పంచాయతీలే పవర్‌ఫుల్
♦ కేరళలో పటిష్టంగా పంచాయతీరాజ్ వ్యవస్థ
♦ గ్రామ, బ్లాక్, జిల్లా పంచాయతీలుగా స్థానిక సంస్థలు
♦ అధ్యయనానికి రాష్ట్రం నుంచి కేరళ బాట పట్టిన ప్రజాప్రతినిధులు
సాక్షి, హైదరాబాద్: అక్కడ ప్రభుత్వమంటే పంచాయతీలే. అభివృద్ధి ప్రణాళికల నుంచి వాటి అమలు వరకు వాటిదే కీలక పాత్ర! కీలక అధికారాలు క్షేత్రస్థాయిలో పనిచేసే పంచాయతీల చేతిలోనే ఉండటంతో అభివృద్ధి పరుగులు పెడుతోంది. కేరళలోని పంచాయతీరాజ్ వ్యవ స్థ అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఆ రాష్ట్రంలోని పంచాయతీరాజ్ వ్యవస్థపై అధ్యయనానికి తెలంగాణ సర్కారు రాష్ట్రం నుంచి జిల్లాల వారీగా కేరళలోని ‘కిలా(కేరళ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లోకల్ అడ్మినిస్ట్రేషన్)’కు పంపుతోంది.ఇటీవల కరీంనగర్ జిల్లాపరిషత్ చైర్మన్ తులా ఉమ ఆధ్వర్యంలో ఆ జిల్లా జెడ్పీటీసీలు, సర్పంచులు కేరళలోని పాలక్కడ్, త్రిశూర్ జిల్లా పంచాయతీలు, వల్లచిర్ల, మడకతర గ్రామపంచాయతీలను సందర్శించారు. అవినీ తికి దూరంగా అధికార యంత్రాంగం పనిచేస్తుండటం, అంటరానితనాన్ని, కుల వివక్షను సంపూర్ణంగా నిర్మూలించగలగడం, ప్రజాప్రతినిధులంతా జవాబుదారీతనం కలిగి ఉండడమే ‘కేరళ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ’ అని అంటున్నారు ‘కిలా’ ఆచార్యులు. ఇతర దేశాల నుంచి కూడా అధికారులు ‘కిలా’లో శిక్షణకు వస్తుండటం విశేషం.
అన్నీ ప్రెసిడెంటే...
మన దగ్గర పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్‌లు ఉండగా, ఆ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ, బ్లాక్ పంచాయతీ, జిల్లా పంచాయతీలని పిలుస్తారు. అయితే.. ఆయా పంచాయతీలనే స్థానిక ప్రభుత్వాలుగా అక్కడి ప్రజలు భావిస్తారు. ఎందుకంటే.. ఆ పంచాయతీల పరిధిలో చేపట్టే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లోనూ స్థానికేతరుల జోక్యం ఉండదు. గ్రామస్థాయిలో పంచాయతీలకు సంపూర్ణ అధికారాలను అక్కడి ప్రభుత్వం కట్టబెట్టింది. పంచాయతీల పరిధిలో పనిచేసే ప్రభుత్వ శాఖల సిబ్బంది కూడా స్థానిక పంచాయతీ ప్రెసిడెంట్ల నియంత్రణలోనే ఉంటారు. అభివృద్ధి పనుల్లో నాణ ్యతకు, నిధుల వినియోగానికి పంచాయతీ ప్రెసిడెంట్ జవాబుదారీగా ఉంటారు. రాష్ట్రస్థాయిలో విధానాల రూపకల్పన మినహా క్షేత్రస్థాయిలో స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు, చివరికి మంత్రుల జోక్యం ఉండదంటే అతిశయోక్తి కాదు.
గ్రామ పంచాయతీల పనితీరిలా...
గ్రామసభలను వార్డు స్థాయిల్లో(ఆయసభ) నిర్వహించి స్థానిక ప్రజల అవసరాల మేరకు అభివృద్ధి ప్రణాళికలను రూపొందిస్తారు. ప్రతి మూడు నెలలకోమారు తప్పనిసరిగా ఆయా సభలు నిర్వహిస్తారు. గ్రామ పంచాయతీ పరిధిలో కృషిభవన్(వ్యవసాయ), వెటర్నటీ ఆసుపత్రి, అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేదిక్ ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీ, బాలవాడీలు, డే కేర్ సెంటర్లు, ప్రాథమిక పాఠశాలలు, మత్స్య ఉప కేంద్రాలు, గిరిజన విస్తరణ కేంద్రాలు ఉంటాయి. ఆయా విభాగాల్లో పనిచేసే సిబ్బందికి వేతనాలు ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వమే అయినప్పటికీ, వీరంతా స్థానిక ప్రభుత్వ(పంచాయతీ) ఆధీనంలోనే పనిచేయాలి.
పనితీరు బాగోని అధికారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్‌కు ఉంటుంది. ప్రధానంగా ఆస్తి పన్ను, వృత్తి పన్ను, వినోద పన్ను, ప్రకటనల పన్ను రూపేణా సొంత వనరులు కలిగి ఉంటాయి. అంతేకాకుండా జనాభా ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో 40 శాతం నిధులను నేరుగా కేటాయిస్తోంది. కేంద్రం నుంచి వచ్చే నిధులూ గ్రామ పంచాయతీ ఖాతాలకే జమ అవుతాయి.కేరళ స్థానిక సంస్థల బలోపేతానికి మూల కారణం వంద శాతం అక్షరాస్యతని మడక్కతర గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ వినయన్ చెప్పారు. స్థానిక పాలనలో విపక్ష సభ్యులను కూడా భాగస్వాములను చేస్తామని, ఇక్కడ కుల వివక్షలేదని పాలక్కడ్ జిల్లా పంచాయతీ ప్రెసిడెంట్ శాంతకుమారి తెలిపారు.
కేరళలో పంచాయతీరాజ్ వ్యవస్థ ఇలా...
గ్రామ పంచాయతీలు 978
బ్లాక్ పంచాయతీలు 152
జిల్లా పంచాయతీలు 14
కమిటీలు: స్టీరింగ్ కమిటీ, స్టాండింగ్ కమిటీలు, సబ్ కమిటీలు, జాయింట్ కమిటీలు, వర్కింగ్ గ్రూపులు