Panchayati Raj system
-
పంచాయతీ రాజ్ ప్రాముఖ్యాన్ని కాంగ్రెస్ అర్థం చేసుకోలేదు
చండీగఢ్: దేశానికి పంచాయతీ రాజ్ వ్యవస్థ ఎంత అవసరమైందో స్వాతంత్య్రం వచి్చన నాలుగు దశాబ్ధాల తర్వాత కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అర్థం చేసుకోలేకపోయిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పంచాయతీ రాజ్ వ్యవస్థల బలోపేతానికి అప్పటి ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. జిల్లా పంచాయతీ వ్యవస్థను సైతం కాంగ్రెస్ పాలకులు గాలికి వదిలేశారని మండిపడ్డారు. ‘ఫలితంగా దేశ జనాభాలో గ్రామాల్లో నివసించే మూడింట రెండొంతుల మంది కనీస సౌకర్యాలైన రహదారులు, విద్యుత్, మంచినీరు, పక్కా ఇళ్లు వంటి వాటికి కూడా నోచుకోలేకపోయారు. ఈ నిర్లక్ష్యం ఫలితంగా స్వాతంత్య్రం సిద్ధించిన ఏడు దశాబ్దాలకు కూడా దేశంలోని సుమారు 18 వేల గ్రామాలకు విద్యుత్ సౌకర్యం సమకూరలేదు’ అని ఆయన అన్నారు. ఇందుకు జమ్మూకశీ్మరే ప్రత్యక్ష సాక్ష్యమని చెప్పారు. ఫరీదాబాద్‌లోని సూరజ్‌కుండ్‌లో బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ‘హరియాణా క్షేత్రీయ పంచాయతీ రాజ్ పరిషత్’ రెండు రోజుల వర్క్‌షాప్‌ను సోమవారం ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించి ప్రసంగించారు. అమృత్ కాల్ తీర్మానాల సాధనకు, అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యం దిశగా నేడు భారత్ ఐక్యంగా ముందుకు సాగుతోందని ప్రధాని చెప్పారు. ఆగస్ట్ 9వ తేదీన క్విట్ ఇండియా ఉద్యమ వార్షికోత్సవం రోజున యావత్ దేశం ‘అవినీతి..ఆశ్రిత పక్షపాతం.. బుజ్జగింపు రాజకీయాలు క్విట్ ఇండియా’ అని ఐక్యంగా నినదించాలన్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ప్రతి ఇంటికీ చేరేందుకు జిల్లా పరిషత్ సభ్యులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్ష కూటమిపై ప్రధాని విసుర్లు ప్రతిపక్ష ‘ఇండియా’కూటమి భారత్ ప్రగతికి ప్రతిబంధకంగా, ప్రమాదకరంగా మారిందని ప్రధాని అన్నారు. ఢిల్లీ ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో సోమవారం జరిగిన జాతీయ చేనేత దినోత్సవాలనుద్దేశించి ప్రధాని మాట్లాడారు. -
పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ అడుగుజాడల్లో నడుస్తూ రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి ఆరోపించారు. సర్పంచుల పదవీకాలం ముగియగానే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పిన ప్రభుత్వం.. సుప్రీంకోర్టు ఆదేశాలు, రిజర్వేషన్ల అమలు, బీసీ గణన వంటి అంశాల్లో ఏకపక్షంగా వ్యవహరించి ఎన్నికల వాయిదాకు కారణం అవుతోందని పేర్కొన్నారు. బీజేపీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచ్ వ్యవస్థను రద్దు చేసి పంచాయతీలను తమ అధీనంలోకి తెచ్చుకోవాలని అనుకుంటోందని విమర్శించారు. రేషన్ కార్డులు, పెన్షన్లు, స్వయం ఉపాధి, పట్టాదారు పాసు పుస్తకాలు గ్రామసభల ద్వారానే ఇవ్వాల్సి ఉన్నా అందుకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. టీఆర్ఎస్ కండువా కప్పుకోకుంటే అంతే.. టీఆర్ఎస్ కండువా కప్పుకోకుంటే ట్రాక్టర్లు, సబ్సిడీ వస్తువులు రాకుండా చేస్తున్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు. మన ఊరు– మన ప్రణాళిక అని చెప్పారు కానీ మన ఊరు అక్కడే ఉంది కానీ ప్రణాళికలు ఎక్కడికో పోయాయని ఎద్దేవా చేశారు. కేంద్రం పంచాయతీలకు నేరుగా నిధులు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా జాప్యం చేస్తోందన్నారు. సీఎం కేసీఆర్‌కు మంత్రుల మీద, సచివాలయం మీద నమ్మకం లేదని వ్యాఖ్యానించారు. మంత్రివర్గాన్ని సీఎం నిర్వీర్యం చేశారని, మంత్రులకు తెలియకుండానే ప్రగతిభవన్‌లో సీఎం నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. దీంతో మంత్రులు చూపుడు గుర్రాలుగా మారారని విమర్శించారు. ధర్నా చౌక్ ఎత్తివేసి తెలంగాణలో పోలీసు రాజ్యం నడిపిస్తున్నారని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. అసెంబ్లీ కమిటీలు, ప్రతిపక్షాల మీద కూడా ఈ ప్రభుత్వానికి నమ్మకం లేదన్నారు. -
పంచాయతీరాజ్‌కు రూ.14,723 కోట్లు
వ్యవస్థ పటిష్టం కోసం బడ్జెట్లో భారీ కేటాయింపులు ⇒ ఆసరాకు అవసరానికి మించి రూ.5,330.59 కోట్లు ⇒ ‘భగీరథ’కు 80% అప్పులే.. బడ్జెట్ సపోర్ట్ రూ.3,000 కోట్లు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థలను పటిష్టం చేయడంతో పాటు గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను మరింత సమర్థంగా అమలు చేయాలని సర్కారు భావిస్తోంది. ఇందుకోసం 2017–18 వార్షిక బడ్జెట్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు భారీ స్థాయిలో కేటాయింపు చేసింది. 2016–17 బడ్జెట్లో పీఆర్అండ్ఆర్డీకి రూ.11,031 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, తాజా బడ్జెట్లో రూ.14,723.42 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.1,891.09 కోట్లను నిర్వహణ పద్దుగా చూపగా, అభివృద్ధి పనుల కోసం ప్రగతి పద్దు కింద రూ.12,832.32 కోట్లు కేటాయించింది. నిర్వహణ వ్యయంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి రూ.3 కోట్లు.. ప్రగతి పద్దులో జిల్లా పరిషత్తులకు సాయం, స్థానిక సంస్థలకు ఎస్ఎఫ్సీ గ్రాంట్ కలిపి రూ.111 కోట్లు, మండల పరిషత్తులకు రూ.61.50 కోట్లు, గ్రామ పంచాయతీల కోసం రూ.52.10 కోట్లు కేటాయించింది. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి రహదారుల నిర్మాణానికి రూ.484.60 కోట్లు, ఎస్సీ సబ్‌ప్లాన్ కింద రూ.146.77 కోట్లు, గిరిజన సబ్‌ప్లాన్ కింద రూ.86 కోట్లు ప్రకటించింది. గ్రామీణ నీటి సరఫరా విభాగానికి మిషన్ భగీరథతో కలిపి రూ.3,228.37 కోట్లు కేటాయించింది. గ్రామీణాభివృద్ధికి కేటాయింపులు ఇలా.. గ్రామీణాభివృద్ధికి నిర్వహణ పద్దు కింద బడ్జెట్లో రూ.58.41 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, ప్రగతి పద్దు కింద రూ.7,384 కోట్లు చూపింది. రూర్బన్, టీఆర్ఐజీపీ, ఎన్ఆర్ఎల్ఎం.. తదితర పథకాల అమలు కోసం రూ.330 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. ఉపాధిహామీ పథకానికి రూ.3 వేల కోట్లు, రాజేంద్రనగర్‌లోని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థకు రూ.6.04 కోట్లు కేటాయించారు. ఆసరాకు భారీ కేటాయింపులు సామాజిక భద్రతా పింఛన్ల పథకం ‘ఆసరా’కు ప్రభుత్వం భారీ కేటాయింపులు చేసింది. పథకం కింద ప్రస్తుతం 36 లక్షల మంది లబ్ధిదారులుండగా, నెలనెలా పింఛన్ల కోసం ఏడాదికి రూ.4,800 కోట్లు అవసరమవుతున్నాయి. ఏప్రిల్ 1నుంచి ఒంటరి మహిళలకూ ఆసరా కింద ఆర్థిక భృతి అందించాలని నిర్ణయించడంతో సుమారు 2 లక్షల మందికి మరో రూ,.247 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. మొత్తంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆసరాకు రూ.5,247 కోట్లు అవసరం కాగా, ప్రభుత్వం రూ.5,330.59 కోట్లు కేటాయించడం విశేషం. అప్పులతోనే భగీరథ! మిషన్ భగీరథ ప్రాజెక్ట్‌కు వివిధ ఆర్థిక సంస్థలిచ్చే అప్పులే ఆధారం కానున్నాయి. రూ.42 వేల కోట్ల అంచనాతో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్‌కు బ్యాంకు రుణాల ద్వారానే నిధులు సమకూర్చాలని ప్రభుత్వం భావించింది. అయితే.. ప్రాజెక్ట్ పరిధిలోని వివిధ సెగ్మెంట్లకు 80% మించి రుణాలిచ్చేందుకు బ్యాంకు లు అంగీకరించకపోవడంతో 20 శాతం నిధులను బడ్జెట్ సపోర్ట్‌గా అందిం చేందుకు ప్రభు త్వం సన్నద్ధమైంది. ఈ మేరకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.15 వేల కోట్లు ఖర్చు చేయాలని భావిస్తున్న ప్రభుత్వం.. తన వాటా నిధుల కింద రూ.3 వేల కోట్లు కేటాయించింది. -
