉండి చుట్టూ పెద్ద ప్రహరీ గోడ ఉండేది. ఆ తర్వాత నిజాం బంధువులైన శంషాద్‌బేగం పేరిట దీనిని శంషాబాద్‌గా మార్చినట్లు చరిత్ర చెబుతోంది.

చారిత్రక కట్టాడాలకు నెలవు
శంషాబాద్‌ చారిత్ర కట్టడాలకు నెలవైన ప్రాంతం. శంషాబాద్‌ పాత గ్రామంలో పాత పోలీస్‌స్టేషకు సుమారు వందేళ్లకు పైగా చరిత్ర ఉంది. ఈ కట్టడానికి ఇప్పటికే ‘హెరిటేజ్‌’ గుర్తింపు కూడా దక్కింది. నేటికీ ఠాణాగా ఈ భవనం సేవలందిస్తోంది. పాలరాతి కొండపై వెలిసిన చోళరాజుల కాలం నాటి సిద్దులగుట్ట దేవాయలం ఎంతో ప్రసిద్ధి చెందింది. సంతానం కోసం ఇక్కడ మొక్కుకుంటే సంతానం కలుగుతుందని నమ్మకం. ఇక్కడ మొక్కుకున్న వారికి సంతానం కలిగితే పిల్లలకు సిద్దప్ప, సిద్దులు, సిద్దేశ్వర్‌ నామకరణ చేస్తూ ఉంటారు. శంషాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాలో ఈ పేర్లతో వందల సంఖ్యల్లో ఉంటారు. శంషాబాద్‌ మొదటి సర్పంచ్‌ సిద్దప్ప అయితే.. చివరి సర్పంచ్‌ సిద్దేశ్వర్‌ కావడం కూడా ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక ఆలయానికి సమీపంలో ఉన్న వేట బంగళా కూడా నేటికీ రాజదర్పాని ఒలకబోస్తోంది. దీంతో పాటు శంషాబాద్‌ (ఉందానగర్‌) రైల్వేస్టేషన్‌ పాతభవనం కూడా ఎంతో చారిత్రాత్మకమైనది. దీంతో దశాబ్దాలకాలంగా శంషాబాద్‌ ప్రజలకు వైద్యసేవలందించిన పాత బంగళా కూడా నాడు ‘ముసాఫిర్‌ ఖానా’ ప్రయాణికుల విడిది కేంద్రంగా కొనసాగిందని చరిత్రలో ఉంది. ఇలా ఎన్నో చరిత్రలకు శంషాబాద్‌ వేదికగా మారింది.  

మినీభారత్‌గా...
శంషాబాద్‌కు పారిశ్రామిక వాడతో పాటు 2008 మార్చి 23 నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు ప్రారంభం కావడంతో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు  ఇక్క జీవనం సాగిస్తున్నారు. సమీపంలో పారిశ్రామిక వాడ సైతం ఉడడంతో శంషాబాద్‌ జనాభా గత పదేళ్లలో భారీగా పెరిగింది. శంషాబాద్‌ పట్టణంతో పాటు ప్రస్తుత మున్సిపాలిటీ పరిధిలోని అన్ని గ్రామాలు కలుపుకుని సుమారు యాభైవేలకు పైగా జనాభా ఉంది. దీనికి తోడు వాణిజ్య, వ్యాపారా కేంద్రాలతో నిత్యం రాకపోకలు సాగించే వారు వేలల్లో ఉంటారు.

నిబంధనలు తూచ్‌..
చారిత్రాత్మకమైనన శంషాబాద్‌లో అక్రమ కట్టడాలు ఎక్కువగానే వెలస్తున్నాయి. 111 జీవో నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమార్కులు వందల సంఖ్యలో భారీ నిర్మాణాలను చేపట్టారు. పట్టణంలోని ఫిరంగి నాలాను మురుగుకాల్వలా మార్చారు. ఫిరంగినాలాను ఆక్రమంచి నిర్మాణాలు చేపట్టినా పట్టించుకునే వారే లేకుండా పోయారు. దీంతో ఇక్కడ ఫిరంగి నాలా ఉనికి ప్రశ్నార్థంకగా మారుతోంది. యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపట్టడం వాటికి కావాల్సిన నీటి వసతి కోసం విచ్చలవిడిగా బోర్లు వేయడం ఇక్కడ పరిపాటిగా మారింది. రహదారులపై కూడా బోర్లు వేసే దారుణ పరిస్థితులు శంషాబాద్‌లో నిత్యకత్యంగా మారుతున్నాయి. కొత్త పాలనలోకి అడుగులు పెట్టిన సందర్భంగానైనా అడ్డుకట్టపడుతుందా.. అందుకు అనుగుణంగా అధికార వ్యవస్థ పనిచేస్తుందా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

తొలి కమిషనర్‌గా..  
శంషాబాద్‌ మేజర్‌ గ్రామ పంచాయతీతో పాటు గొల్లపల్లి, తొండుపల్లి, ఊట్‌పల్లి, సాతంరాయి కొత్వాల్‌గూడతో కలిపిన శంషాబాద్‌ మున్సిపాలిటీకి తొలి కమిషనర్‌గా చాముండేశ్వరీ నియమితులయ్యారు. ఇప్పటికే ఆమె మున్సిపాలిటీలో భాగమైన గొల్లపల్లి, తొండుపల్లి, ఊట్‌పల్లిలో పురపాలనను ప్రారభించారు. పౌరుల భాగస్వామ్యంతో ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తొలి కమిషనర్‌ అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement