సమష్టిగా పనిచేద్దాం.. సమగ్రాభివృద్ధి సాధిద్దాం
జడ్పీ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో చైర్‌పర్సన్ గడిపల్లి కవిత
ఖమ్మం జెడ్పీసెంటర్: ఉద్యోగులు, ప్రజాప్రతినిధులనే తేడా లేకుండా అందరం సమష్టిగా పనిచేద్దామని, జిల్లా సమగ్రాభివృద్ధి సాధిద్దామని జిల్లాపరిషత్ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత అన్నారు. జిల్లాపరిషత్ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఆదివారం నగర శివారులోని చెరుకూరి వారి మామిడి తోటలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ఉద్యోగులు, అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థ కీలకమైనదని అన్నారు.
జిల్లాపరిషత్ సీఈవో జయప్రకాష్ నారాయణ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అప్పగించిన ప్రతి పనిని బాధ్యతాయుతంగా పూర్తి చేస్తున్నందునే జడ్పీకి మంచి పేరు వచ్చిందన్నారు. ఉద్యోగులు, అధికారుల మధ్య చక్కటి సమన్వయూనికి ఈ ఆత్మీయ సమ్మేళనం దోహదపడుతుందన్నారు. డిప్యూటీ సీఈవో కర్నాటి రాజేశ్వరి మాట్లాడుతూ.. సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో పీఆర్ వ్యవస్థ ముందుంటోందని అన్నారు. జిల్లాపరిషత్ ఏఓ వింజం అప్పారావు మాట్లాడుతూ.. జిల్లాపరిషత్ కుటుం బమంతా ఇలా గడపడం ఆనందంగా ఉందన్నారు.
పీఆర్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు నడింపల్లి వెంకటపతిరాజు మాట్లాడుతూ.. జడ్పీ ఉద్యోగులమంతా సమన్వయంతో పనిచేశామని, పలు కార్యక్రమాల అమలులో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేశామని అన్నారు. దీనిని మున్ముందు కూడా కొనసాగిస్తామన్నారు. ఉద్యోగుల మధ్య స్నేహ సంబంధాల పెంపునకు ఈ సమ్మేళనం దోహదపడుతుందన్నారు. వచ్చేసారి జిల్లావ్యాప్తంగా పంచాయతీరాజ్ ఉద్యోగులందరితో సమ్మేళనం నిర్వహిస్తామన్నారు. ఈ సమ్మేళనంలో భాగంగా జరిగిన పలు క్రీడాపోటీలలో ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కళాకారుల పాటలు ఆకట్టుకున్నాయి.