‘స్వర్ణభారత్’ సేవలు భేష్
గ్రామీణులు, నిరుద్యోగులకు విశేష సేవలందిస్తోంది: సీఎం కేసీఆర్ ట్రస్ట్ హైదరాబాద్ చాప్టర్ ప్రారంభం సాక్షి, రంగారెడ్డి జిల్లా: గ్రామీణ ప్రాంత ప్రజలు, నిరుద్యోగులకు స్వర్ణభారత్ ట్రస్ట్ విశేష సేవలందిస్తోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కొనియాడారు. మహాత్ముని ఆశయాల నుంచి పురుడుపోసుకున్న ఈ ట్రస్ట్.. సంఘం, సమాజం పురోగమించేందుకు తనవంతు కృషి చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ట్రస్ట్‌కు ఎలాంటి సాయం అందిచడానికైనా సిద్ధంగా ఉంటామన్నారు. సోమవారం రంగా రెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ లో నెలకొల్పిన ట్రస్ట్ హైదరాబాద్ చాప్టర్‌ను కేసీఆర్ ప్రారంభించారు. కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్, కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు. సీఎం మాట్లాడుతూ.. పల్లెల్లోనే దేశం ఉందన్న గాంధీ స్ఫూర్తిని ట్రస్ట్ పుణికి పుచ్చుకుందన్నారు. ట్రస్ట్ ద్వారా ఎంతో మం దికి శిక్షణ ఇవ్వడంతో పాటు ఉపాధి కల్పిస్తు న్నారన్నారు. ట్రస్ట్ వ్యవస్థాపకురాలు దీపా వెంకట్ తన తండ్రి వెంకయ్యనాయుడు అండతో రాజకీయాల్లోకొచ్చే అవకాశమున్నా.. అది వదిలేసి, సేవ చేయాలన్న సం కల్పంతో ముందుకెళ్లడం అభినందనీయ మ న్నారు. తండ్రి సంస్కారమే ఆమెకు అబ్బిందన్నారు. సర్పంచ్‌కు కోట్లు పెడుతున్నారు... ప్రస్తుతం మనం పిలుచుకుంటున్నట్లు పంచా యతీరాజ్ ఒక శాఖ కాదని, ఒకప్పుడు సాగిన బృహత్తర ఉద్యమమని సీఎం పేర్కొన్నారు. కొన్ని పరిస్థితులతో దురదృష్టవశాత్తు దాన్ని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘అప్పటి రాజకీయ వ్యవస్థ.. దాన్ని ఒక శాఖగా మార్చి ఉద్యమాన్ని చంపేసింది. ఆ తర్వాత స్వార్థం తోడైంది. ఈ క్రమంలో సర్పంచ్‌గా గెలవడం కోసం.. రూ.కోట్లు ఖర్చుపెట్టే పరిస్థితులు వచ్చాయి. ఫలితంగా ఆ ఉద్యమం.. స్ఫూర్తి కనుమరుగైపోయింది. దేశానికి ప్రధాని, సీఎంలు ఇలా ఎవరేం చేసినా.. ప్రథమ స్థానంలో నిలబడి పనిచేయా ల్సింది స్థానిక సంస్థల ప్రతినిధులే. గ్రామాల సర్పంచులు, ఎంపీటీలు, ఎంపీపీలు.. వీరం తా అద్భుతంగా పనిచేసినప్పుడే దేశం వికాసం సాధిస్తుంది’’ అని అన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో వచ్చిన విపరిణామాలు, దుష్ప్రభావాలను సంస్కరించాలని ట్రస్ట్‌ను కోరారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సాయం అందించడానికైనా సిద్ధంగా ఉన్నామని, సేవల్ని మరింత విస్తరించడానికి తోడ్పాటు అందిస్తామని చెప్పారు. మహారాష్ట్రలో బండార్కర్ అనే వ్యక్తి పరిశోధనలు, చూపిన తపన ఫలితంగా ఆ రాష్ట్రం ద్రాక్ష ఎగుమతిలో గణనీయ అభివృద్ధి సాధిస్తోందని సీఎం అన్నారు. ఆయన కృషి ఫలితంగా ఏటా రూ.10 వేల కోట్ల విలువ జేసే ద్రాక్షలను ఎగుమతి చేసే స్థాయికి ఆ రాష్ట్రం ఎదిగిందన్నారు. సంఘం కోసం ఏదో చేయాలన్న తపన çఫలితమే ఇదన్నారు. ఇలా ఎందరో మహనీయులు గ్రామాలకు సేవచేశారని.. ఇదే లక్ష్యంతో ట్రస్ట్ పనిచేస్తోందని చెప్పారు. ఇలాంటి ట్రస్టులు చాలా అవసరం... గ్రామీణ యువతీ యువకుల్లో స్వర్ణభారత్ ట్రస్ట్ చైతన్యం తీసుకురావడం సంతోషంగా ఉందని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. మహాత్ముడి కలల సాధన కోసం ట్రస్ట్ కృషి చేస్తోందన్నారు. పేదరికం పోవా లంటే ఇలాంటి ట్రస్టులు చాలా అవసరమ న్నారు. యువత ఉపాధి కల్పనకు కేంద్రం రూ. వెయ్యి కోట్లు కేటాయిస్తోందన్నారు. అవగా హన, నైపుణ్యాలు లేకపోవడం వల్లే నిరుద్యోగ సమస్య వచ్చిపడిందని, మానవ వనరులు పుష్కలంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ అన్నారు. ట్రస్ట్ వ్యవస్థాపకురాలు దీపా వెంకట్ మాట్లాడుతూ.. గ్రామీణులకు ట్రస్ట్ అండగా ఉంటుందన్నారు. వారు జీవితంలో స్థిరపడే బాధ్యత తమ ట్రస్ట్ తీసుకుంటుందని చెప్పా రు. కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీలు మల్లారెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, సియంట్ సంస్థ అధినేత బీవీఆర్ మోహన్‌రెడ్డి, ఏపీ మంత్రి కామినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ట్రస్టు ఏర్పాటుకు పది ఎకరాల స్థలాన్ని విరాళంగా అందజేసిన మహా సిమెంట్, మైహోం గ్రూపు సంస్థల చైర్మన్ జూపల్లి రామేశ్వర్రావు, ఎండీ జూపల్లి జగపతిరావును సన్మానించారు. ప్రభుత్వం నుంచి పైసా లబ్ధి పొందలేదు: వెంకయ్య స్వర్ణభారత్ ట్రస్ట్‌లో రాజకీయాలకు ఏమా త్రం తావులేదని కేంద్రమంత్రి వెంకయ్యనా యుడు స్పష్టం చేశారు. ఇది గ్రామీణ ప్రాంత ప్రజలు, మహిళలు, నిరుద్యోగ యువతీ యువకుల్లో నైపుణ్యాలు పెంపొం దించి ఉపాధి కల్పించే ట్రస్ట్ అని పేర్కొ న్నారు. యువత ఉద్యోగాల కోసం కాళ్ల రిగేలా తిరగకుండా ఉద్యోగాలిచ్చే స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. ట్రస్ట్ ద్వారా ఐటీ, ఫార్మా సంస్థల సాయంతో నిరుద్యోగుల నైపుణ్యాలకు సానబెడుతున్నామని చెప్పారు. ప్రభుత్వం నుంచి ట్రస్ట్ పైసా లబ్ధి పొందలేదని, పూర్తిగా దాతల సహకా రంతోనే కొనసాగుతోందని పేర్కొన్నారు. వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా దేశ వారసత్వాన్ని, సంప్రదాయాల్ని మరిచిపోవద్దన్నారు. కన్నతల్లి, మాతృభూమి, మాతృభాష, మాతృదేశాన్ని మరిచిపోయినవారు మనుషులే కాదన్నారు. దేశంలో విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయని.. ఈ క్రమంలో స్వల్ప ఇబ్బందులు తప్పవ న్నారు. మతం వ్యక్తిగతమని, అందరి గతం ఒక్కటే కాబట్టి కలసిమెలసి జీవించాలని చెప్పారు. ఆ ఉద్యమంలో నేనూ పాల్గొన్నా.. దశాబ్దాల కిందట ఉన్న స్వచ్ఛత ప్రస్తుత గ్రామాల్లో లేదని, మురికి, కంపచెట్లు తొలిగే మార్గం కనిపించడం లేదని కేసీఆర్ చెప్పారు. ‘‘గ్రామీణాభివృద్ధి నిపుణులు ఎస్కేడే ఆధ్వర్యంలో ఒకప్పుడు పంచాయతీరాజ్ ఉద్యమం జోరుగా సాగింది. హైదరాబాద్ కేంద్రం గా ఈ ఉద్యమాన్ని నడిపించారు. రాజేంద్రనగర్‌లోని ఎన్ఐఆర్డీ ఆయన స్థాపించిందే. పంచాయతీరాజ్ సమితికి తొలిసారిగా నామినేట్ అయిన ఇద్దరూ ఇక్కడివారే. అందులో ఒకరు ఏపీ మాజీ స్పీకర్ రామచంద్రారెడ్డి. ఈ సమితికి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పంచాయతీరాజ్ ఉద్యమం జోరుగాసాగింది. దుబ్బాకలో రాజ్యసభ మాజీ సభ్యుడు సోలిపేట రాంచంద్రారెడ్డి సమితికి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేనూ ఈ ఉద్యమంలో పాల్గొ న్నా. విద్యార్థిగా దళిత, గిరిజన వాడల్లో పారిశుధ్యంపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో వేషాలు వేశా. ఉపన్యాలు చెప్పా. తర్వాత అది కనుమరుగై గ్రామాల్లో పొడి వాతావరణంతో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి’’ అని సీఎం అన్నారు. -
ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు మంగళం!
* పంచాయతీరాజ్ చట్ట సవరణకు సీఎం నిర్ణయం * విధివిధానాలు రూపొందించాలని సీఎస్‌కు ఆదేశాలు * మూడంచెల విధానాన్ని అనుసరించేలా చర్యలు * చట్టపరంగా చేపట్టాల్సిన అంశాలను పరిశీలించాలని సూచన సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులకు మంగళం పాడాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను కొనసాగించాలని, అదనపు సమాం తర పదవులు మండల ప్రాదేశిక నియోజకవర్గాలు, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలను రద్దు చేయనుంది. ఈ మేరకు సీఎం కె.చంద్రశేఖర్‌రావు సీఎస్ రాజీవ్‌శర్మకు ఆదేశాలు జారీ చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులను రద్దు చేసేందుకు చట్టప్రకారం అనుసరించాల్సిన చర్యలు పరిశీలించాలని, సంబంధించిన విధి విధానాలను రూపొందించాలని సూచించారు. సమాంతర పదవులు.. స్థానిక సంస్థల పాలనలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులకు పెద్దగా ప్రాధాన్యం లేదు. వారికి నిర్దిష్ట అధికారాలు కూడా లేవు. మండల స్థాయిలో ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు సమాంతర స్థాయిలో ఉండగా.. గ్రామాల్లో ఎంపీటీసీలు, సర్పంచులు దాదాపు సమాన స్థాయిలో ఉన్నారు. దీంతో ఎన్నో సమస్యలు వస్తున్నాయి. కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే పన్నుల వాటాను 42 శాతానికి పెంచినా.. అందులో చాలా వరకు నిధులను నేరుగా గ్రామాలకు కేటాయిస్తోంది. దీంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులకు ఆర్థిక అంశాల్లో ప్రమేయం లేకుండా పోయింది. వారు కేవలం ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ ఎన్నికలకే పరిమితమవుతున్నారనే అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీలను తొలగించి జిల్లా, మండలం, గ్రామం యూనిట్లుగా మూడంచెల విధానాన్ని కొనసాగించాలని సీఎం భావిస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా పంచాయతీరాజ్ చట్టానికి అవసరమైన సవరణలు చేయాలని అధికారులకు సూచించారు. అనవసర రాజకీయ జోక్యం తగ్గేలా, పంచాయతీరాజ్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేలా ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. అలంకారప్రాయంగా పదవులు.. 1987కు ముందున్న పంచాయతీ సమితులను అప్పటి ఎన్టీఆర్ ప్రభుత్వం రద్దు చేసింది. వాటి స్థానంలో మండల ప్రజా పరిషత్‌లను ఏర్పాటు చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో 1994 పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి వచ్చాక ఈ వ్యవస్థలో కొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. గ్రామం, మండలం, జిల్లా యూనిట్లుగా మూడంచెల వ్యవస్థతో పాటు మండల ప్రాదేశిక, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు కొత్తగా వచ్చాయి. 1995లో తొలిసారిగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులకు ఎన్నికలు జరిగాయి. కానీ స్థానిక పాలనలో ఈ పదవులు అలంకార ప్రాయంగా మారడంతో దీనపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది. కానీ 73వ రాజ్యాంగ సవరణతో ముడిపడి ఉన్న అంశం కావటంతో... ఈ వ్యవస్థలో మార్పులు చేయటం సాధ్యమా, కాదా అనేదానిపై భిన్నాభిప్రాయాలున్నాయి. అయితే స్థానిక సంస్థలు రాష్ట్ర పరిధిలోని అంశం కావటంతో.. ప్రస్తుత చట్టానికి మార్పులు చేసి ఎంపీటీసీ, జెడ్పీటీసీలను తొలగించే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి. -
ఎస్బీ పల్లిని దత్తత తీసుకుంటా!
కేంద్రమంత్రి దత్తాత్రేయ ప్రకటన కొత్తూరు: మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం ఎస్బీ పల్లిని దత్తత తీసుకుంటానని కేంద్ర కార్మికశాఖ మం త్రి బండారు దత్తాత్రేయ అన్నారు. పంచాయతీరాజ్ దివస్‌ను పురస్కరించుకుని ఆదివారం ఇక్కడ నిర్వహించిన గ్రామ్ ఉదయ్‌సే భారత్ ఉదయ్ అభియాన్ గ్రామసభలో మంత్రి మాట్లాడారు. పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా గ్రామాలు బలపడాలని దత్తాత్రేయ పేర్కొన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన 23 గ్రామీణ పథకాలను అమలు చేస్తే ఎస్బీ పల్లి గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామాల్లో విద్య, వైద్యం, రోడ్లు, సాగునీరు వంటి సౌకర్యాలను కల్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మొబైల్ ద్వారా ఉద్యోగాల కల్పనకుగాను నేషనల్ క్యారియర్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. -
పంచాయతీలే పవర్ఫుల్
♦ కేరళలో పటిష్టంగా పంచాయతీరాజ్ వ్యవస్థ ♦ గ్రామ, బ్లాక్, జిల్లా పంచాయతీలుగా స్థానిక సంస్థలు ♦ అధ్యయనానికి రాష్ట్రం నుంచి కేరళ బాట పట్టిన ప్రజాప్రతినిధులు సాక్షి, హైదరాబాద్: అక్కడ ప్రభుత్వమంటే పంచాయతీలే. అభివృద్ధి ప్రణాళికల నుంచి వాటి అమలు వరకు వాటిదే కీలక పాత్ర! కీలక అధికారాలు క్షేత్రస్థాయిలో పనిచేసే పంచాయతీల చేతిలోనే ఉండటంతో అభివృద్ధి పరుగులు పెడుతోంది. కేరళలోని పంచాయతీరాజ్ వ్యవ స్థ అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఆ రాష్ట్రంలోని పంచాయతీరాజ్ వ్యవస్థపై అధ్యయనానికి తెలంగాణ సర్కారు రాష్ట్రం నుంచి జిల్లాల వారీగా కేరళలోని ‘కిలా(కేరళ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లోకల్ అడ్మినిస్ట్రేషన్)’కు పంపుతోంది.ఇటీవల కరీంనగర్ జిల్లాపరిషత్ చైర్మన్ తులా ఉమ ఆధ్వర్యంలో ఆ జిల్లా జెడ్పీటీసీలు, సర్పంచులు కేరళలోని పాలక్కడ్, త్రిశూర్ జిల్లా పంచాయతీలు, వల్లచిర్ల, మడకతర గ్రామపంచాయతీలను సందర్శించారు. అవినీ తికి దూరంగా అధికార యంత్రాంగం పనిచేస్తుండటం, అంటరానితనాన్ని, కుల వివక్షను సంపూర్ణంగా నిర్మూలించగలగడం, ప్రజాప్రతినిధులంతా జవాబుదారీతనం కలిగి ఉండడమే ‘కేరళ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ’ అని అంటున్నారు ‘కిలా’ ఆచార్యులు. ఇతర దేశాల నుంచి కూడా అధికారులు ‘కిలా’లో శిక్షణకు వస్తుండటం విశేషం. అన్నీ ప్రెసిడెంటే... మన దగ్గర పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్‌లు ఉండగా, ఆ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ, బ్లాక్ పంచాయతీ, జిల్లా పంచాయతీలని పిలుస్తారు. అయితే.. ఆయా పంచాయతీలనే స్థానిక ప్రభుత్వాలుగా అక్కడి ప్రజలు భావిస్తారు. ఎందుకంటే.. ఆ పంచాయతీల పరిధిలో చేపట్టే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లోనూ స్థానికేతరుల జోక్యం ఉండదు. గ్రామస్థాయిలో పంచాయతీలకు సంపూర్ణ అధికారాలను అక్కడి ప్రభుత్వం కట్టబెట్టింది. పంచాయతీల పరిధిలో పనిచేసే ప్రభుత్వ శాఖల సిబ్బంది కూడా స్థానిక పంచాయతీ ప్రెసిడెంట్ల నియంత్రణలోనే ఉంటారు. అభివృద్ధి పనుల్లో నాణ ్యతకు, నిధుల వినియోగానికి పంచాయతీ ప్రెసిడెంట్ జవాబుదారీగా ఉంటారు. రాష్ట్రస్థాయిలో విధానాల రూపకల్పన మినహా క్షేత్రస్థాయిలో స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు, చివరికి మంత్రుల జోక్యం ఉండదంటే అతిశయోక్తి కాదు. గ్రామ పంచాయతీల పనితీరిలా... గ్రామసభలను వార్డు స్థాయిల్లో(ఆయసభ) నిర్వహించి స్థానిక ప్రజల అవసరాల మేరకు అభివృద్ధి ప్రణాళికలను రూపొందిస్తారు. ప్రతి మూడు నెలలకోమారు తప్పనిసరిగా ఆయా సభలు నిర్వహిస్తారు. గ్రామ పంచాయతీ పరిధిలో కృషిభవన్(వ్యవసాయ), వెటర్నటీ ఆసుపత్రి, అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేదిక్ ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ, బాలవాడీలు, డే కేర్ సెంటర్లు, ప్రాథమిక పాఠశాలలు, మత్స్య ఉప కేంద్రాలు, గిరిజన విస్తరణ కేంద్రాలు ఉంటాయి. ఆయా విభాగాల్లో పనిచేసే సిబ్బందికి వేతనాలు ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వమే అయినప్పటికీ, వీరంతా స్థానిక ప్రభుత్వ(పంచాయతీ) ఆధీనంలోనే పనిచేయాలి. పనితీరు బాగోని అధికారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్‌కు ఉంటుంది. ప్రధానంగా ఆస్తి పన్ను, వృత్తి పన్ను, వినోద పన్ను, ప్రకటనల పన్ను రూపేణా సొంత వనరులు కలిగి ఉంటాయి. అంతేకాకుండా జనాభా ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో 40 శాతం నిధులను నేరుగా కేటాయిస్తోంది. కేంద్రం నుంచి వచ్చే నిధులూ గ్రామ పంచాయతీ ఖాతాలకే జమ అవుతాయి.కేరళ స్థానిక సంస్థల బలోపేతానికి మూల కారణం వంద శాతం అక్షరాస్యతని మడక్కతర గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ వినయన్ చెప్పారు. స్థానిక పాలనలో విపక్ష సభ్యులను కూడా భాగస్వాములను చేస్తామని, ఇక్కడ కుల వివక్షలేదని పాలక్కడ్ జిల్లా పంచాయతీ ప్రెసిడెంట్ శాంతకుమారి తెలిపారు. కేరళలో పంచాయతీరాజ్ వ్యవస్థ ఇలా... గ్రామ పంచాయతీలు 978 బ్లాక్ పంచాయతీలు 152 జిల్లా పంచాయతీలు 14 కమిటీలు: స్టీరింగ్ కమిటీ, స్టాండింగ్ కమిటీలు, సబ్ కమిటీలు, జాయింట్ కమిటీలు, వర్కింగ్ గ్రూపులు -
సిబ్బంది లేక.. పథకాలు పడక
సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టపరుస్తామని ప్రభుత్వం గొప్పగా ప్రకటనలు చేస్తున్నా.. ఆ శాఖలో వివిధ స్థాయిల్లో ఉద్యోగుల సంఖ్య నానాటికి తగ్గిపోతోంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో వివిధ రకాల అభివృద్ధి పనులన్నీ పంచాయతీరాజ్ విభాగం ఆధ్వర్యంలోనే జరగాల్సి ఉంది. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లు దీని పరిధిలోనే పనిచేస్తాయి. అయితే.. గత కొన్నేళ్లుగా పంచాయతీరాజ్ విభాగాన్ని సిబ్బంది కొరత వెంటాడుతోంది. దీంతో ప్రభుత్వ పథకాల అమలు, పర్యవేక్షణ పనులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ముఖ్యంగా.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామజ్యోతి, పల్లెప్రగతి, ఈ-పంచాయతి వంటి కార్యక్రమాలు ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. క్షేత్రస్థాయిలో తగిన సంఖ్యలో సిబ్బంది లేకుండా పథకాలు రూపకల్పన చేస్తే ఫలితం ఉండదని గ్రామ పంచాయతీ సర్పంచులు పేర్కొంటున్నారు. ఒక్కో గ్రామానికి ఒక్కో పంచాయతీ కార్యదర్శి ఉండాల్సి ఉండగా... ఐదు నుంచే ఏడు గ్రామాల బాధ్యతలు ఒక్కరికే అప్పగిస్తున్నారని, ఇలా అయితే పథకాల అమలు ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి నుంచి జిల్లా పరిషత్ సీఈవో పోస్టుల వరకు పంచాయతీరాజ్ శాఖలో వివిధ స్థాయిల్లో 2,917 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు తాజాగా తేల్చారు. ఈ శాఖలో అన్ని పోస్టుల కలిపి మొత్తం 7,253 పోస్టులుండగా, ప్రస్తుతం 4,336 మంది సిబ్బందే ఉన్నారు. ఆ ఆపరేటర్లకు ఏప్రిల్ నుంచి జీతాలు ఇవ్వొద్దు పంచాయతీరాజ్‌లో కాంట్రాక్ట్ ఏజెన్సీ కింద పనిచేస్తున్న 1,313 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లకు త్వరలోనే మంగళం పాడాలని పంచాయతీరాజ్ విభాగం నిర్ణయించింది. గ్రామ పంచాయతీల్లో వివరాల నమోదు కోసం గతేడాది ఓ ప్రైవేటు కాంట్రాక్ట్ ఏజెన్సీ ద్వారా ప్రభుత్వం వీరిని నియమించుకుంది. ఈ ఏడాది మార్చి ఆఖరుకు సదరు ప్రైవేటు ఏజెన్సీ కాంట్రాక్ట్ కాలపరిమితి ముగియనున్నందున ఏప్రిల్ 1 తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్లకు వేతనాలు చెల్లించవద్దని ఉన్నతాధికారుల నుంచి పంచాయతీలకు మౌఖిక ఆదేశాలు వెళ్లాయి. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న ‘పల్లె సమగ్ర సేవా కేంద్రాల’ కోసం విలేజ్ లెవల్ ఎంటర్ప్రైన్యూర్లను నియమిస్తున్నందున, డేటా ఎంట్రీ ఆపరేటర్ల అవసరం ఇకపై ఉండబోదని ఆ విభాగం అధికారి ఒకరు తెలిపారు. -
గ్రామాల్లో ప్రభుత్వాలు
పంచాయతీరాజ్ వ్యవస్థలో సమూల మార్పులు.. ఇందుకు కొత్తగా చట్టాన్ని తీసుకువస్తాం: కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ వ్యవస్థలో సమూల మార్పులు చేయడమే లక్ష్యంగా కొత్త చట్టాన్ని తేవాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు చెప్పారు. పంచాయతీల స్థాయిలో గ్రామ ప్రభుత్వాలు ఏర్పడాలనేది దీని ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఈ నూతన చట్టం రూపకల్పనకు సంబంధించిన పలు అంశాలను శనివారం హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ కొత్త చట్టం రూపకల్పన కోసం కేరళ, కర్ణాటక రాష్ట్రాలు అవలంబిస్తున్న విధానాలను సమగ్రంగా అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. అంతేగాకుండా దీనికోసం క్షేత్రస్థాయి నుంచి సలహాలు, సూచనలను స్వీకరిస్తామని చెప్పారు. ప్రజల నుంచే ప్రభుత్వ విధానాలు రూపొందాలన్న ఆశయంతోనే కొత్త చట్టానికి రూపకల్పన జరగనుందని... అధికార వికేంద్రీకరణకు అసలైన అర్థం వచ్చేలా ఈ చట్టాన్ని తీసుకువస్తామని మంత్రి వెల్లడించారు. గ్రామ ప్రభుత్వాల కోసం.. రాష్ట్రస్థాయిలో ఉన్న ప్రభుత్వం మాదిరిగానే పంచాయతీల స్థాయిలో గ్రామ ప్రభుత్వాలు ఏర ్పడాలనేది తాము రూపొందించనున్న చట్టం అంతిమ లక్ష్యమని మంత్రి కేటీఆర్ చెప్పారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రస్తుతం పనిచేస్తున్న 29 ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందిని గ్రామ పంచాయతీల పరిధిలోకి తీసుకువచ్చేలా.. అన్నిశాఖలను సమన్వయ పరచాలనుకుంటున్నట్లు తెలిపారు. ఆ అధికారులు, సిబ్బంది అంతా గ్రామ సర్పంచ్ అధ్యక్షతన నడిచే పంచాయతీలకు జవాబుదారీగా పనిచేసేలా చట్టంలో నిబంధనలను పొందుపరుస్తామని వెల్లడించారు. నూతన చట్టం రూపకల్పన నిమిత్తం కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో పంచాయతీ వ్యవస్థల పనితీరు, అక్కడ అమలు చేస్తున్న విధానాలను సమగ్రంగా అధ్యయనం చే స్తున్నామన్నారు. ట్రిబ్యునల్స్, అంబుడ్స్‌మన్ వ్యవస్థలు.. గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లకు ప్రత్యేకంగా ట్రిబ్యునల్లు, అంబుడ్స్‌మన్ వంటి ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణవ్యాప్తంగా సుమారు ఎనిమిది వేల గ్రామ పంచాయతీలు ఉన్నాయని... తండాలను కూడా పంచాయతీలుగా మార్చితే ఈ సంఖ్య మరో 1,200 వరకు పెరగనుందని చెప్పారు. పంచాయతీలకు కొత్త చట్టం రూపొందించే క్రమంలో గ్రామ పంచాయతీల కార్యదర్శులు, సర్పంచ్‌లతో సమన్వయం చేసుకుని విధులు నిర్వహించేలా చర్యలు చేపడతామని మంత్రి పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధిలో మహిళా సంఘాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోందని... మహిళా సంఘాల సేవలను ఏవిధంగా వినియోగించుకోవాలనే అంశంపై కసరత్తు చేస్తున్నామని చెప్పారు. ఈ కొత్త చట్టాన్ని దేశవ్యాప్తంగా అన్ని పంచాయతీ వ్యవస్థలకు ఆదర్శంగా నిలిపే ప్రయత్నం చేస్తామని మంత్రి పేర్కొన్నారు. పంచాయతీల్లో స్వయం సమృద్ధి.. గ్రామ ప్రభుత్వాల ఏర్పాటుతో పాటు పంచాయతీలు స్వయం సమృద్ధి సాధించే విధంగా కొత్త చట్టం ఉండాలని భావిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వ నిధులతో పాటు ప్రజలు చెల్లించిన పన్నుల వినియోగంపై పారదర్శక విధానాలను రూపొందిస్తామని చెప్పారు. ప్రజలు పంచాయతీలకు పన్నులు చెల్లించేలా చైతన్యపరచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు చెల్లించే సొమ్ము అభివృద్ధి పనుల ద్వారా తిరిగి వారికే చేరుతుందన్న నమ్మకం కలిగిస్తేనే ఇది సాధ్యమవుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. -
సమష్టిగా పనిచేద్దాం.. సమగ్రాభివృద్ధి సాధిద్దాం
జడ్పీ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో చైర్పర్సన్ గడిపల్లి కవిత ఖమ్మం జెడ్పీసెంటర్: ఉద్యోగులు, ప్రజాప్రతినిధులనే తేడా లేకుండా అందరం సమష్టిగా పనిచేద్దామని, జిల్లా సమగ్రాభివృద్ధి సాధిద్దామని జిల్లాపరిషత్ చైర్పర్సన్ గడిపల్లి కవిత అన్నారు. జిల్లాపరిషత్ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఆదివారం నగర శివారులోని చెరుకూరి వారి మామిడి తోటలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ఉద్యోగులు, అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థ కీలకమైనదని అన్నారు. జిల్లాపరిషత్ సీఈవో జయప్రకాష్ నారాయణ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అప్పగించిన ప్రతి పనిని బాధ్యతాయుతంగా పూర్తి చేస్తున్నందునే జడ్పీకి మంచి పేరు వచ్చిందన్నారు. ఉద్యోగులు, అధికారుల మధ్య చక్కటి సమన్వయూనికి ఈ ఆత్మీయ సమ్మేళనం దోహదపడుతుందన్నారు. డిప్యూటీ సీఈవో కర్నాటి రాజేశ్వరి మాట్లాడుతూ.. సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో పీఆర్ వ్యవస్థ ముందుంటోందని అన్నారు. జిల్లాపరిషత్ ఏఓ వింజం అప్పారావు మాట్లాడుతూ.. జిల్లాపరిషత్ కుటుం బమంతా ఇలా గడపడం ఆనందంగా ఉందన్నారు. పీఆర్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు నడింపల్లి వెంకటపతిరాజు మాట్లాడుతూ.. జడ్పీ ఉద్యోగులమంతా సమన్వయంతో పనిచేశామని, పలు కార్యక్రమాల అమలులో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేశామని అన్నారు. దీనిని మున్ముందు కూడా కొనసాగిస్తామన్నారు. ఉద్యోగుల మధ్య స్నేహ సంబంధాల పెంపునకు ఈ సమ్మేళనం దోహదపడుతుందన్నారు. వచ్చేసారి జిల్లావ్యాప్తంగా పంచాయతీరాజ్ ఉద్యోగులందరితో సమ్మేళనం నిర్వహిస్తామన్నారు. ఈ సమ్మేళనంలో భాగంగా జరిగిన పలు క్రీడాపోటీలలో ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కళాకారుల పాటలు ఆకట్టుకున్నాయి. -
గ్రామాల్లో విద్యుత్ వివాదం
తాగునీటి వనరులు, వీధి దీపాలకు కట్ బకాయిలు చెల్లిస్తేనే పునరుద్ధరిస్తామంటున్న కరెంట్ అధికారులు నిస్సహాయ స్థితిలో సర్పంచ్‌లు...ఉన్నతాధికారులపై ఆగ్రహం గీసుకొండ : గ్రామపంచాయతీలకు సంబంధించిన విద్యుత్ బకాయిల చెల్లింపులో వివాదం నెలకొంది. తాము పదవిలోకి వచ్చి ఏడాది అవుతోంది... రూ.లక్షల్లో బిల్లులు ఎట్లా చెల్లించాలి... గతంలో పనిచేసిన సర్పంచ్ల వద్ద ఎందుకు బిల్లులు వసూలు చేయలేదు... తమనే ఎందుకు అడుగుతున్నారని ఆయూ గ్రామాల సర్పంచ్‌లు ఓ వైపు ప్రశ్నిస్తున్నారు. బిల్లు బకాయిలను చెల్లించే వరకూ విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని ఎన్పీడీసీఎల్ అధికారులు మరోవైపు స్పష్టం చేస్తున్నారు. అంతేకాదు... గ్రామపంచాయతీ ల ద్వారా ప్రజలకు తాగునీరందించే పబ్లిక్ వాటర్ స్కీం కిం ద ఓపెన్‌వెల్, బోరు బావులతోపాటు వీధి దీపాలకు విద్యుత్ కనెకసన్లను కట్ చేశారు. ఇప్పటికే గీసుకొండ మండలంలోని ఎలుకుర్తి హ వేలి, సింగ్యాతండా, అనంతారం గ్రామాలకు కరెంట్ సరఫరా నిలిపివేయగా... శుక్రవారం గీసుకొండ, గంగదేవిపల్లి, ఎలుకుర్తిహవేలితోపాటు పలు గ్రా మాలకు విద్యుత్ సరఫరా బంద్ చేశారు. సంగెం మండలంలోనూ చాలా గ్రామపంచాయతీలకు కరెంటు సరఫరా నిలిపివేశారు. ఫలితంగా ఆయూ గ్రామాల ప్రజలకు తాగునీటి ఇక్కట్లు మొదలయ్యూరుు. రాత్రివేళల్లో వీధిదీపాలు వెలగకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురువారం సంగెం మండల సర్వసభ్య సమావేశంలో ఇదే విషయమై చర్చ జరిగింది. బిల్లులను గతం నుంచి ప్రభుత్వమే చెల్లిస్తోందని, తమను చెల్లించమంటే ఎక్కడి నుంచి తేవాలని పలు గ్రామాల సర్పంచ్‌లు వాపోయారు. అంతా అయోమయం... విద్యుత్ బకాయిల చెల్లింపు విషయంలో అధికార యంత్రాంగం స్పష్టత ఇవ్వకపోవడంతో సర్పంచ్‌లు అయోమయానికి గురవుతున్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటైన నాటి నుంచి గ్రామ పంచాయతీల కరెంట్ బిల్లులను ప్రభుత్వం చెల్లిస్తూ వస్తోందని, ఇప్పుడు కొత్తగా కట్టాలని అడిగితే ఎక్కడి నుంచి తేవాలని వారు ప్రశ్నిస్తున్నారు. పంచాయతీలకు మంజూరయ్యే టీఎఫ్సీ నిధులను తాగునీటి కోసం ఖర్చు చేయాలని.. నిధులు మిగిలితే పారిశుద్ధ్య పనులకు ఖర్చు చేయాలనే నిబంధనలు ఉన్నాయని చెబుతున్నారు. అంతేతప్ప కరెంటు బిల్లులకు చెల్లించాలని ఎక్కడా లేదని అంటున్నారు. తమ గ్రామానికి ఐదేళ్లపాటు మంజూరైన టీఎఫ్సీ నిధులను మొత్తం కేటాయించినా... విద్యుత్ బకాయిలు చెల్లించలేని పరిస్థితి ఉందని నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు... తాగునీటి బావులు, బోర్లు, వీధి దీపాలకు మీటర్లను ఏర్పాటు చేయలేదని, ఇష్టారాజ్యంగా కరెంటు బిల్లుల భారం మోపారని సర్పంచ్‌లు ఆరోపిస్తున్నారు. తమ గ్రామాల్లో విద్యుత్ లైన్లు, స్తంభాలు, ట్రాన్ప్‌ఫార్మర్ల ఏర్పాటుకు సంబంధించి పంచాయతీలకు ఏమి ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. తేల్చాల్సింది ఉన్నతాధికారులే... తాగు నీటి వనరులకు కరెంట్ సరఫరా నిలిపివేసిన నేపథ్యంలో మచ్చాపూర్ ఇన్చార్జ్ ఏఈని ‘సాక్షి’ సంప్రదించింది. ఎందుకు అలా చేస్తున్నారని ప్రశ్నించగా... కరెంటు బిల్లులకు సంబంధించిన నిధులను పంచాయతీలకు విడుదల చేశామని డీపీఓ తమకు చెప్పారని పేర్కొన్నారు. సర్పంచ్‌లు చెల్లించకపోవడంతో హైదరాబాద్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామన్నారు. అసలు ఈ నిధులు విడుదల కాలేదని సర్పంచ్‌లు చెబుతుండడం విశేషం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ వివాదాన్ని పరిష్కరించకపోతే ప్రజల నుంచి వ్యతిరేకత పెల్లుబికుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. వీరు ఎట్ల కడతారో..! అనంతారంలో పంచాయతీ రూ. 4,11,445 విద్యుత్ బిల్లుల బకాయిలు చె ల్లించాలని అధికారులు చెబుతున్నారు. అయితే ఆ గ్రామ పంచాయ తీ ఏడాది ఆదాయం రూ. 42 వేలే. బీఆర్జీఎఫ్ నిధులు రూ. 30 వేలు, ఎస్ఎఫ్సీ నిధులు 7 వేలు, టీఎఫ్సీ నిధులు 18 వేలు. ఈ లెక్కన ఐదేళ్లపాటు ఇంటిపన్నులు, ఇతర అభివృద్ధి నిధులను విద్యుత్ బిల్లుకు చెల్లించినా సరిపోవు. గంగదేవిపల్లి పంచాయతీ చెల్లించాల్సిన విద్యుత్ బిల్లు బకాయిలు రూ. 6 లక్షలు. ఈ పంంచాయతీకి ఏడాదికి ఇంటిపన్నుల రూపంలో రూ. 1.56 లక్షలు, కొత్తగా ఇళ్ల నిర్మాణాల అనుమతులకు రూ. 20 వేలు, రహదారి పన్ను కింద రూ. 4 వేల ఆదాయం సమకూరుతోంది. పంచాయతీ ఆదాయం నుంచి 30 శాతం వేతనాలు, 16 శాతం వీధిలై ట్ల నిర్వహణ, 20 శాతం తాగునీటి కోసం, మరో 20 శాతం రోడ్ల అభివృద్ధికి ఖర్చు చేయాలి. ఆదాయం మొత్తం ఈ ఖర్చులకే పోతే రూ. 6 లక్షల విద్యుత్ బిల్లు బకాయిలు ఎలా చెల్లించాలని సర్పంచ్‌లు ప్రశ్నిస్తున్నారు. గీసుకొండ గ్రామంలో రూ. 16 లక్షల బిల్లు బకాయిలు చెల్లించాల్సి ఉండగా ఇంటిపన్నులు, ఫైనాన్స్ కమిషన్ నిధులు, ఇతర ఆదయాలు మొత్తం కలిపినా బిల్లుకు సరిపోని పరిస్థితి. కరెంట్ కట్ చేయొద్దని ఆదేశించా - కలెక్టర్ కిషన్ గ్రామాల్లో విద్యుత్ బకాయిల చెల్లింపు పేరుతో పంచాయతీలకు సంబంధించి తాగునీటి బావులు, బోరు బావులకు విద్యుత్ కనెక్షన్ కట్ చేయొద్దని ఎన్పీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్ఈ)కి చెప్పానని కలెక్టర్ కిషన్ తెలిపారు. శనివారం గీసుకొండ మండలంలోని గంగదేవిపల్లి గ్రామానికి వచ్చిన సందర్భంగాగంగదేవిపల్లి, ఎలుకుర్తిహవేలి, శాయంపేట, అనంతారం గ్రామ సర్పంచ్‌లు ఇట్ల శాంతి, భీమగాని సౌజన్య, కొంగర చంద్రమౌళి, దనేకుల వెంకటేశ్వర్లు విద్యుత్ బిల్లు బకాయిల సమస్యను ఆయన దృష్టికి తెచ్చారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ సర్పంచ్‌లు తాము పదవి చేపట్టిన కాలం నుంచైనా కరెంటు బిల్లులను చెల్లించాలని, నల్లా కనెక్షన్లు తీసుకున్న వారి నుంచి తప్పనిసరిగా పన్ను వసూలు చేసి... కరెంటు బిల్లులు చెల్లించాలన్నారు. మీటర్లు ఉన్న వాటికే బిల్లులు చెల్లించాలని, లేనివాటికి చెల్లించొద్దని స్పష్టం చేశారు. -
గ్రామీణాభివృద్ధికి కృషి చేయాలి
నూతనంగా ఎన్నికైన జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, జెడ్పీటీసీ సభ్యులు, నగర పంచాయతీ, మునిసిపల్ చైర్మన్లతోపాటు జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆదివారం హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. ప్రతిఒక్కరూ పల్లెల అభివృద్ధికి కృషి చేయాలని వారినుద్దేశించి కేసీఆర్ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు * హైదరాబాద్‌లో సీఎంను కలిసిన నూతన ప్రజాప్రతినిధులు * ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని పునరుద్ఘాటన త్వరలో ప్రజాప్రతినిధులకు * శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు వెల్లడి వరంగల్ : ఎన్నికల సమయంలో జిల్లా అభివృద్ధికి ఇచ్చిన హామీలు నూటికి నూరుశాతం అమలు చేస్తామని సీఎం కె.చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు. పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేసి ప్రగతి దిశగా అడుగేయాల్సిన అవసరం ఉందన్నారు. నూతనంగా ఎన్నికైన జిల్లాపరిషత్ చైర్పర్సన్ గద్దల పద్మ, జెడ్పీటీసీ సభ్యులు, నగర పంచాయతీ, మునిసిపల్ చైర్మన్లతో పాటు జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం డాక్టర్ రాజయ్య, ఎంపీలు కడియం, సీతారాంనాయక్, ఎమ్మెల్యేలు రమేష్, సురేఖ, శంకర్‌నాయక్, ముత్తిరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్, ఎమ్మెల్సీలు బోడకుంటి, నాగపురి తదితరులు ఆదివారం హైదరాబాద్‌లోని సీఎం క్యాంప్ కార్యాలయంలో కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో గెలిచిన వారిని ఆయన అభినందించారు. ప్రాథమిక స్థాయి నుంచి గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని, అన్ని రంగాల్లో పల్లెలను ముందువరుసలో ఉంచాలని ఆయన హితబోధ చేసినట్లు జిల్లా ప్రజాప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు ప్రజాప్రతినిధులకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు కేసీఆర్ వెల్లడించారని పేర్కొన్నారు. జిల్లాలో వ్యవసాయ, పారిశ్రామికాభివృద్ధితోపాటు నగర అభివృద్ధికి ఇచ్చిన హామీలు అమలు చేస్తామని, రాజకీయ అవినీతికి తావులేకుండా చూస్తామని చెప్పినట్లు వారు వివరిం చారు. ఆ తర్వాత సీఎం జిల్లాకు చెందిన ఎంపీలతో సమావేశమయ్యారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంతోపాటు రైల్వే పరంగా సాధించాల్సిన ప్రాజెక్టులపై చర్చించినట్లు సమాచారం. జిల్లా ప్రజాప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్ -
ప్రభావం చూపని ‘ప్రియాసాఫ్ట్’
జిల్లా పరిషత్, న్యూస్‌లైన్ : పంచాయతీరాజ్ వ్యవస్థలోని సంస్థలకు వచ్చిన నిధులు, వ్యయం తదితర వివరాలను ఆన్లైన్లో పెట్టేందుకు అమలు చేస్తున్న ప్రియా సాఫ్ట్వేర్ మండల పరిషత్, గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తోంది. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా అభివృద్ధి కలగానే మిగులుతోంది. దీంతో ఇచ్చిన ప్రతీ పైసాకు లెక్క తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్(ప్రియా సాఫ్ట్) స్టిస్టంను అమలులోకి తెచ్చింది. అన్ని వివరాలూ ఆన్లైన్లోనే.. జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నుంచి వచ్చే పర్ క్యాపిటా, సీవరేజీ, స్టాంపు డ్యూటీ, టీఏడీఏ, బీఆర్జీఎఫ్, ఆర్థిక సంఘం నిధులు, ఏసీడీపీ, ఎస్ఎఫ్సీ, పైకా నిధుల వివరాలను ఈ సాఫ్ట్‌వేర్‌లో పొందుపరుస్తారు. ఆ నిధులతో చేపట్టిన పనుల వివరాలు, చెల్లింపులు, వ్యయం, వినియోగం తదితర అంశాలను ఎప్పటికప్పుడు అన్లైన్ చేయాల్సి ఉంటుంది. నిధులు ఎవరికి చెల్లించారో వారి పేరు, చెల్లించిన మొత్తానికి ఎంబీల రికార్డులు, బ్యాంకులకు జారీ చేసిన చెక్కుల వివరాలు కూడా తప్పకుండా జతచేయాల్సిందే. ఈ ఆన్లైన్ అకౌంటింగ్ విధానం 2010-11 ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది. అడ్రస్‌లేని ఎంబీలు జిల్లాలోని పలు మండలాలతో పాటు మెజార్టీ గ్రామ పంచాయతీల్లో చేపట్టిన పనుల చెల్లింపులకు సంబంధించిన ఎంబీ రికార్డులు లేవన్న విషయం జిల్లా పరిషత్ అధికారుల పరిశీలనలో తేలింది. కొన్ని మండలాల్లో నిధులు డ్రా చేసుకున్నా క్యాష్‌బుక్కుల్లో ఎలాంటి వివరాలు లేకపోవడం వల్ల అన్లైన్ చేయలేక పోతున్నట్లు టైపిస్టులు ఇచ్చిన ఫిర్యాదులతో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. దీనికితోడు అప్పుడు పనిచేసిన ఉద్యోగుల్లో కొందరు బదిలీ కావడం వల్ల వివరాలు దొరకడం లేదని ఉద్యోగులు చెబుతున్నారు. ఫిర్యాదులు అందిన మండలాలను గుర్తించిన జెడ్పీ సీఈఓ ఆంజనేయులు ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు తిన్న డబ్బులకు లెక్కలు చూపేందుకు ఆయా మండలాల్లోని ఉద్యోగులు నానా కష్టాలు పడతున్నారు. జిల్లాలోని 1006 గ్రామ పంచాయతీలకు గాను 812 పంచాయతీల్లో చెల్లింపుల వివరాలు అన్లైన్ చేయలేదు. ఈనెల 30వ తేదీలోగా 2013-14 ఆర్థిక సంవత్సరం వివరాలను అన్లైన్ చేయాలని సీఈఓ డెడ్‌లైన్ పెట్టడంతో ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నామమాత్రంగా ఆడిట్ ప్రతి ఆర్థిక సంవత్సరం ముగిసిన వెంటనే ఆడిట్ విభాగం ఈ సాఫ్ట్వేర్ ద్వారా ఆడిట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా అమలుకావడం లేదు. ఈ సాఫ్ట్‌వేర్‌పై వినియోగంపై ఆడిట్ విభాగం వారికి శిక్షణ కూడా ఇచ్చారు. అయినా పాత పద్ధతిలోనే క్యాష్‌బుక్కుల్లో ఆడిట్ చేసి చేతులు దులుపుకుంటున్నారు. తూతూమంత్రంగా ఆడిట్ నిర్వహించి మమ అనిపించేందుకు ఆడిట్ అధికారులు ముడుపులు తీసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెతున్నాయి. అభివృద్ధి పనుల నిధులు స్వాహా కాకుండా ఆగాలంటే ప్రతీరోజూ పర్యవేక్షణ చేయడం ఒక్కటే మార్గమని జెడ్పీ అధికారులు అంటున్నారు. -
జ్ఞాపకాల జాడలలో ఓ క్రాంతదర్శి
వి.బి. రాజుగా సుప్రసిద్ధులైన వల్లూరు బసవరాజు ఇరవయ్యో శతాబ్దంలో తెలుగువారి చరిత్రను ప్రభావితం చేసిన అగ్రనేతలలో ఒకరు. గుంటూరు జిల్లాలోని వల్లూరు గ్రామం లోని సాధారణ కుటుంబంలో 1914లో జన్మించిన రాజు స్వయంకృషితో ఒక గొప్ప నాయకుడుగా ఎదిగారు. ఇంజనీరుగా వృత్తి కొనసాగిస్తూనే హైదరాబాదులో కార్మికోద్యమానికి పునాదులు వేశారు. హైదరాబాద్ విముక్తి పోరాటానికీ, ఆంధ్రోద్యమానికీ ఆకర్షితులై, స్వామి రామానంద తీర్థ, బూర్గుల రామకృష్ణారావు, కొండా వెంకట రంగారెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి వంటి అగ్రనేతలతో కలిసి పనిచేశారు.హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమయ్యాక వెల్లోడీ నాయకత్వాన మొదటి మంత్రివర్గం ఏర్పడినప్పుడు రాజుకందులో స్థానం లభించింది. తర్వాత బూర్గుల రామకృష్ణారావు మంత్రి వర్గంలోనూ పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ అవతరించాక ఆయన ప్రణాళికశాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ రాజ్ వ్యవస్థ ఏర్పడటానికి కారకులయ్యారు. మంత్రి వర్గం నుండి బయటకు వచ్చాక ఆయన ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ చైర్మన్‌గా నియమితులయ్యారు. రెండేళ్ళ పదవీకాలంలో మొదటిసారిగా రాష్ట్రంలో రాత్రి బస్ సర్వీసును పరిచయం చేసింది ఆయనే. విలువైన ప్రయాణ సమయాన్ని ఆదా చేసే నైట్ సర్వీస్ నాటి నుండి ఎంతో ప్రజాదరణ పొందింది. రాజ్యసభ సభ్యులుగా, రాజ్యసభ ప్యానెల్ చెయిర్ పర్సన్‌గా జాతీయ రాజకీయాల్లోనూ ఆయన ప్రముఖ పాత్ర వహించారు వి.బి.రాజు. ప్రజాచైతన్యం కలిగించాలంటే పత్రికారంగంలో ప్రవేశించి, సంఘ విద్రోహుల అక్రమాలను, దుశ్చర్యలను బట్టబయలు చెయ్యాలనీ, సామాన్యుడిలో రాజకీయ స్పృహ జాగృతం చెయ్యాలనీ భావించి ‘ఆంధ్ర జనత’ దినపత్రికను నడిపించారు. తర్వాత ఆంగ్లంలో ‘డైలీ న్యూస్’ దినపత్రికను స్వీయ సంపాదకత్వంలో తెచ్చారు. స్వాతంత్య్ర యోధురాలు సూర్యదేవర రాజ్యలక్ష్మి అండతో ‘తెలుగు దేశం’ అనే పత్రిక నడిపారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలలో పాల్గొంటున్న మన దేశ ప్రతినిధి వర్గ సభ్యుడుగా ఎంపికయ్యారు. ఆ బాధ్యతను ప్రతిభావంతంగా నిర్వహించారు. తెలుగు నేలపై, ముఖ్యంగా తెలంగాణా ప్రాంతంలో వి.బి. రాజును తమ గురువుగా భావించిన చాలా మంది రాజకీయ నేతలున్నారు. (వి.బి. రాజు రాసుకున్న అసంపూర్తి ‘ఆత్మకథ’ నుంచి కొన్ని భాగాలు...) ‘‘మొదటిసారి నేను హైదరాబాద్ నగరాన్ని చూసినది 1932వ సంవత్సరంలో. అప్పటికి నేను ఇంకా మద్రాసు గిండీ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థిని. సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా తీసుకొని తిరిగి 1934లో హైదరాబాద్ చేరుకొని ఇక్కడే స్థిరపడటానికి ఇష్టపడ్డాను. అప్పటికి నా వయస్సు పందొమ్మిదేండ్లే. తరువాత మూసీనది సాక్షిగా ఎన్నో పరిణామాలు సంభవించాయి. 1947 జూన్ నుంచి 1948 సెప్టెంబరు వరకు, అంటే పధ్నాలుగు, పదిహేను నెలల తీవ్ర పోరాటాల అనంతరం ఈ పరిణామాలు కొలిక్కి వచ్చాయి. నేను హైదరాబాద్‌లో స్థిరపడిన మొదటి ఏడాదే, అంటే 1934లోనే ఖమ్మం మెట్టులో జరిగిన మూడవ నైజాం స్టేట్ ఆంధ్ర మహాసభలకు ఒక సందర్శకుడుగా హాజరయ్యాను. ఆ రోజులలో రాజకీయాభిప్రాయాలను వ్యక్తం చేయటానికి గాని, కనీసం సంఘ సంస్కరణలను చర్చించడానికిగాని సంస్థాన ప్రభుత్వం అనుమతి ఇచ్చేవారు కారు. తెలంగాణా ప్రజలకు సంబంధించిన కీలకమైన అనేక ముఖ్య విషయాలపై నేను అభిప్రాయాలు ఏర్పరచుకొనటానికి సురవరం ప్రతాపరెడ్డి గారితో ఏర్పడిన సాన్నిహిత్యం అవకాశం కలిగించింది. బెజవాడలో స్టేట్ కాంగ్రెస్ కార్యాలయాన్ని స్థాపించిన నాకు అక్కడి ప్రజల నుంచి మంచి మద్దతు లభించింది. అయ్యదేవర కాళేశ్వరరావు తన ఇంటినే స్టేట్ కాంగ్రెస్ ఆఫీసు పెట్టుకోవడానికి ఇచ్చారు. హైదరాబాద్ ప్రజల ఉద్యమానికి సంపూర్ణ సహకారాన్ని అందించడానికి ముందుకొచ్చిన అక్కడి వారిలో మొదటి వ్యక్తి అయ్యదేవర కాళేశ్వరరావు. మొత్తం పధ్నాలుగు నెలల కాలం ప్రజాపోరాటం కొనసాగింది. వేలాది కుటుంబాలు సంస్థానం వదలి వెళ్లిపోయాయి, మరెందరినో రజకార్లు హతమార్చారు. హైదరాబాద్ సమస్యను పరిష్కరించడానికి ఏ వ్యూహం, ఏ విధానం అనుసరించాలనే విషయంలో ఢిల్లీలోని అగ్ర నాయకుల మధ్య విభేదాలు తలెత్తడం, నిజామ్తో ఒక అవగాహనకు వచ్చే విషయంలో లార్డ్ మౌంట్ బాటన్ జోక్యం చేసుకోవటం అనే రెండు పరిణామాలు, లక్షలాది ప్రజలు నిండు పధ్నాలుగు నెలల దీర్ఘకాలం దుర్భరమైన కష్టాలు అనుభవించటానికి ముఖ్య కారణాలయ్యాయి. యథాతథ ఒప్పందం తరువాత భారత సైన్యాలను బొలారం నుంచి ఉపసంహరించటం వల్ల చాలా మంది ప్రజల మానసిక స్థైర్యం దెబ్బతిని సంస్థానం వదిలిపోయే పరిస్థితి కలిగింది. రజాకార్లు హింసాకాండను ఉధృతం చేయటానికి కూడా ఇదే దోహదం చేసింది. పోలీస్ ఏక్షన్ (ఆపరేషన్ పోలో) మొదటి నుంచి భారత ప్రభుత్వం ఇలా మెతక విధానాన్ని ప్రదర్శిస్తుండటం వల్లనే నిజామ్ నవాబు, అతడి ప్రభుత్వం, రజాకార్లు కూడా మొండికెత్తుతూ, పొగరుబోతులుగా ప్రవర్తిస్తూ వచ్చారు. మౌంట్ బాటన్ సూచించిన పరిష్కారాన్నే గనుక నిజామ్ ఒప్పుకొని ఉంటే హైదరాబాద్ దుర్గతి పాలై ఉండేది. హిందువులకి ముస్లిములకి మధ్య ఇక మరెన్నటికీ కలసే వీలు లేని పెద్ద అగాథం ఏర్పడి ఉండేది. స్వతంత్ర భారత చరిత్ర మరొక విధంగా ఉండేది. ‘‘నిజామ్ నవాబు పాలనలోని హైదరాబాద్ సంస్థానం ఇండియాకు ‘కడుపులో రాచపుండు’ ’’ అని సర్దార్ పటేల్ చాలా చక్కగా వర్ణించారు. మౌంట్‌బాటన్ పుణ్యాన ఆ రాచపుండు ఎప్పటికీ అలా ఉండే పోవటమే గాక భారత ప్రాదేశిక సమగ్రతకు ఎప్పటికీ ముప్పు ఏర్పడి ఉండేది. ఏది ఏమైనా, నిజామ్ నవాబును ఎంతో బుజ్జగించారు గానీ లాభం లేకపోయింది. చివరకు జరగవలసింది జరగనే జరిగింది. పరిణామాలన్నీ ‘పోలీస్ యాక్షన్’ అనే చర్యకు దారితీశాయి. భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో ఈ పధ్నాలుగు నెలల పోరాటం అత్యంత దీర్ఘమైనది. చాలా కుటుంబాలు ఇళ్లూ, ఊళ్లూ వదలి వెళ్లిపోయాయి. అప్పటి జ్ఞాపకాలు తలచుకొంటేనే బాధ కలుగుతుంది. పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగాయి.’’ -
ప్రజాప్రతినిధుల్లేరు.. అధికారులూ లేరు
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మ వంటి పంచాయతీరాజ్ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తోంది. ఎన్నికలు జరపకపోవడంతో ప్రజాప్రతినిధులు లేకపోగా.. మరోవైపు అధికారులను ప్రభుత్వం నియమించలేదు. ఫలితంగా పంచాయతీరాజ్ పాలన పడకేసింది. ప్రధాన పోస్టులతోపాటు క్షేత్రస్థాయిలోని పోస్టులన్నింటినీ ఇన్చార్జిలతో నెట్టుకొస్తున్నారు. దీంతో పర్యవేక్షణ కొరవడి.. పథకాలు సజావుగా సాగని పరిస్థితి నెలకొంది. ఫలితంగా ఆయా పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీనికితోడు సక్రమంగా నిధుల వ్యయం జరగడం లేదు. ఫలితంగా కేంద్రం తన వాటాగా ఇవ్వాల్సిన నిధుల్లో కోతపెడుతోంది. జిల్లాల్లో జిల్లా పరిషత్‌లు కీలకభూమిక పోషిస్తాయని తెలిసినా ప్రభుత్వం వాటిలోని పలు పోస్టులను భర్తీ చేయట్లేదు. 22 జిల్లా పరిషత్‌లకుగాను రెండు జిల్లాల్లోనే సీఈవో పోస్టులను భర్తీ చేసి మిగిలినవి వదిలేశారు. డిప్యూటీ సీఈవో పోస్టులదీ అదే గతి. మొత్తం పోస్టులన్నీ ఖాళీ. అకౌంట్స్ అధికారి(ఏవో) పోస్టుల పరిస్థితీ ఇంతే. ఈ పోస్టులన్నీ ఖాళీగా ఉంటే.. మరోవైపు జిల్లాపరిషత్ల్లో ఒక్కోచోట అదనంగా మూడు డిప్యూటీ సీఈవో పోస్టులను భర్తీ చేయాలన్న ప్రతిపాదనలుండడం గమనార్హం. అంతటా ఖాళీలు: పలు సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో అధికారులే అమలు చేయాల్సి ఉంటుంది. అయితే క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలు చక్కపెట్టాల్సిన మండల అభివృద్ధి అధికారుల(ఎంపీడీవో) పోస్టులు వంద వరకు ఖాళీగా ఉన్నాయి. మండలానికి, పంచాయతీలకు మధ్యవర్తిగా ఉంటూ పంచాయతీల పనితీరును పర్యవేక్షించాల్సిన ఈవోపీఆర్డీ పోస్టులు వందలసంఖ్యలో ఖాళీగా ఉంటే.. గ్రామాల్లో పనులు పర్యవేక్షించాల్సిన పంచాయతీ కార్యదర్శుల పోస్టులు వేల సంఖ్యలో ఖాళీగా ఉన్నాయి. మరోవైపు ఉద్యోగుల సీనియారిటీ నిర్ణయాన్ని గందరగోళంగా మార్చడంతో పదోన్నతులు రాని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇన్‌చార్జిలతోనే పాలన నెట్టేయాలని సర్కారు భావిస్తోంది. పం చాయతీరాజ్ శాఖలో ఏం జరుగుతున్నదన్న విషయంపై సీఎం కిరణ్‌కానీ, ఆ శాఖ మంత్రి జానారెడ్డికానీ సంయుక్తంగా ఒక్క సమావేశమూ నిర్వహించకపోవడం గమనార్హం. పథకాలు గ్రామస్థాయిలో అమలవ్వాలంటే.. ఈ ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. కానీ ఈ బాధ్యతను ప్రభుత్వం గుర్తించడం లేదన్న భావన వ్యక్తమవుతోంది. పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రాముఖ్యత తెలిసి కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం గమనార్హం. కాగా పలు పోస్టులు ఖాళీగా ఉండడంతో ఇతర శాఖల అధికారులు డిప్యుటేషన్ పేరుతో తిష్టవేయడానికి ప్రయత్నిస్తుండగా.. వారికి మంత్రులు సహకారమందించడం కొసమెరుపు.